అత్యంత అమానుషం

28 Sep, 2019 01:33 IST|Sakshi

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా కులం పడగనీడన బతుకీడ్చక తప్పనిస్థితిలో ఉన్న దళితులు తరచుగా వివక్షను ఎదుర్కొనడానికి, కొన్ని సందర్భాల్లో ఆధిపత్య కులాల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడానికి చెప్పుకోదగ్గ కారణాలు ఉండవు. కానీ ఇప్పటివరకూ మనకు వినడం అల వాటైన కారణాలను కూడా తలదన్నేలా ఊరిపై పెత్తనం సాగించే సోదరులు ఒక చిన్న విషయంలో దళిత కులానికి చెందిన ఇద్దరు పసిపిల్లల ఉసురు తీశారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.

మధ్యప్రదేశ్‌ లోని శివ్‌పురి జిల్లా భావ్‌ఖేడి గ్రామంలో మొన్న మంగళవారం పదేళ్ల వయసుగల బాలుడు అవినాష్, పన్నెండేళ్ల బాలిక రోషిణిలను బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆగ్రహించి కొట్టి చంపారు. ఆ నిరుపేద దళిత కుటుంబం బతుకీడుస్తున్న గుడిసెను చూస్తే అది మనుషులకు ఆవాసయోగ్యమైనదిగా ఎవరికీ అనిపించదు. దేశంలో నెలకొన్న దుర్భర దారిద్య్రానికి ఆ గుడిసె ఒక ప్రతీక. మట్టి గోడలతో, గడ్డితో కప్పిన పైకప్పు, దానిపై ప్లాస్టిక్‌ షీట్లు ఉన్న ఆ గుడిసెను చూస్తేనే వారెంత దయనీయ స్థితిలో జీవిస్తున్నారో అర్ధమవుతుంది. దానికి విద్యుత్‌ సదుపాయం, మంచినీటి సదుపాయం లేవని వేరే చెప్పనవసరం లేదు.

ఆ పిల్లల తండ్రి మనోజ్‌ వాల్మీకి చెబుతున్న ప్రకారం రోజుకూలీతో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం మరుగుదొడ్డితో కూడిన ఇంటి నిర్మాణానికి తాము అర్హులమని చాన్నాళ్లక్రితమే దర ఖాస్తు చేసుకుంది. అయితే అంత క్రితం జరిగిన స్వల్ప తగాదా కారణంగా ఇప్పుడు పిల్లల్ని కొట్టి చంపినవారే పంచాయతీలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ కుటుంబానికి మరుగుదొడ్డి రాకుండా అడ్డుకున్నారు. చిత్రమేమంటే ఆ ఇంటికి మరుగుదొడ్డి లేకున్నా ‘బహిరంగ మలవిసర్జన రహిత’(ఓడీఎఫ్‌) గ్రామంగా అది సర్కారువారి జాబితాలో చోటు సంపాదించుకుంది. నిజానికి మరుగుదొడ్డి మంజూ రైనా దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి, పరిశుభ్రంగా ఉంచుకోవ డానికి కావలసిన నీటి సదుపాయం... మురుగు పోవడానికి అవసరమైన పైప్‌లైను ఆ ‘ఇంటి’కి లేదు. ఏ కార్యక్రమాలైనా, ఎంత సదుద్దేశంతో ప్రారంభించే పథకాలైనా క్షేత్రస్థాయిలోకొచ్చేసరికి ఎలా నీరుగారుతాయో, అధికారులు వాటిని పైకి రానీయకుండా ఎలా కప్పెడతారో తెలియాలంటే మనోజ్‌ వాల్మీకి ‘ఇల్లే’ ఉదాహరణ. 

 దేశంలో ఎక్కడా బహిరంగ మలవిసర్జన అనేది ఉండకూడదని అయిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ్‌భారత్‌ అభియాన్‌’కి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు జరిగే 2019 అక్టోబర్‌ 2కల్లా దేశంలోని అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉండాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 1.96 లక్షల కోట్ల వ్యయంతో దేశంలోని 55 లక్షల గ్రామాల్లో పది కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలన్నది ఈ కార్యక్రమం సారాంశం.

దీన్ని ఇప్పటికే మన దేశం అధిగమిం చిందని, గత అయిదేళ్లలో 11 కోట్లకుపైగా మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయని గణాంకాలు చెబు తున్నాయి. మరుగుదొడ్డి లేకపోవడం వల్ల గ్రామీణప్రాంతాల్లో మహిళలు, బాలికలు పడే ఇబ్బం దులు అన్నీ ఇన్నీ కాదు. వారు వేకువజామునే లేచి తమ కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేదా రాత్రి చీకటి పడేవరకూ వేచి ఉండాలి. ఈ క్రమంలో వారికి దుండగుల చేతుల్లో ఎదురవుతున్న అవ మానాలు అన్నీ ఇన్నీ కాదు. పలు సందర్భాల్లో వారు అత్యాచారాలకూ, అపహరణలకూ గురవు తున్నారు. ఆడపిల్లలు బడి చదువులు మానేస్తున్నారు. 2015లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ దేశాలన్నీ 2030కల్లా సాధించవలసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డీజీ) నిర్ణయించింది. అందులో అందరికీ మంచినీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య వగైరాలున్నాయి.  

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014లో దేశంలో బహిరంగ మలవిసర్జన చేసేవారి సంఖ్య 55 కోట్లు కాగా, 2018–19నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు తగ్గింది. ఇదంతా మెచ్చదగ్గదే. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో మొదలుపెట్టి అనేక ముఖ్య సందర్భాల్లో మోదీ స్వయంగా స్వచ్ఛభారత్‌ అభియాన్‌ను ప్రచారం చేసిన పర్యవసానంగానే ఇదంతా సాధ్యమైంది. ఇందుకు బిల్‌గేట్స్‌కు చెందిన బిల్, మెలిందాగేట్స్‌ ఫౌండేషన్‌(బీఎంజీఎఫ్‌) ఆయనకు గ్లోబల్‌ గోల్‌కీపర్‌ అవార్డు కూడా అందించింది. 

మన దేశంలో తరతరాలుగా పారిశుద్ధ్య పనుల్లో ఉంటున్నది దళిత కులాలవారే. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ లోతుగా పాతుకుపోయిన మన సమాజం వారికి ఆ పనులు ‘రిజర్వ్‌’చేసి అందువల్ల లబ్ధిపొందుతున్నది. మానవ వ్యర్థాలను నెత్తిపై మోసుకెళ్లే దుర్భర అవస్థ నుంచి వారిని తప్పిం చాలని సామాజిక కార్యకర్తలు ఎన్నేళ్లనుంచో చేస్తున్న ప్రయత్నాలు ఇంకా పూర్తిగా ఫలించని దయ నీయ స్థితి దేశంలో ఉంది. ఇలా ఇష్టం ఉన్నా లేకున్నా పారిశుద్ధ్య పనుల్లో కొనసాగక తప్పని కులా నికి చెందిన పసిపిల్లల్ని ఊరును అపరిశుభ్రం చేస్తున్నారని నిందిస్తూ కొట్టి చంపడం కన్నా దారుణం మరోటి ఉంటుందా?

నిజానికిది పారిశుద్ధ్య సమస్య కాదు. దళితులపట్ల నరనరానా ద్వేషాన్ని పెంచుకున్నవారికి దొరికిన సాకు. దళితుల స్థితిగతులను, వారికెదురవుతున్న వివక్షను పట్టించు కోని పాలకులు ఈ ఘటనకు బాధ్యతవహించాలి. దుండగులను అరెస్టు చేశారు సరే...కానీ ఆ కుటుంబాన్ని దుర్భరస్థితిలోకి నెట్టిన ఇతర పెత్తందార్లను కూడా కటకటాలవెనక్కి నెట్టాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు