మళ్లీ చర్చల దిశగా కశ్మీర్‌

25 Oct, 2017 01:24 IST|Sakshi

ఆత్మీయ ఆలింగనంతో మాత్రమే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్ప దూషణల వల్లనో, తూటాల ద్వారానో అది సాధ్యం కాదని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రెండు నెలల అనంతరం కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఆ సమస్యతో సంబంధం ఉన్న ‘అన్ని భాగస్వామ్య పక్షాలతో’ చర్చల ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇందుకోసం తన ప్రతినిధిగా ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) మాజీ డైరెక్టర్‌ దినేశ్వర్‌ శర్మను నియమించింది. హింస నిత్యకృత్యమై, చావులు అతి సాధారణ విషయంగా మారిన కల్లోల కశ్మీర్‌ తీరుపై అన్ని వర్గాల్లోనూ ఆందోళన ఉంది.

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక...ముఖ్యంగా రెండేళ్ల క్రితం జమ్మూ–కశ్మీర్‌లో పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కశ్మీర్‌ లోయ మరింత అల్లకల్లోలంగా మారింది. కేంద్రం అనుసరిస్తూ వచ్చిన కఠిన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ అన్ని పక్షాలతో చర్చలు జరిపి ఈ పరిస్థితిని సరిచేయాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఎన్‌డీఏ ప్రభుత్వం అంగీకరించలేదు. గత ప్రభుత్వాలన్నీ మెతకవైఖరి అవలంబించబట్టే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది దాని అవగాహన. స్వాతంత్య్ర దినోత్సవంనాడు నరేంద్ర మోదీ ప్రసంగం విన్నాక కేంద్రం తన వైఖరి మార్చుకున్నదేమోనని అందరూ భావించినా అందుకు సంబంధించిన సంకేతాలేమీ లేవు. ఎట్టకేలకు ఇప్పుడు దినేశ్వర్‌ శర్మ నియామకం జరిగింది.

కశ్మీర్‌కు హింస కొత్త కానట్టే... కేంద్రం అక్కడ దూతల ద్వారా, మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడపడం, చర్చలు సాగించడం కూడా కొత్తగాదు. రాజేష్‌ పైలట్, జార్జి ఫెర్నాండెజ్‌ వంటివారు కేంద్రం తరఫున అక్కడ ఆందోళన సాగిస్తున్న వర్గాలతో మాట్లాడారు. వారి మనోభావాలు తెలుసుకున్నారు. వాజపేయి హయాంలో 2001లో కేసీ పంత్‌ను మధ్యవర్తిగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో చర్చల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈలోగా పార్లమెంటుపై ఉగ్ర వాద దాడి జరగడం, భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం పర్యవసానంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. 2003లో ప్రస్తుత కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాను మధ్యవర్తిగా నియమించి వాజపేయి సర్కారు మరో ప్రయత్నం చేసింది. వీరుగాక ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ, ఫాలీ ఎస్‌. నారిమన్, శాంతిభూషణ్, ప్రస్తుత కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ తదితరులతో ఒక స్వతంత్ర కమిటీ ఏర్పడి మిలిటెంట్‌ వర్గాలతోనూ, స్థానికులతోనూ, వివిధ రాజకీయ పార్టీలతోనూ చర్చించింది.

కానీ వీటివల్ల ఒరిగిందేమీ లేదు. 2010లో ప్రముఖ పాత్రికేయుడు దిలీప్‌ పడ్గావ్‌కర్, రాధాకుమార్, ఎంఎం అన్సారీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం మధ్యవర్తులుగా నియమించింది. ఆ కమిటీ హిజ్బుల్, లష్కరే కమాండర్లతో సైతం మాట్లాడింది. అనుమానితులెవరినైనా కాల్చిచంపడానికి లేదా నిరవధికంగా నిర్బంధించడానికి భద్రతా బలగాలకు అధికారమిస్తున్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను సమీక్షించడంతోసహా వివిధ చర్యలు తీసుకోవాలని 2011లో సిఫార్సు చేసింది. కానీ మరో మూడేళ్లు అధికారంలో ఉన్నా మన్మోహన్‌ సర్కారు ఆ నివేదిక జోలికి పోలేదు. కేంద్ర ప్రభుత్వంపై తరచు నిప్పులు చెరుగుతున్న బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ రెండు దఫాలు ఆ రాష్ట్రాన్ని సందర్శించి భిన్న వర్గాలతో మాట్లాడింది. సహజంగానే ఆ కమిటీ సమర్పించిన నివేదికలను కేంద్రం పట్టించుకోలేదు.
 
