అరుదైన కలం

10 Jun, 2015 07:43 IST|Sakshi
అరుదైన కలం

అసమానతలు, అణచివేత ఉన్నచోటే చైతన్యమూ, పోరాటమూ ఉంటుంది. ధిక్కారం దావానలంలా నలుదిక్కులా వ్యాపిస్తుంది. అందులో బుద్ధిజీవులైనవారు భాగస్వాములు కాకుండా ఉండలేరు. అలా నిజాం నిరంకుశత్వంపై, దొరల దోపిడీపీడనలపై జనంతో కలిసి పోరాడిన కవులు, రచయితలు తెలంగాణ  గడ్డపై ఎంతోమంది ఉన్నారు. 87 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూసిన దాశరథి రంగాచార్య ఆ కోవకు చెందిన విఖ్యాత రచయిత. నిప్పును కడిగే సనాతనుల వంశంలో పుట్టినా పద్దెనిమిదేళ్ల చిరుప్రాయంలోనే తుపాకిపట్టి అజ్ఞాతవాసానికి వెళ్లి మట్టి మనుషులతో భుజం భుజం కలిపి నడిచిన యోధుడు రంగాచార్య.

మృత్యువు వెంట్రుకవాసి దూరంలో నిరంతరం వెన్నాడుతూనే ఉన్నా వెరవని వ్యక్తిత్వం ఆయనది. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే నిజాం ఫర్మానాకు వ్యతిరేకంగా ఖమ్మం స్కూల్‌లో విద్యార్థుల్ని సమీకరించి ఉద్యమించడం మొదలుకొని ఆయనది మొదటినుంచీ పోరాట పథమే. అన్న, అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య ప్రేరణతో కమ్యూనిజాన్ని చదువుకొని, పోరాటాన్ని ఒంటబట్టించుకుని సమాజాన్ని చాలా సన్నిహితంగా చూసిన అనుభవంతో రచయితగా ఎదిగాడు. అడపా దడపా కవిత్వమూ రాశాడు. అయితే, నిజాం రాజరికంపై ‘అగ్నిధార’ కురిపించిన అన్న కృష్ణమాచార్యే కవిత్వం రాయడానికి సరైనవారని భావించి తాను వచనానికి పరిమితం కావాలని ఆయన నిర్ణయించుకున్నాడు.

పాలకుల దాష్టీకాన్ని ప్రశ్నించనివాడు రచయిత కాదుగదా...మనిషి కూడా కాదన్న స్పృహతో తెలంగాణ జనజీవితాన్ని అక్షరాల్లో పొదిగినవాడు దాశరథి. నిజాం పాలనను ఇవాళ్టి అవసరాలతో ఎవరైనా అలవోకగా పొగిడేయవచ్చుగానీ...ఆ భూస్వామ్య పాలన తెలంగాణ జనజీవితాన్ని ఎలా విచ్ఛిన్నం చేసిందో, ఎంతగా కష్టపెట్టిందో, ఎన్ని కుటుంబాల ఉసురుపోసుకున్నదో ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని అక్షరీకరించిన రచయిత ఆయన. నిజాం కాలంలో తెలంగాణ సమాజం ఎట్లా ఉన్నదో... పోరాటం రాజుకుని విజృంభించిన వేళ అది ఏ ఏ మలుపులు తీసుకున్నదో... వివిధ సందర్భాల్లో సామాన్యులు చేసిన సాహసాలెలాంటివో... పరిమళించిన మానవీయ విలువల ఔన్నత్యమెంతటిదో కళ్లకు కట్టిన రచనలు ఆయనవి.

దాశరథే చెప్పుకున్నట్టు అవన్నీ పోరాటాల కథలు. త్యాగాల కథలు. జీవితం కథలు. తాను పేరు కోసమో, డబ్బు కోసమో రాయలేదని...ఈ గడ్డన ఎలాంటి మనుషులు మనుగడ సాగించారో, ఎన్ని ఇబ్బందులుపడ్డారో, వాటిని అధిగమించడానికి ఏంచేశారో భవిష్యత్తరాలు తెలుసుకోవడానికే కలం పట్టానని ఆయన చెప్పారు. లేనట్టయితే ఆనాటి నిరంకుశ పాలననూ, రజాకార్ల హింసనూ మరిచి నిజాంను ఒక ప్రభువుగా కీర్తించే ప్రమాదమున్నదని ఆయన శంకించారు.

