కుమారస్వామి (సీఎం) రాయని డైరీ 

27 May, 2018 00:51 IST|Sakshi

మూడు రోజులైంది! ఇంకా మూడు రోజులు తక్కువ ఐదేళ్లవ్వాలి. ఐదేళ్లూ అవుతుందా, మూణ్ణాళ్లకే ఐదేళ్లు అవుతుందా చూడాలి. రేపటికిగానీ తెలీదు. పాలిటిక్స్‌లో రేపు జరగాల్సిందంటూ ఏమీ ఉండదు. అయినా సరే, ఏ రోజుకారోజు.. రేపటికి గానీ తెలియని రోజే. ఐదేళ్లు కంప్లీట్‌ అవ్వాలని మనం అనుకుంటే అవుతుందా? కంప్లీట్‌ అవనివ్వాలని అనుకునేవాళ్లు అనుకోవాలి. ఇవేమీ రాకరాక వచ్చిన ఐదేళ్లు కాదు. వస్తాయి అనుకుని ఎదురుచూసిన ఐదేళ్లు కాదు. వస్తాయో రావో అనుకున్న ఐదేళ్లు కాదు. వస్తే రానియ్, పోతే పోనియ్‌ అనుకున్న ఐదేళ్లు కాదు. కర్ణాటక ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి, ఇచ్చివెళ్లిన ఐదేళ్లూ కాదు. కాంగ్రెస్‌ రాలేక, బీజేపీని రానివ్వలేక.. ‘తీస్కో కుమారస్వామీ’ అని నా చేతుల్లో పెట్టేసిన ఐదేళ్లు.

ఈ ఐదేళ్ల మీద.. తీసుకున్నవాళ్లకు ఎంత హక్కు ఉంటుందో, ఇచ్చిన వాళ్లకూ అంతే హక్కు ఉంటుందని తీసుకున్నవాళ్లు మర్చి పోయినా, ఇచ్చినవాళ్లు గుర్తుపెట్టుకోకుండా ఉంటారా? గుర్తు చేయకుండా ఉంటారా?! కాంగ్రెస్‌ ఎప్పుడెవర్ని వరెస్ట్‌గా ట్రీట్‌ చేస్తుందో కాంగ్రెస్‌కే తెలీదు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు రాత్రి హిల్టన్‌ హోటల్‌లో డీకే శివకుమార్‌ దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ‘ఏమైంది శివా’ అని భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగాను. ‘హోమ్‌సిక్‌’ అన్నాడు.

‘అది కాదులే.. చెప్పు’ అన్నాను. 
మనిషి కదిలిపోయాడు! ‘ఇంత చేశానా! మా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్నీ, మీ జేడీఎస్‌ ఎమ్మెల్యేల్నీ బీజేపీ కంట పడకుండా ఒక చోట కలిపి కూర్చోబెట్టానా! ఢిల్లీ వెళ్లి, నేనే ఇదంతా చేశాను అని చెబితే రాహుల్‌ నన్ను కనీసం కూర్చోమని కూడా అనలేదు! అనకపోతే అనకపోయాడు, ఎక్కడ కూర్చుంటావ్‌? క్యాబినెట్‌లోనా, పీసీసీ సీట్లోనా అనైనా అడగాలి కదా! అడగలేదు. నేనేమైనా సన్యాసం తీసుకోడానికి రాజకీయాల్లోకి వచ్చానా? లేకపోతే చెస్, ఫుట్‌బాల్‌ ఆడటానికి వచ్చానా? నేనూ కాంగ్రెస్‌ వాడినే కదా. నాకూ ఆశలుంటాయి కదా? నాకూ హోమ్‌సిక్‌  ఉంటుంది కదా?’ అన్నాడు.

‘ఊరుకో శివా’ అన్నాను. అతడి ఎమోషన్‌కి నేను బరస్ట్‌ అయ్యేలా ఉన్నాను. నేనే రాహుల్‌ని అయ్యుంటే వెంటనే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంని చేసేయాలన్నంత ఆపేక్ష కలిగింది నాకు అతడి మీద. పోనీ శివకుమార్‌ మా పార్టీ వాడైనా బాగుండేది.. హోమ్‌ సిక్‌ లేకుండా హోమ్‌ మినిస్టర్‌గా పెట్టుకునేవాళ్లం. రేపు ఆర్‌ఆర్‌ నగర్‌ పోలింగ్‌. కాంగ్రెస్‌కి బలమైన సీటు. జేడీఎస్‌కి బలమైన క్యాండిడేటు. కాంగ్రెస్‌కి సపోర్ట్‌ ఇస్తే, బీజేపీకి సపోర్ట్‌ చేస్తాం అంటున్నారు కార్యకర్తలు.  ‘ఏం చేద్దాం శివా’ అని అడిగాను. ‘ఏదో ఒకటి చేద్దాం’ అన్నాడు. రేపటికి ఐదు రోజులు అవుతుంది నేను ప్రమాణ స్వీకారం చేసి!

- మాధవ్‌ శింగరాజు 

>
మరిన్ని వార్తలు