ఉత్తరాఖండ్ డ్రామా!

30 Mar, 2016 01:29 IST|Sakshi

అవసరార్ధం అభిప్రాయాలు ప్రకటించడం తప్ప దేనిపైనా నికరమైన, సూత్రబద్ధమైన వైఖరిని ప్రదర్శించలేని రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకు ఉత్తరాఖండ్ తాజా ఉదాహరణ. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చిన్నగా మొదలైన ఎమ్మెల్యేల తిరుగుబాటు చివరకు ఆ ప్రభుత్వ మనుగడకే ముప్పు కలిగించే స్థాయికి చేరుకోవడం... కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం లాంటి పరిణామాలు అందరినీ విస్మయపరిచాయి. రాష్ట్ర ప్రభు త్వానికి బలం ఉన్నదో లేదో నిర్ణయించడానికి ఈ నెల 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. ఏ ప్రభుత్వానికైనా అసెంబ్లీలో జరిగే బలపరీక్షే కీలకం.

ఆ బలపరీక్షలో నెగ్గితేనే, అత్యధిక సభ్యుల విశ్వాసం చూరగొంటేనే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించాలి. ఈ సంగతిని ఎస్‌ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పి 22 ఏళ్లు దాటుతోంది. అంతకు ముందుతో పోలిస్తే ఆ తీర్పు వెలువడ్డాక కేంద్రంలో అధికారం చలాయించే పాలకులు కాస్త తగ్గిన మాట వాస్తవమే అయినా అలాంటి చర్యలకు పూర్తిగా స్వస్తి పలకలేదు. బొమ్మైకేసుకు ముందు 15 సంవత్సరాలు...ఆ తర్వాత 15 సంవత్స రాలు కొలమానంగా తీసుకుని రాష్ట్రపతి పాలనకు వీలుకల్పించే 356వ అధికరణను కేంద్రంలో అధికారంలో ఉండే పాలకులు ఎన్నిసార్లు ప్రయోగించారని ఒక సామాజిక శాస్త్రవేత్త లెక్కలుగట్టినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. బొమ్మైకేసుకు ముందు ఈ అధికరణను 40 సార్లు...ఆ తర్వాత 11 సార్లు అమలు చేశారని ఆయన 2012లో తేల్చిచెప్పారు. న్యాయస్థానాల భయంతో పాలకులు కాస్త తగ్గారని ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది.
 
 ఏ రాష్ట్రంలోనైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్రపతి భావించినపక్షంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చునని 356 అధికరణ చెబుతోంది. కానీ తమకు నచ్చని ప్రభుత్వాన్ని సాగనంపడానికే ఈ అధికరణ కేంద్రంలోని పాలకులకు అక్కరకొస్తున్నది. రాష్ట్రపతి పదవిలో ఉండేవారు ఇలాంటి చర్యల విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరిస్తే ఈ రకమైన పోకడలకు ఆస్కారం ఉండేది కాదు. కానీ కె.ఆర్. నారాయణన్ ఒక్కరే రాష్ట్రపతిగా ఈ విషయంలో దృఢంగా వ్యవహరించారు.
 
 యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన సిఫార్సును ఒకసారి, బిహార్ సర్కార్‌ను బర్తరఫ్ చేసే సిఫార్సును మరొ కసారి 1997లో ఆయన తోసిపుచ్చారు. అంతకుముందూ, ఆ తర్వాతా ఎవరూ ఇంత స్వతంత్రంగా వ్యవహరించిన సందర్భాలు కనబడవు. కేంద్ర-రాష్ట్ర సంబం ధాలపై నియమించిన సర్కారియా కమిషన్ సైతం 356వ అధికరణ దుర్విని యోగాన్ని తప్పుబట్టింది. అప్పటివరకూ మొత్తంగా 75 సందర్భాల్లో ఈ అధికర ణాన్ని ఉపయోగిస్తే అందులో కేవలం 26 సార్లు మాత్రమే ‘సరైన కారణాలు’ ఉన్నాయని 1988లో సమర్పించిన నివేదికలో తేల్చిచెప్పింది.
 
 ఈనెల 31న బలనిరూపణ చేసుకోవాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఆదేశాల ద్వారా రాష్ట్రపతి పాలన విధింపుపై స్టే విధించి హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించినట్టు భావించ వచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వానికి నైతికంగానూ, చట్టపరంగానూ ఎదురుదెబ్బ తగిలినట్టే. వాస్తవానికి ఈ నెల 28న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధపడాలని రావత్ సర్కారుకు ఆ రాష్ట్ర గవర్నర్ కెకె పాల్ చేసిన సూచనను సజావుగా అమలు జరగనిచ్చి ఉంటే ఆ ప్రభుత్వం ఉండటమో, ఊడటమో తేలిపోయేది. కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా హఠాత్తుగా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించింది. ఇది తొందర పాటు చర్యేనని హైకోర్టు ఆదేశాలు తెలియజెబుతున్నాయి. రావత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడాన్ని కూడా హైకోర్టు ఒకరకంగా నిలిపివేసినట్టే లెక్క. 31న జరిగే బలపరీక్షలో వారు కూడా ఓటేసే అవకాశాన్ని కల్పించడం ఇందువల్లే కావొచ్చు. అయితే, ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై ఉన్న వివాదాన్ని తేల్చేవరకూ వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. మొత్తంమీద హైకోర్టు ఉత్తర్వులు అధికారాన్ని కోల్పోయిన రావత్‌కూ, సభ్యత్వం రద్దయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నాయి.  
 
 లోగడ అరుణాచల్ ప్రదేశ్‌లోనూ, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా తనదీ కాంగ్రెస్ చూపిన బాటేనని ఎన్‌డీఏ సర్కారు చెప్పినట్టయింది. ఉత్తరాఖండ్‌లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం విషయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరినట్టు ఓటింగ్‌కు స్పీకర్ అనుమ తించకపోయి ఉండొచ్చు. రాజ్యాంగపరంగా, నైతికంగా అది దోషమే కావొచ్చు. ఆ విషయంలో న్యాయస్థానాలు రాజ్యాంగం అనుమతించిన మేరకు జోక్యం చేసు కుంటాయి. జనం అంతిమంగా తీర్పునిస్తారు. అంతేతప్ప దాన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకోవడం మంచిది కాదు.
 
 ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయకుండా ఉంటే మంచిదని కేంద్రం గుర్తించాలి. తాము విపక్షంలో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయడాన్నీ, అప్పుడు తాము తీసుకున్న వైఖరినీ బీజేపీ నేతలు మర్చిపోకూడదు. ఉత్తరాఖండ్ అనుభవంతో కాంగ్రెస్‌కు తత్వం బోధపడినట్టుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేయడం అప్రజాస్వామికమని వాదిస్తోంది. అంతకన్నా ముందు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తే ఇలాంటి తిప్పలు రావని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. ఆ పని చేస్తే కనీసం మణిపూర్‌లోనైనా ప్రభుత్వాన్ని రక్షించు కోగలుగుతామని గ్రహించాలి.

మరిన్ని వార్తలు