వలసలపై నిప్పులు!

13 May, 2015 00:49 IST|Sakshi

 యూరప్‌ను ఆవరించిన మంచుతెరలు క్రమేపీ మాయమవుతుండగా మధ్యధరా సముద్రానికి ఆవలి తీరంలోని ఆఫ్రికా ఖండవాసులకు ఆశలు మోసులెత్తుతాయి. ముంచుకొచ్చే మత్యువునుంచీ.... ఆకలి, అనారోగ్యం, అస్థిరతలనుంచి దూరంగా పారిపోవడానికి వారికి అదే అదును. పర్యవసానంగా ఏటా ఏప్రిల్ తర్వాత ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలనుంచి యూరప్‌కు వేల సంఖ్యలో జనం వలసబాట పడతారు. ఈ క్రమంలో వారు ఎక్కివచ్చే పడవలు ప్రమాదాల్లో చిక్కుకుని వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారు. ఇకపై ఇలాంటి అక్రమ వలసలను అరికట్టడానికి కఠిన చర్యలకు ఉపక్రమించాలని యూరప్ యూనియన్ (ఈయూ)తీసుకున్న తాజా నిర్ణయం అందరినీ ఆందోళనపరుస్తున్నది.

ఇందులో భాగంగా వలసలు అధికంగా ఉండే లిబియా తీరంలోని పడవలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేయాలన్నది ఆ నిర్ణయం సారాంశం. ఇందుకు సంబంధించి భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా ఈయూ దేశాలు సిద్ధపడుతున్నాయి. యూరప్‌కు అక్రమ వలసలను అరికట్టడంపై గత కొన్ని వారాలుగా ఈ దేశాల మధ్య ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. గత నెలలో 900 మందితో బయల్దేరిన ఒక పడవ మార్గమధ్యంలో మునిగి అధిక సంఖ్యలో జనం మరణించిన ఉదంతం చోటుచేసుకున్నాక వలసలపై ఆ దేశాలు ప్రధానంగా దష్టి కేంద్రీకరించాయి. ఆ తర్వాత సైతం మరో మూడు ప్రమాదాలు జరిగి వందమంది వరకూ మరణించారు. ఇటలీ తీరప్రాంత నావికాదళం అక్రమంగా వస్తున్న 4,800మందిని గత నెలాఖరున అదుపులోకి తీసుకుంది. ఇంచుమించు అదే సమయంలో లిబియాలో బయల్దేరిన పడవను అడ్డగించి మరో 2,000మందిని అరెస్టుచేశారు. ఒక పెను సంక్షోభం ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టింది. వనరులున్నా వాటిని సక్రమంగా వినియోగించుకోలేని నిస్సహాయత, అక్కడి దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత ఉగ్రవాదానికీ, నేరస్త ముఠాలకూ చోటిస్తున్నాయి.

దిక్కూమొక్కూ లేని జనం ప్రాణాలు దక్కించుకోవడానికీ, అయినవారిని కాపాడుకోవడానికీ, కడుపుకింత తిండి సంపాదించుకోవడానికీ వలసబాట పడుతున్నారు. ఇందుకోసం జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్మును స్మగ్లర్ల చేతుల్లో పోసి కనీస సౌకర్యాలు కూడా లేని పడవలపై పిల్లాపాపలతో యూరప్ దేశాలకు వెళ్తున్నారు. ఈ ప్రయాణం ప్రాణాంతకమైనదని, పడవలో జనం ఎక్కువై ఊపిరాడకపోయినా...రాకాసి అలల తాకిడికి అసలు పడవే మునిగిపోయినా చావు తథ్యమని వారికి తెలుసు.

అయినా అనుక్షణమూ చస్తూ బతికేకన్నా ఏదో ఒకటి తేల్చిపారేసే ఈ ప్రయాణమే మెరుగని వారు భావిస్తారు. సిరియాలో అంతర్యుద్ధం, ఎరిత్రియాలో బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడం, లిబియాలో, నైజీరియాలో, గాంబియాలో నేరస్త ముఠాలు చెలరేగిపోవడంవంటివన్నీ ఈ వలసలకు ప్రధాన కారణాలవుతున్నాయి. అయితే ఈ దేశాలన్నిటా ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన బాధ్యత పాశ్చాత్య దేశాలదే. తమ చర్యలు ఎలాంటి పర్యవసానాలకు దారితీయగలవన్న అంచనా లేకుండా...వెనకా ముందూ ఆలోచించకుండా ఆ దేశాలన్నీ వ్యవహరించడంవల్ల ఆఫ్రికా దేశాలకు ఈ సంక్షోభం వచ్చిపడింది.

నాలుగేళ్ల క్రితం లిబియాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను సాకుగా తీసుకుని అమెరికా, పాశ్చాత్య దేశాలు సైనిక దాడులకు దిగి ఆనాడు దేశాన్ని పాలిస్తున్న గడాఫీని అంతమొందించాయి. అప్పట్లో ఉగ్రవాద ముఠాలకు ఆ దేశాలు సరఫరాచేసిన ఆయుధాలే ఇప్పుడు ప్రజలపై పెత్తనం చేస్తున్నాయి. నైజీరియాలో, సోమాలియాలో, పాలస్థీనాలో ఇలాంటి పరిస్థితులే అక్కడి ప్రజలను వలసబాట పట్టిస్తున్నాయి. నిరుడు ఇటలీకి వలసవచ్చిన పౌరుల సంఖ్య 1,70,000 అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 300 శాతం ఎక్కువ.

 వాస్తవానికి ఆఫ్రికా దేశాలనుంచి అక్రమ వలసలు యూరప్‌కు కొత్తగాదు. ఇవి భారీయెత్తున ఉండకపోవడంవల్లా, తమకు కూడా మానవ వనరుల అవసరం ఉండటంవల్లా యూరప్ దేశాలు వీటిని పట్టించుకునేవి కాదు. అయితే ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని ఉపాధి అవకాశాలు క్రమేపీ తగ్గడం మొదలెట్టాక వలసల కట్టడికి నడుం బిగించాయి. అదే సమయంలో అమెరికాతోపాటు పలు సైనిక చర్యల్లో పాలుపంచుకుని ఆ వలసలు మరింతగా పెరిగేందుకు పరోక్షంగా దోహదపడ్డాయి. పర్యవసానంగానే ఇప్పుడా దేశాలు వలసలతో ఇబ్బందిపడుతున్నాయి. వీటిపై యూరప్ దేశాల్లో పెరిగిన వ్యతిరేకత అక్కడ మితవాద పార్టీల పుట్టుకకూ, విస్తతికీ దోహదపడ్డాయి. మొన్నటికి మొన్న బ్రిటన్ ఎన్నికల్లో వలసలు ఏ స్థాయిలో చర్చకొచ్చాయో అందరూ చూశారు.

మిగిలిన దేశాల్లో సైతం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటికే వలసలు వచ్చినవారిని యూరప్‌లోని దేశాలు వాటి వాటి ఆర్థిక స్థితిగతులు, జనాభా, నిరుద్యోగితవంటివి ఆధారం చేసుకుని పంచుకోవాలన్న ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్నా దాన్ని బ్రిటన్, హంగేరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము సహకరించబోమని చెబుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ తదితరులు మనుషులను తరలిస్తున్న స్మగ్లర్లు ఉగ్రవాదులతో సమానమని తిట్టిపోశారు.

ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పడవలపై బాంబులేయాలనుకోవడం ఆ హెచ్చరికలకు కొనసాగింపే. అయితే, ఈ చర్యలు ఖాళీ పడవలకే పరిమితమవుతాయని చెప్పడానికి లేదు. బాంబు దాడులకు వెళ్లిన విమానాలు పొరపాటున జనంతో నిండిన పడవలపై నిప్పుల వాన కురిపించవన్న గ్యారంటీ లేదు. కనుక ఈ ఆలోచనకు యూరప్ దేశాలు స్వస్తి పలకాలి. అందుకు బదులుగా ఆఫ్రికా దేశాల సంక్షోభం తమ పాపఫలమే గనుక  అక్కడ  సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సాగే చర్యల్లో ఆ దేశాలు పాలుపంచుకోవాలి. మానవతా దక్పథంతో ఆలోచించాలి.

మరిన్ని వార్తలు