బ్లెయిర్ 'పరివర్తన'

27 Oct, 2015 00:16 IST|Sakshi

 యుద్ధమంటే విమానాలు, ద్రోన్‌లు కురిపించే బాంబుల వర్షం... శతఘ్నుల మోతలు, క్షిపణి దాడులు...ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రమే కాదు. యుద్ధమంటే సమాజాన్ని నడిపించే సకల వ్యవస్థలపైనా దాడి చేయడం. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ వ్యవస్థలన్నిటినీ రూపురేఖల్లేకుండా ధ్వంసం చేయడం. ఒక్క మాటలో- జీవితాన్ని నిర్మించే, నిలబెట్టే వాటిన్నిటినీ నాశనం చేయడం. మనుషులందరినీ అమానవీకరించడం. ఇరాక్‌లో పన్నెండేళ్లక్రితం ఇంతటి ఘోరకలికి కారకులైనవారిలో ఒకరైన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తొలిసారి ఆ దురాక్రమణ యుద్ధానికి క్షమాపణ చెప్పారు. ఇరాక్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయన్న తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా ఆ దేశంపై యుద్ధం ప్రకటించామని ఆయన ప్రకటించారు.

అయితే అది బేషరతు క్షమాపణ కాదు. అమెరికాతో కలసి సాగించిన ఆ యుద్ధంవల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారని... తాము రాజేసిన మంట ఇప్పటికీ ఇరాక్‌ను దహించివేస్తూ నిత్యం అక్కడి పౌరులను బలిగొంటూనే ఉన్నదన్న చింత ఆయనకేమీ లేదు. తమ ప్రణాళికలో... ముఖ్యంగా సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోశాక ఏం జరిగే అవకాశం ఉందో అంచనా వేయడంలో విఫలమైనందుకు ఆయన బాధపడుతున్నారు. సద్దాంను కూలదోయడం సరైందేనని ఇప్పటికీ బ్లెయిర్ విశ్వసిస్తున్నారు. తమ చర్య పర్యవసానంగా ఇరాక్‌లో తొలుత అల్-కాయిదా, ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదం వేళ్లూనుకున్నాయన్న వాదనతో ఆయన పూర్తిగా ఏకీభవించడంలేదు. నాలుగేళ్లక్రితం అరబ్ ప్రపంచాన్ని ఊపేసిన ప్రజాస్వామిక ప్రభంజనం కూడా అందుకు దోహదపడిందని వాదిస్తున్నారు. ఐఎస్ పుట్టింది సిరియాలో తప్ప ఇరాక్‌లో కాదని తర్కిస్తున్నారు.


 జార్జి బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ దేశంతో కలిసి బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలూ సాగించిన దురాక్రమణ యుద్ధం మానవేతిహాసంలోనే భయానకమైనది. 2003లో ప్రారంభమైన ఆ యుద్ధం పర్యవసానంగా పది లక్షలమందికిపైగా దుర్మరణం చెందారు. మరిన్ని లక్షలమంది వికలాంగులుగా, అనాథలుగా మిగిలారు. మెరుగైన జీవనప్రమాణాలతో ప్రశాంతంగా ఉండే ఇరాక్ ఆ యుద్ధం తర్వాత నిత్య సంక్షుభిత దేశంగా మారిపోయింది. అక్కడ ప్రభుత్వాలు ఏర్పడినా అవి నామమాత్రంగా మిగిలాయి.  రెండు ప్రధాన తెగలైన షియా, సున్నీల మధ్య భీకర సంగ్రామం...అందులో భాగంగా చోటుచేసుకునే ఆత్మాహుతి దాడులు ప్రతిరోజూ జనం ఉసురు తీస్తున్నాయి. ఈ తెగల పోరులో పుట్టుకొచ్చిన ఐఎస్ దేశంలో గణనీయమైన ప్రాంతాన్ని తన గుప్పిట బంధించింది. ఇరుగుపొరుగు దేశాలకు సైతం పాకుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తోంది.  


 బుష్, బ్లెయిర్ ద్వయం చేసిన నేరాలెలాంటివో, వాటి పర్యవసానాలేమిటో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలుసు. 2003లో దురాక్రమణ యుద్ధానికి పూనుకున్నప్పుడే అనేకులు దాన్ని నిరసించారు. అందుకు చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ నిజం కాదని ఎలుగెత్తారు. కేవలం ఇరాక్ చమురు బావులపై కన్నేసి, ఉగ్రవాదాన్ని సాకుగా చూపి ఆ దేశంపై దండెత్తుతున్నారని చెప్పారు. అయినా ఆ మారణహోమాన్ని బుష్, బ్లెయిర్‌లు ఆపలేదు. యుద్ధం చేయకపోతే ఎప్పుడైనా కేవలం 45 నిమిషాల వ్యవధిలో సద్దాం హుస్సేన్ బ్రిటన్‌పై జన హనన ఆయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉన్నదని ఊదరగొట్టారు. సామూహిక జన హనన ఆయుధాల విషయంలో బ్రిటన్‌కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్(ఎంఐ)6 నివేదికలు తమను పక్కదోవ పట్టించాయని ఇప్పుడు బ్లెయిర్ చెబుతున్నది వాస్తవం కాదు. ఆ నివేదికలు రావడానికి ఏడాది ముందే బ్లెయిర్ ఈ యుద్ధానికి సిద్ధమయ్యారని ఈమధ్యే అమెరికాలో వెల్లడైన నోట్ చెబుతోంది.

2002లో ఆనాటి అమెరికా విదేశాంగమంత్రి కోలిన్ పావెల్ బుష్‌కు పంపిన నోట్ అది. ఈ దురాక్రమణ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదని, దేశ చట్టాల ప్రకారం కూడా చెల్లుబాటు కాదని బ్రిటన్ న్యాయ విభాగం అధికారులు ఆరోజున మొత్తుకున్నారు. ఆ దేశ పార్లమెంటు సంగతలా ఉంచి, తన కేబినెట్‌కి సైతం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా బ్లెయిర్ దురాక్రమణకు సై అన్నారు. దురాక్రమణకు దిగితే యుద్ధ నేరాల కింద బోనెక్కే పరిస్థితి ఏర్పడవచ్చునని హెచ్చరిస్తూ ఆ దేశ అటార్నీ జనరల్ లార్డ్ గోల్డ్ స్మిత్ సమర్పించిన నోట్‌ను బ్లెయిర్ కేబినెట్ కంటపడనీయలేదు.


 ఇంతకూ ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా ఆ యుద్ధం పొరబాటేనని పాక్షికంగానైనా బ్లెయిర్ ఎందుకు ఒప్పుకున్నట్టు? అదీ తమ దేశ మీడియాకు కాక అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంలోని ఆంతర్యమేమిటి? ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్రపై ఏర్పాటైన జాన్ చిల్కాట్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక కోసం బ్రిటన్‌లో అన్ని వర్గాలూ... మరీ ముఖ్యంగా యుద్ధ వ్యతిరేక ఉద్యమకారులు ఎదురుచూస్తున్నారు. నివేదిక సమర్పణలో జాప్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో వెల్లడికానున్న ఆ నివేదికలో బ్లెయిర్ వ్యవహార శైలిపై...ముఖ్యంగా పలు వాస్తవాలను ఆయన తొక్కిపెట్టడంపై నిశితమైన విమర్శలుండవచ్చునని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యుద్ధ నేరస్తుడిగా ఆ నివేదిక నిర్ధారించిన పక్షంలో నలువైపులనుంచీ తనపై దాడి తప్పదని గ్రహించబట్టే పాక్షిక క్షమాపణకైనా బ్లెయిర్ సిద్ధపడ్డారు. ఆ సంగతిని కూడా తమ మీడియాకు చెబితే ప్రస్తుత పరిస్థితుల్లో కాకుల్లా పొడుస్తారన్న భయంతో అమెరికా చానెల్ సీఎన్‌ఎన్‌ను ఆశ్రయించారు. యుద్ధమూ, దాని పర్యవసానాలూ క్షమాపణలతో ముగిసిపోయేవి కాదు. అలాంటి నేరానికి పాల్పడేవారు విచారణను ఎదుర్కొనవలసిందే. శిక్షకు సిద్ధపడాల్సిందే. బ్లెయిర్ అయినా, మరొకరైనా అందుకు మినహాయింపు కాదు.

మరిన్ని వార్తలు