నిలదీస్తున్న హాంకాంగ్!

30 Sep, 2014 23:19 IST|Sakshi

ప్రశ్నలన్నీ శూన్యంలోకి మౌనంగా నిష్ర్కమించవు. మొలకెత్తిన ప్రశ్నలను మొదలంటా తుదముట్టించామనుకున్నా అవి ఎక్కడో అక్కడ మళ్లీ తలెత్తుతాయి. అప్పుడవి మరింత శక్తిమంతమవుతాయి. సంజాయిషీని, జవాబును కోరుతూనే ఉంటాయి. పాతికేళ్లనాడు తియానాన్మెన్ స్క్వేర్‌లో విద్యార్థులడిగిన ప్రశ్నలకు అణచివేతే సమాధానమను కున్నారు ఆనాటి చైనా పాలకులు. ఎందరో విద్యార్థులు హతులై, మరి కొందరు జైళ్లపాలై తియనాన్మెన్ ఖాళీ అయింది. ఎప్పటిలానే అది ప్రశాంతంగా ‘మారింది’. అది చూసి అంతా అణిగిపోయిందనుకున్నారు వాళ్లు. కానీ, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అవే ప్రశ్నలు హాంకాంగ్‌లో వినబడు తున్నాయి. హాంకాంగ్ సెంట్రల్‌లో సమీకృతులైన లక్షలమంది విద్యార్థులు ప్రజాస్వామ్య విలువల విషయంలో మీ వైఖరేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకిచ్చిన హామీలను గౌరవించాలని కోరుతున్నారు. చైనాలో అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలు తమ వద్ద చెల్లబోవని చెబుతున్నారు. ఒకపక్క బుధవారం చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్న తరుణాన ఈ నిరసనేమిటని చైనా నేతలు రుసరుసలాడుతున్నా ఇవి ఆగడంలేదు. తియానాన్మెన్ స్క్వేర్‌లో ఆనాడు శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులపై శతఘు్నలు, ఏకే-47లు గర్జించాయి. ఇప్పటికైతే హాంకాంగ్‌లో ఇంకా ఆ పరిస్థితులు రాలేదు. లాఠీచార్జిలు, అరెస్టులు, బాష్పవాయు గోళాల ప్రయోగం వంటివి గడిచాయి. మరోపక్క ‘ఆక్యుపై సెంట్రల్’ (సెంట్రల్‌ను ఆక్రమించండి) అంటూ సాగుతున్న ఉద్యమంలోకి విద్యార్థులు, ఇతరులు ప్రవాహంలా వచ్చి చేరుతున్నారు. ఇప్పుడక్కడ పదిలక్షల మంది ఉన్నారని అంచనా.

బ్రిటన్‌కున్న 99 ఏళ్ల లీజు గడువు ముగిశాక 1997 జూలై 1న హాంకాంగ్ తిరిగి చైనా పరిధిలోనికి వచ్చింది. ఆ సందర్భంగా అప్పటి చైనా పాలకులు హాంకాంగ్ ప్రజలకు సార్వత్రిక ఓటు హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2017లో జరగబోయే రిఫరెండంలో ఈ విధానాన్నే అమలు చేస్తామని చెప్పారు. అంతకు చాలాకాలం క్రితమే డెంగ్ జియావో పెంగ్ ‘ఒకే దేశం-రెండు వ్యవస్థలు’ అని హామీ ఇచ్చారు. చైనాలో తాము అమలు చేస్తున్న విధానాన్ని హాంకాంగ్‌పై రుద్దబోమన్నారు. హాంకాంగ్ పాలన కోసం మౌలిక చట్టం చేశారు. మరో యాభైయ్యేళ్లపాటు ఆ చట్టంకిందే హాంకాంగ్‌కు స్వయంపాలన ఉంటుందని ఊరించారు. తమ ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యాపారవేత్తలు, ఇతరేతర రంగాలకు చెందిన ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ హాంకాంగ్ పాలన కోసం ఒక సీఈఓను ఎన్నుకున్నది. కమిటీలో క్రమేపీ ప్రజలు ఎన్నుకునే ప్రతినిధుల సంఖ్యను పెంచుతూ వచ్చారు. చివరకు 2017నాటికి సీఈఓను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానాన్ని అమలు చేస్తామని ఆరోజుల్లో చైనా హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ సమయం ఆగమించేసరికి స్వరం మారుస్తున్నది. తాము ఎంపిక చేసిన మేయర్‌నే ‘ప్రజాస్వామ్యబద్ధం’గా ఎన్నుకోమని హితవు చెబుతున్నది. ‘దేశభక్తి పరులైన’, ‘చైనాను ప్రేమించే’ వ్యక్తులను ప్రతినిధులుగా ఎన్నుకుంటేనే హాంకాంగ్‌కు బంగారు భవిష్యత్తు ఉంటుందంటున్నది.  హాంకాంగ్ బ్రిటన్ వలసగా ఉన్నప్పటినుంచీ అక్కడ ఉదారవాద ప్రజాస్వామ్యం ఉన్నది. స్వేచ్ఛగా పనిచేసే మీడియా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నాయి. వీటిపై క్రమేపీ ఆంక్షలు విధించడం మొదలైంది. భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేస్తున్న చానెళ్లను ఎంచుకుని, వాటి లెసైన్స్‌ల గడువు ముగిశాక పునరుద్ధరించడాన్ని నిలిపేస్తున్నారు. గత కొంతకాలంగా ఇది కొనసాగుతున్నది. అప్రకటిత సెన్సార్‌షిప్ చాపకింది నీరులా చేరుతున్నది. పదిహేడేళ్లక్రితం చేసిన వాగ్దానాలకు ఈ ఆచరణ విరుద్ధంగా ఉన్నదని హాంకాంగ్ పౌరులు ఆరోపిస్తున్నారు. ఈ బాపతు ‘ప్రజా స్వామ్యం’ మాకొద్దంటున్నారు. బ్రిటన్ వలస ప్రాంతంగా ఉన్నప్పుడు హాంకాంగ్‌ది వేరే ప్రపంచం. అక్కడ బ్రిటన్‌లో ఉన్నపాటి రాజకీయ వాసనలు కూడా ఉండేవికాదు. అలాంటిచోట ఇప్పుడు లక్షలమంది ఉద్యమించడం వింతే. దీనికి నాయకత్వం వహిస్తున్న విద్యార్థులు వెంటనే సెంట్రల్‌ను ఖాళీచేయాలని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లూంగ్ చున్-ఇంగ్ విజ్ఞప్తి చేస్తుంటే... వాగ్దానభంగం చేసినందుకు ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండు చేస్తున్నారు.

 హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమం పుట్టి విస్తరించడానికి ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం హద్దులు దాటుతున్నా దానికి అనుగుణంగా పెరగని జీతాలు, కానరాని నిరుద్యోగ భృతి, పెన్షన్ సదుపాయాలేమి ప్రజల అసంతృప్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఇరాక్ వరకూ ప్రజాస్వామ్యం ఎక్కడ భగ్నమైనట్టు కనిపించినా కన్నెర్రజేస్తున్న అమెరికా, మిత్రదేశాలకు హాంకాంగ్ నిరసనలు వినిపించినట్టు లేదు. చైనాకు ఆగ్రహం కలిగించడం ఇష్టం లేకనో, ఐఎస్‌ఐఎస్‌నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో తలమునకలైనందువల్లనో హాంకాంగ్ విద్యార్థి ఉద్యమంపై ఎలాంటి అభిప్రాయమూ వెల్లడించలేదు. ఇప్పటికి శాంతియుతంగా నడుస్తున్న ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే భావోద్వేగాలు పెరిగి పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో హామీ ఇచ్చిన తరహాలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిపిస్తే ప్రత్యర్థులదే పైచేయి అవుతుందేమోనన్న ఆందోళన చైనా పాలకులకు ఉన్నట్టుంది. తియ నాన్మెన్ స్క్వేర్‌లో తాము పాతికేళ్లక్రితం గొంతు నొక్కిన ఉద్యమం వంటిదే ఇక్కడ వెల్లువెత్తడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి ఏమాత్రం తలొగ్గినట్టు కనబడినా చైనాలోనూ ఇలాంటి పోకడలు పుట్టుకొస్తాయని బెదురుతున్నారు. చైనాకు ఈ భయాలు సహజమే... మరి అగ్రరాజ్యాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి? ఇది హాంకాంగ్ వాసుల ప్రశ్న.
 
 
 

మరిన్ని వార్తలు