అస్తిత్వ సంక్షోభంలో ‘నాటో’

14 Jul, 2018 03:03 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (ఫైల్‌ ఫొటో)

దౌత్య మర్యాదలను పెద్దగా లక్ష్యపెట్టని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాటో శిఖరాగ్ర సదస్సులో తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి అందులోని 28 సభ్య దేశాలనూ మరోసారి అయోమయంలో పడేశారు. ఈ కూటమి నిర్వహణకయ్యే వ్యయంలో అత్యధిక భాగం తాము భరిస్తుండగా, ఇందులోని యూరప్‌ దేశాలు స్వల్పంగా ఖర్చుపెడుతున్నాయని ఆయన వాదన. దాన్ని మార్చి తీరాలంటూ రెండేళ్లక్రితం తాను అధ్యక్షుడైనప్పటినుంచి ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కూటమి కింద వివిధ యూరప్‌ దేశాల్లో ఉండే సైనిక స్థావరాల్లో లక్షలమంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు.

పశ్చిమాసియాలోనూ, అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌ వగైరాచోట్ల నాటో సేనలుంటున్నాయి. ఈ కూటమికయ్యే వార్షిక వ్యయంలో దాదాపు 22 శాతం(సుమారు 200 కోట్ల డాలర్లు) అమెరికా ఖర్చు చేస్తోంది. ఏ దేశానికాదేశం సొంతంగా సైన్యాలను నిర్వహించుకుంటే అమెరికాకు ఈ ఖర్చంతా తగ్గుతుందని ట్రంప్‌ భావిస్తున్నారు. ఇలాంటి ‘అనవసర ఖర్చుల’ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంగి పోతున్నదని, యూరప్‌ దేశాలు మాత్రం రక్షణ రంగ వ్యయం లేకపోవడంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి సాధిస్తున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.

అయితే ఇది అర్ధసత్యం మాత్రమే. వివిధ యూరప్‌ దేశాల్లో ఉండే నాటో సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్య దాదాపు 15 లక్షలు. అమెరికాతో పోలిస్తే యూరప్‌ దేశాల సైన్యం తక్కువే. టర్కీ సైనికులు దాదాపు 4 లక్షలుంటే ఫ్రాన్స్‌ సైనికులు అందులో సగం ఉంటారు. జర్మనీ సైన్యం లక్షా 83వేలు. బ్రిటన్‌ సైన్యం లక్షా 45 వేలు. మిగిలిన దేశాల్లో సైన్యం ఇంతకన్నా తక్కువ. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ మినహా ఇతర నాటో దేశాలు తమ జీడీపీల్లో 2 శాతం వ్యయం చేయలేకపోతున్నాయి. కానీ ఈ దేశాలన్నీ అమెరికా సైన్యానికి, దాని స్థావరాలకూ భారీయెత్తునే ఖర్చు పెడుతున్నాయి. అదిగాక పశ్చిమాసియా దేశాల్లో, అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌ వగైరాల్లో అమెరికా సాగిస్తున్న యుద్ధాల్లో పాలుపంచుకుంటూ తమ తమ సేనల్ని పంపుతున్నాయి.

ఆ ఖర్చంతా భరిస్తున్నాయి. అమెరికా తన రక్షణ రంగ వ్యయాన్ని కేవలం నాటో కోసం మాత్రమే కాదు... పశ్చిమాసియాలో, ఆసియాలో ఉండే తన సైనిక స్థావరాల కోసం, అక్కడి అమెరికా సైనికుల కోసం కూడా వ్యయం చేస్తోంది. నిజానికి నాటో రద్దయి యూరప్‌ దేశా లన్నీ సొంతంగా ఎవరికివారు రక్షణ ఏర్పాట్లు చూసుకుంటే బాగా నష్టపోయేదీ...సంక్షోభంలో పడేదీ అమెరికాయే. ఆ దేశాల్లో ఉన్న తన లక్షలాదిమంది సైనికులు ఇంటిదారి పడితే వారి భారమంతా ట్రంప్‌ సర్కారే మోయాల్సి ఉంటుంది.
 
రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక సోవియెట్‌ యూనియన్‌ నుంచి పెను ముప్పు తప్పదని యూరప్‌ దేశాలను బెదరగొట్టి ఈ కూటమికి ప్రాణప్రతిష్ట చేసింది అమెరికాయే. నాటో దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా అందరూ కలిసికట్టుగా దాన్ని తిప్పికొట్టాలని నాటో ఒప్పందంలోని అయిదో ఆర్టికల్‌ చెబుతోంది. అయితే ఆ ఆర్టికల్‌ అవసరమే రాలేదు. అగ్రరాజ్యాల మధ్య ఏర్పడ్డ వైషమ్యాలు అనేకసార్లు మూడో ప్రపంచ యుద్ధ భీతిని సృష్టించాయి. అయితే 1989లో బెర్లిన్‌ గోడ బద్దలయ్యాక... 1991లో సోవియెట్‌ యూనియన్‌ పతనమై వార్సా కూటమి అంతరించాక ఈ భయాలన్నీ పటాపంచలయ్యాయి.

అయినా ప్రపంచంపై తన రాజకీయ, సైనిక ఆధిపత్యం కొన సాగాలన్న ఏకైక కాంక్షతో నాటోను రద్దు చేయకుండా కొనసాగించింది అమెరికాయే! చిత్రమే మంటే... సోవియెట్‌ ఉండగా ఈ కూటమి ఒక్క యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు. అది కుప్ప కూలాకే పలు దేశాల్లో సైనిక జోక్యాలకు, దురాక్రమణలకు నాటో పూనుకుంది. అమెరికా ఆధిపత్యం కోసం ఉపయోగపడుతున్న నాటోకు మేమెందుకు వ్యయం చేయాలని యూరప్‌ దేశాలు అను కుంటే... దానికయ్యే ఖర్చు ‘గిట్టుబాటు’ కావడం లేదని అమెరికా భావిస్తోంది.

ఇలా పరస్పరం అప నమ్మకంతో అమెరికా–యూరప్‌ దేశాలు ఎన్నాళ్లు కలిసి కాపురం సాగిస్తాయో తెలియదు. వాస్తవా నికి నాటో కూటమి వల్ల అధికంగా లాభపడింది అమెరికాయే. ఆ కూటమి ఉనికిలో లేకపోతే యూర ప్‌లో సోవియెట్‌ను రాజకీయంగా బెదిరించడానికి, తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి దానికి అవకాశం ఉండేది కాదు. అమెరికా ఇన్ని దశాబ్దాలుగా ప్రశాంతంగా మనుగడ సాగించగలిగిందంటే, ఇతరేతర అంశాలపై దృష్టి పెట్టి సంపన్నవంతం కాగలిగిందంటే అది నాటో కూటమి చలవే.  

అయితే ట్రంప్‌ కడుపు మంటకు వేరే కారణాలున్నాయి. జర్మనీ తన ఇంధన అవసరాల్లో 70 శాతాన్ని రష్యా నుంచే స్వీకరిస్తోంది. అందుకే అది రష్యా మిత్ర దేశమైన లిబియాపై అమెరికా దాడికి దిగినప్పుడు అందులో పాలుపంచుకోవడానికి నిరాకరించింది. అఫ్ఘాన్‌కు సైన్యాన్ని పంపినా జర్మనీ మాత్రం అక్కడ కేవలం పునర్నిర్మాణ పనులకు పరిమితమైంది. ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌ తదితర దేశాల్లో అమెరికా సేనల వైఫల్యాలు చూశాక నాటో దేశాల్లో దాని నాయకత్వ పటిమపై సందేహాలు పుట్టు కొచ్చాయి.

అందుకే అమెరికాను ఆ దేశాలు పెద్దగా లెక్కచేయడం మానేశాయి. జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ రాజకీయంగా గడ్డు స్థితిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఒత్తిడి తీసుకురావడమే ట్రంప్‌ ఆంతర్యం. అందుకే రష్యా చెప్పుచేతల్లో ఉన్నారంటూ జర్మనీపై ట్రంప్‌ కటువుగా వ్యాఖ్యా నించారు. యూరప్‌ దేశాలు వెల్లువలా వచ్చిపడుతున్న శరణార్థులతో దిక్కుతోచకుండా ఉన్నాయి. ఇదే అదునుగా ఆ దేశాల ఉత్పత్తులపై ట్రంప్‌ భారీగా సుంకాలు విధించారు. మరోపక్క ఆ దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్న ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి కేవలం ఇజ్రాయెల్‌ను సంతోషపెట్ట డానికి అమెరికా ఏకపక్షంగా బయటికొచ్చింది.

ఫలితంగా ఇరాన్‌తో ఆ దేశాల వ్యాపార వాణిజ్య లావాదేవీలు ఇబ్బందుల్లో పడ్డాయి. పారిస్‌ వాతావరణ ఒప్పందానికి కూడా ట్రంప్‌ తూట్లు పొడి చారు. ఇన్నివిధాల నష్టపరుస్తున్న అమెరికాతో కలిసి అడుగేయటం కష్టమని యూరప్‌ దేశాలు అను కుంటున్న తరుణంలో నాటో సాకు చూపి వాటిని దారికి తేవాలని ట్రంప్‌ చూస్తున్నారు. కానీ తెగే దాకా లాగితే ఏమవుతుందో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు.

మరిన్ని వార్తలు