ట్రంప్‌ నిష్టూరం!

21 Feb, 2020 04:23 IST|Sakshi

ఎవరింటికైనా అతిథులుగా వెళ్తున్నప్పుడు వారి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడటం సంప్రదాయం. దేశాల మధ్య దౌత్యంలో అది మరింత అవసరం. పరస్పరం కలహించుకుని, కత్తులు నూరుకున్న దేశాధినేతలు సైతం రాజీ చర్చల కోసం ఒక చోటుకు చేరినప్పుడు అప్రియ భాషణకు, నిష్టూరాలకు దూరంగా వుంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరే వేరు. ఆ క్షణానికి ఏం అనిపిస్తే దాన్ని మాట్లాడటం ఆయన లక్షణం. దౌత్య మర్యాదలకు భంగం కలుగుతుందా, దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయా అన్నది ఆయనకు పట్టదు. దేశాధ్యక్షుడయ్యాక తొలిసారి మన దేశానికొస్తున్న ట్రంప్‌... భారత్‌ తనను బాగా చూడదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ అంటే మాత్రం తనకు చాలా ఇష్టమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత్‌ వేరు, మోదీ వేరు అని తనకెందుకు అనిపించిందో ఆయన చెబితేగానీ నిర్ధారణగా తెలిసే అవకాశం లేదు. కానీ ఈ పర్యటనపై ఆయన చాలా పెద్ద ఆశలే పెట్టుకుని వుండొచ్చని, అవన్నీ నెరవేరే అవకాశం కనబడకపోవడంతో ఇలా నిష్టూరమాడి వుంటారని భారత్‌–అమెరికా అధికారుల మధ్య ఈ పర్యటన కోసం గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలపై వెలువడుతున్న కథనాలు చూస్తే అర్థమవుతుంది.

భారత్‌ తనను బాగా చూడకపోవడం మాటేమోగానీ... ట్రంప్‌కే భారత్‌ అంటే చిన్నచూపుందని ఆయన తరచు చేసే వ్యాఖ్యానాలు నిరూపిస్తాయి. మన దేశానికి ఆయన ‘టారిఫ్‌ల కింగ్‌’ అని బిరుదు కూడా ఇచ్చారు. తాము విధించే టారిఫ్‌లన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు లోబడే వున్నాయని మన దేశం అనేక మార్లు చెప్పినా ఆయనకు పట్టదు. తన భారత్‌ పర్యటన గురించి ట్వీట్‌లు చేయడంతోపాటు ఇప్పటికే రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఇది రెండు రోజుల పర్యటన అయినా, ఆయన మొత్తంగా మన దేశంలో వుండేది 34 గంటలు. ట్రంప్‌ పదే పదే చెబుతున్నది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరపబోయే పర్యటన గురించి. ముఖ్యంగా అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకూ రహదారికి ఇరువైపులా తనకు స్వాగతం చెప్పేందుకు 70 లక్షలమంది జనం వస్తారని మోదీ చెప్పిన మాట ఆయన చెవుల్లో రాత్రింబగళ్లు మార్మోగుతోంది. అంతమంది ప్రజానీ కాన్ని కళ్లారా చూడాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ‘తనను భారత్‌ బాగా చూడకపోతే..’ ఇంతమంది జనం స్వాగతం పలకడానికి ఎందుకొస్తారన్న సందేహం ఆయనకు రావడం లేదు.

వ్యక్తిగా ట్రంప్‌ ఇష్టాయిష్టాల మాటెలావున్నా... దేశాధ్యక్షుడిగా, మరికొన్నాళ్లలో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడే నేతగా ఈ పర్యటన నుంచి గరిష్టంగా లబ్ధి పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. మన దేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని ఆయన ప్రకటించారు. అయితే దానిపై ఈ పర్యటనలో సంతకాలు కాకపోవచ్చని కూడా ఆయనే చెప్పారు. ఇప్పుడు పరిమిత స్థాయిలోనైనా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని, దాన్ని భవిష్యత్తులో విస్తృత స్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా విస్తరించాలని ట్రంప్‌ గట్టిగా కోరుకుంటున్నారు. కానీ పరిమిత స్థాయి వాణిజ్య ఒప్పందం కూడా తక్షణం నెరవేరేలా కనబడకపోవడం ఆయనకు అసంతృప్తి కలిగిస్తోంది. వ్యవ సాయం, డెయిరీ రంగాల్లో సైతం బహుళజాతి సంస్థల్ని అనుమతించాలన్నది అమెరికా కోరిక. ఆ కోర్కెను నెరవేరిస్తే ఆ రెండు రంగాలకూ అది శరాఘాతమవుతుంది. మన దేశంలో చిన్న స్థాయి డెయిరీ రైతులు, స్థానిక సహకార సంఘాలు, చిన్న స్థాయి అమ్మకందారులు మొత్తంగా 15 కోట్ల మంది వున్నారు. మనం పాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా వుండటానికి, స్వయం స్వయం సమృద్ధికి వీరి నిరంతర కృషే కారణం. పలు దేశాల్లో పెత్తనం చేస్తున్న బహుళజాతి సంస్థలు ఇక్కడ చెల్లుబాటు కావడం లేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్సెప్‌) ఒప్పందం సాకా రమమైవుంటే ఈ రంగం చిన్నాభిన్నమయ్యేది. అదృష్టవశాత్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం దాన్నుంచి బయటకు రావాలని గత నవంబర్‌లో నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో వున్న చిన్న తరహా డెయిరీల ఉత్పత్తి వార్షిక విలువ పది వేల కోట్ల డాలర్లు. ఉత్పత్తయ్యే పాలలో సగం గ్రామీణ ప్రాంతాల్లోనూ, శేషభాగం విస్తృతంగా వున్న పాల సహకార సంఘాలు, చిన్న వ్యాపారుల ద్వారా పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్తుంది. పాల ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం డెయిరీ రైతులకు లభిస్తుందని అంచనా.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉపాధికి ఆసరాగా నిలుస్తున్న వ్యవసాయ రంగంపై కూడా అమెరికా దృష్టి పడింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టాల్లో మునిగి రైతన్నలు రుణభారంతో కుంగుతున్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు రంగప్రవేశం చేస్తే అది మన సాగురంగానికి చావు గంట మోగిస్తుంది. నిరుడు అక్కడి వ్యవసాయ రంగానికి అమెరికా ఇచ్చిన మొత్తం సబ్సిడీల విలువ 86,700 కోట్ల డాలర్లు. కనుక ఆ ఉత్పత్తులు కారు చౌకగా మన మార్కెట్‌లో లభిస్తాయి. ఆ పోటీలో మన సాగు రంగం ధ్వంసమవుతుంది. అమెరికా ఇస్తున్న స్థాయిలో మన రైతుకు కూడా సబ్సిడీలు లభిస్తే అప్పుడది సమవుజ్జీల పోటీగా వుంటుంది. కానీ అది సాధ్యమేనా? అమెరికాతో కుదరబోయే ‘పరిమిత’ వాణిజ్య ఒప్పందం కింద ఆ దేశం నుంచి ఏటా రూ. 42,000 కోట్ల విలువైన డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిపడతాయని వ్యవ సాయదారుల సంఘాల సమాఖ్య ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై ముందడుగు వేయడానికి మన దేశం సందేహిస్తోంది. కోట్లాదిమంది జీవితాలతో ముడిపడివుండే సమస్యపై ఇప్పటికిప్పుడు నిర్ణయం ఎలాగని మన అధికారులు ప్రశ్నిస్తున్నట్టు ఒక కథనం చెబుతోంది. ఇదంతా ట్రంప్‌కు అసహనం కలిగించడం సహజమే. ఆయన కోపతాపాల మాటెలావున్నా దేశ ప్రయోజనాలకు విఘాతం కలగని రీతిలో మన పాలకులు నిర్ణయం తీసు కుంటారని ఆశించాలి.

మరిన్ని వార్తలు