పోరాట క్షేత్రంలో మాత్రమే కాదు...జీవితంలోనూ ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. నమ్మిన విలువలనుంచి వైదొలగకుండానే వీటన్నిటినీ ఆయన ఎదుర్కొన్నారు. పోలీసు చర్య అనంతరం 1948లో సాయుధ పోరాట విరమణ జరిగాక బయటికొచ్చినప్పుడు దాశరథికి జీవితమే ప్రశ్నార్థకమైంది. ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియని పరిస్థితి. అన్న జైలుపాలై తనతోపాటు మరో అయిదుగురు కుటుంబసభ్యుల భారం మీదపడినప్పుడు తొణక్కుండా పంటి బిగువున కష్టాలు భరించి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి బడిపంతులు ఉద్యోగాన్ని సంపాదించారు.

ఆ ఉద్యోగం చేస్తూనే బీఏ ఉత్తీర్ణత సాధించి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొలువు సంపాదించారు. వట్టికోట ఆళ్వారుస్వామి అసంపూర్తిగా వదిలివెళ్లిన కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడానికి తాను రచనారంగంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తించారు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట పూర్వ పరిస్థితులనూ, ఆ పోరాటం సమయంలో ఉన్న స్థితిగతులనూ, అనంతర పరిణామాలనూ ఆయన రచనలు రికార్డు చేశాయి. ఈ రచనలన్నీ ఉద్దేశిత వర్గాలకు చేరడానికి అనుసరించాల్సిన మార్గమేమిటో ఆయన ముందే నిర్ణయించుకున్నారు.

పాత్రలు సంభాషించుకునే సందర్భంలో మాత్రమే మాండ లికానికి చోటీయాలని, మిగిలినదంతా ప్రామాణిక భాషలో సాగాలని భావించారు. అందువల్లే ఆయన కథలైనా, నవలలైనా తెలుగు నేలంతా గుబాళించాయి. తన నవలల్లో చిత్రీకరించే కాలానికి పాఠకుల్ని తీసుకెళ్లడం కోసం దానికి అనుగుణమైన వాతావరణాన్ని ఎన్నుకోవడం, పాత్రలు ఉపయోగించే భాష మొదలుకొని అన్నిటిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆయన విశిష్టత.

1938కి పూర్వంనాటి తెలంగాణ జీవితాన్ని చిత్రించిన ‘చిల్లరదేవుళ్లు’ నవలలో ఉర్దూ పదాలు ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. దొరతనంపై ఊరు ఊరంతా ఏకమై పోరాడటం ఇతివృత్తంగా సాగిన ఈ నవల హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువాదమై దేశంలోనే విశేషాదరణ పొందింది. ఈ నవలకు 1970లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రేడియో నాటకంగా ప్రసారమై, అనంతరకాలంలో చలనచిత్రంగా వచ్చి అందరి మన్ననలూ పొందింది. ‘మోదుగుపూలు’ నవల సాయుధ పోరాట కాలంనాటి పరిస్థితులనూ, ‘జనపదం’ పోరాట విరమణానంతర  పరిణామాలనూ సమర్థవంతంగా కళ్లకు కట్టాయి.

కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, ఆ భావజాలంతోనే కొనసాగుతున్నానని చెప్పిన దాశరథి రామాయణ, మహాభారతాలనూ... వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రాహ్మణాలనూ అనువదించడం చాలామందికి వింతగానే అనిపించింది. విశ్వశ్రేయస్సును కాంక్షి ంచడంలో వేదాలూ, కమ్యూనిజం ఒకటేనని ఆయన విశ్వాసం. దేవుణ్ణి నమ్మొచ్చుగానీ, మతతత్వం కూడదంటారు. అది సమాజాన్ని నాశనం చేసేంత ప్రమాదకరమైనదని ఆయన భావన.

సమాజంలోని అసమానతలు పోవాలని, పెత్తందారీ పోకడలను ఎదిరించాలనీ, విద్వేషాలను రెచ్చగొట్టేవారు అంతరించి పోవాలనీ ఆకాంక్షించి... మనుషులు ఒకరి కోసం ఒకరు బతకాలనీ కోరుకుని... అందుకోసమే రచనలు చేసిన దాశరథి వంటివారు మన సమాజానికి ఎంతో అవసరం. ప్రపంచీకరణ మానవ సంబంధాలను ధ్వంసంచేస్తున్న తీరుపై ఆవేదనా... ఈ స్థితిపై సమష్టిగా గొంతెత్తరేమన్న అసహనమూ దాశరథిలో ఉండేవి.

ఇలాగైతే భవిష్యత్తరాలు క్షమించబోవని హెచ్చరించేవారు. డబ్బుతో కొనుక్కుంటున్న విద్యవల్ల జ్ఞానం అడుగంటుతున్నదని బాధపడేవారు. తనచుట్టూ ఉన్న సమాజం కోసం, దాని క్షేమం కోసం పరితపించిన మహోన్నతుడు దాశరథి. ఆయనకివే మా నివాళులు.

మరిన్ని వార్తలు