కశ్మీర్‌లో యుద్ధ వాతావరణం ఉన్నదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ రక్షణ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నప్పుడు అన్నారు. అందులో నిజముంది. నిరుడు జూలైలో మిలిటెంట్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ జరిగాక సాగిన హింసలో 165మంది మిలిటెంట్లు, 14మంది పౌరులు చనిపోగా... భద్రతా సిబ్బంది 88 మంది మరణించారు. ఈ ఏడాది ఇంతవరకూ 176మంది మిలిటెంట్లు చనిపోగా భద్రతా బలగాలకు చెందిన 65మంది, పౌరులు 49మంది మరణించారని గణాం కాలు చెబుతున్నాయి. ఇవిగాక రాళ్లు రువ్వుతున్నవారిపై భద్రతా బలగాలు పెల్లెట్లు ప్రయోగించినప్పుడు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు కంటిచూపు కోల్పోయారు. మరోపక్క కశ్మీర్‌లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు నిధులు వచ్చిపడు తున్నాయన్న సమాచారం ఆధారంగా హురియత్‌తోపాటు పలు సంస్థల బాధ్యు లను అదుపులోనికి తీసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రశ్నించింది.

అనేకమందిపై కేసులు నమోదు చేసింది. ఇలాంటి వాతావరణంలో చర్చల కోసం తొలిసారి కేంద్రం తరఫున రిటైరైన పోలీసు ఉన్నతాధికారిని నియమించడంపై హుర్రియత్‌ వంటి సంస్థల్లో అనుమానాలున్నాయి. సమస్యలున్నచోట, ఉద్రిక్తతలు అలుముకున్నచోట ఇదంతా సహజమే. దినేశ్వర్‌ శర్మకిచ్చిన అధికారాలేమిటన్న సంగతి ఇంకా తెలియకపోయినా, ‘ఎవరితోనైనాసరే’ ఆయన చర్చలు జరపవచ్చని కేంద్రం విడుదల చేసిన అధికార ప్రకటన చెబుతోంది. హుర్రియత్‌తో ఆయన చర్చలకు సిద్ధపడితే కేంద్రం తన వైఖరిని మార్చుకున్నదని భావించాలి. ఎందు కంటే మొన్న ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో చర్చల ప్రస్తావన వచ్చినప్పుడు ‘చట్ట బద్ధమైనవిగా గుర్తించిన’ పక్షాలతో మాత్రమే చర్చలుంటాయని, కశ్మీర్‌ విలీనాన్ని తిరగదోడేవారితో లేదా దానికి స్వాతంత్య్రం కావాలనేవారితో మాట్లాడేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే సమస్య రాజకీయపరమైనదని గుర్తించినప్పుడు దాన్ని ఆ కోణంలో పరిష్కరించడానికే పూనుకోవాలి. ఈ విషయంలో పోలీసు శాఖలో పనిచేసి వచ్చిన దినేశ్వర్‌ శర్మ ఎలాంటి ప్రతిపాదనలు చేయగలరో చూడాలి. ఐబీలో కశ్మీర్‌ వ్యవహారాలను సుదీర్ఘకాలం చూసిన అధికారిగా ఆయన కేర్పడిన అవగాహన... ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లతో సాగిస్తున్న చర్చల వల్ల ఆయనకొచ్చిన అనుభవం ఎంతవరకూ తోడ్పడతాయో రాగలకాలంలో తేలు తుంది. కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణకు అన్ని పక్షాలూ చిత్తశుద్ధితో, ఓరిమితో వ్యవ హరించగలవని ఆశించాలి.

మరిన్ని వార్తలు