పులులు సంరక్షణ ఇలాగేనా!

6 Nov, 2018 00:41 IST|Sakshi

మనుషుల ప్రాణాలకే విలువ లేకుండా పోతున్న వర్తమానంలో మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లా బోరాతి గ్రామంలో శుక్రవారం రాత్రి పులిని కాల్చిచంపిన ఉదంతం చుట్టూ అల్లుకుంటున్న వివాదం కొందరికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. దీనిపై కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేన కాగాంధీ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి సుధీర్‌ ముంగం టివార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమె వరస ట్వీట్లు హోరెత్తించారు. ‘అవని’ పేరుతో ఉన్న ఆ ఆడ పులిని ‘ఘోరంగా హత్య చేసిన తీరు’పై తాను చట్టపరంగా, రాజకీయపరంగా చర్యలు తీసుకుంటా నన్నారు. పులిని సంహరించిన నవాబ్‌ అస్ఘర్‌ అలీ ఖాన్‌ హైదరాబాద్‌కు చెందినవారు. తమ తొలి ప్రాధాన్యం సమస్యాత్మకంగా మారిన వన్య మృగాలను మత్తుమందు ప్రయోగించి పట్టుకోవడ మేనని అస్ఘర్‌ చెబుతుండగా...‘అవని’ని చంపమని మంత్రి నేరుగా ఆదేశాలిచ్చారన్నది మేనక అభి యోగం. పులిని మట్టుబెట్టడంలోని ఉచితానుచితాల సంగతలా ఉంచి ఈ ఉదంతంపై స్పందిం చాల్సిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇంతవరకూ మౌనంగా ఉండి పోయారు. కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేనకాగాంధీ మూగజీవాలు, వన్యప్రాణుల సంర క్షణ రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్నందువల్ల కావొచ్చు... గట్టిగానే స్పందించారు. పైగా మహారాష్ట్రలో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమేనన్న సంగతి కూడా ఆమె మరచినట్టున్నారు. అక్కడ వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే ఈపాటికే దీనిపై ఎంతో రచ్చ అయ్యేది.

ముంగంటివార్‌ చాలా జాగ్ర త్తగా జవాబిచ్చారు.‘మేనక హృదయంలో జంతువులపట్ల ఉన్న చాలా ప్రేమ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ దాంతోపాటు ఆమెకు మనుషులపట్ల కూడా అంతే ప్రేమ ఉందని నేను భావి స్తున్నాను’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  రెండునెలలక్రితం సుప్రీంకోర్టు ముందుకు ‘అవని’ గురించి వ్యాజ్యం వచ్చినప్పుడు దాన్ని మత్తుమందిచ్చి పట్టుకోవాలని, తప్పనిసరి పరి స్థితుల్లో కాల్చి చంపవచ్చునని ధర్మాసనం తెలిపింది. యావత్‌మాల్‌ ఉదంతం జరిగిన రెండు రోజులకు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ జిల్లాలో ఉన్న దూధ్వా టైగర్‌ రిజర్వ్‌లో మరో పులిని గ్రామ స్తులు చంపేశారు. ఒక గ్రామస్తుణ్ణి అది హతమార్చాక వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందని అంటు న్నారు. గుజరాత్‌లోని సెక్రటేరియట్‌లోకి ప్రవేశించిన మరో పులిని సోమవారం అటవీ సిబ్బంది మత్తుమందిచ్చి అదుపులోకి తీసుకోగలిగారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జీవ వైవిధ్యత పరిరక్షణ కీలకమని, అందుకోసం పులుల్ని సంరక్షించడం అవసరమని కేంద్రం గుర్తించాక 18 రాష్ట్రాల్లో 50 టైగర్‌ రిజర్వ్‌ల్ని ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం 89,164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అందుకోసం జనావాసాలను తరలించడానికి ప్రయత్నించినప్పుడు ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రైంది. తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ ప్రాంతాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం అడవుల్లోనూ ఈ టైగర్‌ రిజర్వ్‌లున్నాయి. వన్యప్రాణులు ఈ రిజర్వ్‌ల పరిధిలోనే ఉంటాయని చెప్పలేం. 30 శాతం పులులు ఆ  పరిధి దాటి సంచరిస్తుంటాయని ఒక అంచనా. టైగర్‌ రిజర్వ్‌లు ఏర్పాటుచేసి నప్పుడు అక్కడుండే పులుల సంఖ్య పెరిగేకొద్దీ వాటన్నిటికీ అవసరమైన స్థాయిలో ఆహారం లభ్య మవుతున్నదా అన్నది తరచు సమీక్షించి లోటుపాట్లు పూడ్చాలి. లేనట్టయితే అందుకోసం సహజం గానే అవి బయటకొస్తాయి. మన దేశంలో పులుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కనుక మున్ముందు పరిస్థితి మరింత వికటిస్తుంది. నాలుగేళ్లకోసారి జరిగే పులుల గణన ప్రక్రియ ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. 2014 గణాంకాల ప్రకారం దేశంలో వాటి సంఖ్య 2,226. ప్రస్తుత లెక్కింపు ప్రక్రియ ఫలితాలను వచ్చే ఏడాది మార్చికల్లా ప్రకటిస్తారు.

