సమాచార యోధుడికి ఖైదు

23 Aug, 2013 00:56 IST|Sakshi

సంపాదకీయం: నిజం చెప్పడం నేరమైంది. ఇక్కడ సరిగా లేదని చెప్పడం ద్రోహమైంది. అమాయకుల్ని పొట్టనబెట్టుకుంటున్నారని వెల్లడించడం తప్పయింది. ఇరాక్, అఫ్ఘానిస్థాన్‌లలో అమెరికా సైన్యం సాగిస్తున్న యుద్ధ నేరాలపై ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేసిన అమెరికా సైనికుడు బ్రాడ్లీ మానింగ్‌కు అక్కడి సైనిక న్యాయ స్థానం బుధవారం 35 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అమెరికా రహస్యాలను బట్ట బయలు చేస్తున్న జూలియన్ అసాంజ్ నేతృత్వంలోని వికీలీక్స్‌కు అతను 7 లక్షల రహస్య పత్రాలు అందించాడని, యుద్ధక్షేత్రంలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియోలను, దౌత్యసంబంధమైన కేబుల్స్‌ను ఆ సంస్థకు చేరవేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
 
వీటివల్ల అల్‌కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలకు దేశం రహస్యాలన్నీ తెలిసిపోయాయని, పర్యవసానంగా వాటినుంచి పెనుముప్పు ఏర్పడిందని అభియోగం మోపింది. తన చర్యల ద్వారా అతను శత్రువుకు సహకరించాడని పేర్కొంది. వికీలీక్స్‌కు ఇలాంటి పత్రాలన్నీ చేరవేసే సమయానికి మానింగ్ బాగ్దాద్‌లో సైనిక అనలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను బయటపెట్టిన పత్రాల్లో ఉన్న అంశాలు అసాధారణమైనవి. నాగరిక సమాజం ఏమాత్రం హర్షించలేనివి. ఇరాక్‌లోని అమెరికా బలగాలు 2007లో హెలికాప్టర్ నుంచి బాంబులు విసిరి రాయ్‌టర్స్ వార్తాసంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులతోసహా డజనుమంది సాధారణ పౌరులను చంపడానికి సంబంధించిన విడియోను మానింగ్ బయటపెట్టాడు. అఫ్ఘాన్‌లోని కాందహార్‌లో ఒక ప్రయాణికుల బస్సును చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరపడం, చెక్‌పోస్టులవద్దా, రహదారులపైనా పౌరులను హింసించడం, కాల్చిచంపడం, ఉన్మాదంతో కేరింతలు కొట్టడంవంటివి వెల్లడించాడు. ఏమీ జరగనట్టు, ఎరగనట్టు ఉండిపోతున్న అమెరికా ప్రభుత్వ తీరుపై కలత చెందాడు. ప్రపంచ ప్రజలకు ఇవన్నీ తెలిసేలా చేస్తే తప్ప ఈ అమానుషాలకు తెరపడదన్న నిర్ణయానికొచ్చాడు.
 
మానింగ్‌కు పడిన శిక్ష ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలెన్నో! సైన్యమంటే ఉక్కు క్రమశిక్షణ కలిగి ఉండాలని, పైనుంచి వచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా పాటించడమే తప్ప ప్రశ్నించనేరాదని చాలా మంది నమ్ముతారు. సైనికులకు హృదయం కాక మెదడు మాత్రమే పనిచేయాలని, అలా చేస్తేనే అంకితభావంతో వ్యవహరించినట్టని విశ్వసిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్, ముసోలిని ఉన్మాద చర్యలను గేలిచేస్తూ చార్లీ చాప్లిన్ నిర్మించిన ‘గ్రేట్ డిక్టేటర్’ చిత్రం సైనికులను మరలుగా బతకొద్దని చెబుతుంది. మనుషులుగా ఆలోచించ మంటుంది. యుద్ధోన్మాదుల తరఫున పోరాడవద్దని ఉద్బోధిస్తుంది. సరిగ్గా మానింగ్ చేసింది అదే. తమ దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యమని, కనుక అది ఏం చేసినా సరైందే అవుతుందని అతను భావించలేదు. ఉగ్రవాదులనుంచి ఇరాక్, అఫ్ఘాన్ ప్రజల్ని రక్షిస్తామని అడుగుపెట్టిన తమ సైన్యమే ఉగ్రవాదిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
 
సాధారణ సైనికుడిలా ఆదేశాలందిన వెంటనే ముందుకు ఉరకడం తప్ప మరేమీ ఆలోచించకపోతే మానింగ్ దేశం కోసం పోరాడిన ధీరుడిగా ప్రభుత్వ మన్ననలు అందుకొనేవాడేమో! కానీ, 23 ఏళ్ల వయస్సుకే అతను పరిణతి ప్రదర్శించాడు. తాము వచ్చింది దేనికో, చేస్తున్నదేమిటో, ప్రపంచానికి చెబుతున్నదేమిటోనన్న విచికిత్సలో పడిపోయాడు. తమ చర్యలను ప్రపంచానికి తెలియజెబితేతప్ప ఇది ఆగేలా లేదని విశ్వసించాడు. 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత అమెరికా సమాజం కరడుగట్టిందని, ‘నువ్వు మాతో లేకపోతే మా శత్రువుతో ఉన్నట్టేన’న్న బుష్ తాత్వికతను తలకెక్కించుకుని మీడియా మౌనం వహిస్తున్నదని గుర్తించలేకపోయాడు. అందుకే, మీడియా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతుందని, కనీసం అప్పుడైనా ఇరాక్, అఫ్ఘానిస్థాన్ ప్రజలపై సాగుతున్న అమానుషాలకు తెరపడుతుందనుకున్నాడు. తనకు తెలిసిన భోగట్టాను ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి పత్రికలకు అందజేశాడు. ఆ పత్రికలు నిరాసక్తత కనబరచడంతో గత్యంతరంలేక వికీలీక్స్‌కు అందజేశాడు.
 
మానింగ్ చర్యలవల్ల అమెరికా ప్రజలకూ, అమెరికాకు సమాచారం అందించిన ఆయా దేశాల్లోని పౌరులకూ ముప్పు ఏర్పడిందని ప్రభుత్వం ఆరోపించింది. అనేక దేశాల్లో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాల్సివచ్చిందని, కొందరు రాజీనామాలు చేశారని తెలిపింది. అయితే, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలనూ సమర్పించలేదు. తన చర్యలు దేశానికిగానీ, ప్రజలకుగానీ హాని కలిగించివుంటే పశ్చాత్తాపపడుతున్నానని అధ్యక్షుడు ఒబామాకు రాసిన లేఖలో మానింగ్ కూడా చెప్పాడు. ప్రజలకు సాయపడటమే తప్ప, ఎవరినైనా బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నాడు. దేశంపై ప్రేమతో, కర్తవ్యదీక్షతో ఈ పని చేశానన్నాడు. నిజానికి శిక్ష ఖరారుకు ముందే మానింగ్ దారుణ నిర్బంధాన్ని చవి చూశాడు. మూడేళ్ల నిర్బంధంలో దాదాపు పది నెలలు అతన్ని ఒంటరి ఖైదు చేశారు.
 
నిద్రపోనీయకుండా గంటల తరబడి ప్రశ్నించారు. మానింగ్ జులాయి అయినట్టయితే, అతనికేమీ ఉన్నతాదర్శాలు లేనట్టయితే తనకు అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని కోట్లాది డాలర్లకు అమ్ముకునేవాడు. లేదా సైన్యం నుంచి తప్పుకున్నాక వాటి ఆధారంగా సంచలన గ్రంథాలు రాసి డబ్బు, ప్రచారం పొందేవాడు. అతను అదేమీ చేయలేదు. ప్రభుత్వం ఆరోపించినట్టు అతను దేశద్రోహి కాదు...ఉగ్రవాది అంతకన్నా కాదు. స్ఫటిక స్వచ్ఛమైన హృదయంతో, వజ్ర సదృశమైన సంకల్పంతో ఉన్నతమైన సమాజాన్ని కాంక్షించిన సమాచార యోధుడు. ఇప్పుడు మానింగ్ క్షమాభిక్ష కోరుతూ రాసిన లేఖ ఒబామా చేతిలో ఉంది. దాన్ని ఆమోదించి అమెరికాలో ఔన్నత్యం ఇంకా మిగిలే ఉన్నదని నిరూపిస్తారో, లేదో తేల్చుకోవాల్సింది ఆయనే. ఒబామా అలా వ్యవహరించేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ ప్రజానీకంపైనా, మరీ ముఖ్యంగా అమెరికా పౌరులపైనా ఉంది.

మరిన్ని వార్తలు