టైగర్‌ రిజర్వ్‌ల సమీప ప్రాంతాల్లో  ఆదివాసీల బతుకులు అత్యంత దుర్భరం. సాగుచేసుకునేం దుకు వారి సెంటు భూమి కూడా ఉండదు. ఆదివాసీ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ. 15,000 కూడా మించదని ఒక అంచనా. జీవిక కోసం వారు తప్పనిసరిగా అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడాలి. ఈ పరిస్థితుల్లో మనిషి–మృగం ఘర్షణ తప్పడం లేదు. పులుల్ని సజీ వంగా బంధించడం ఆషామాషీ కాదు. వాటిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమైనకొద్దీ అవి అనుభవం గడించి మరింత అప్రమత్తంగా మారతాయని, పర్యవసానంగా సమయం గడి చేకొద్దీ వాటిని బంధించడం అసాధ్యమవుతుందని వన్యప్రాణి సంరక్షకులు చెబుతారు. ఇప్పుడు యావత్‌మాల్‌ జిల్లాలో మట్టుబెట్టిన పులిని గత రెండేళ్లుగా బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. కనుకనే చివరికిలా పరిణమించిందని అంటున్నారు. పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు తదితరాలను వన్యప్రాణులంటున్నామంటేనే అవి అర ణ్యాల్లోని జంతువులని అర్ధమవుతుంది. టైగర్‌ రిజర్వ్‌ల పేరుచెప్పి జనావాసాలను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వాలు ఆ రిజర్వ్‌ల సమీపంలోనే అభివృద్ధి పేరిట పలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కన్హా, పెంచ్‌ రిజర్వ్‌ల కారిడార్‌లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే మహారాష్ట్రలోని మేల్ఘాట్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం నుంచే రైల్వే లైన్‌ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కెన్‌–బెత్వా నదుల్ని అనుసంధా నించే వివాదాస్పద ప్రాజెక్టు పూర్తయితే పన్నా టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలోని 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మునిగిపోతుందని, అక్కడి వన్యప్రాణులకు మంచినీరు కూడా దొరకదని అంచనా. అటవీ సంపద చట్టవిరుద్ధంగా తరలిపోతున్నా పట్టించుకోకపోవడం దీనికి అదనం. కనుకనే  ఆ జంతువులు జనావాసాల్లోకొచ్చి మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. తాజా ఉదంతాల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు పులులు సంరక్షణ విధానాన్ని సమీక్షించుకుని సవరించు కోవాలి. తమ చర్యల పర్యవసానాలులెలా ఉంటున్నాయో గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు