పరిణత విప్లవకారుడు ప్రభాకర్‌

16 Mar, 2018 01:24 IST|Sakshi

సందర్భం
రెండు దశాబ్దాల క్రితం బీఎడ్‌ పూర్తి చేసి డీఎస్సీ పరీక్షకు అర్హుడైన ప్రభాకర్‌ తాజాగా తెలంగాణ డీఎస్సీ పరీక్ష సమయంలోనే ఎన్‌కౌంటర్‌కు గురై తన అంతిమ యాత్రలో ఊరేగవలసిరావడం కాకతాళీయమూ, విషాదం కూడా.

రాజ్యం దృష్టిలో సంచలనాత్మక నాయకుడిగా నమోదు కాలేదు గానీ ప్రజల హృదయాల్లో ఇంచుమించు రెండు దశాబ్దాలుగా ప్రభాకరుడిగా వెలుగొందుతున్న దడబోయిన స్వామి విప్లవోద్యమం ఎదుర్కొనే తీవ్రమైన కష్టనష్టాల దృష్ట్యా జీవితంలోని పశ్చిమార్థంలోకి ప్రవేశిస్తున్నట్లే. తాను, తనతోపాటు క్యాంపులో ఉండిపోయిన ఆదివాసీ మహిళ రత్న.. తెలంగాణ గ్రేహౌండ్స్‌ దాడిచేసిన మార్చ్‌ 2వ తేదీ ఉదయం తీవ్ర అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నారు. అయినా మొదట తనను గురిచూసి కాల్చిన గ్రేహౌండ్స్‌ను ప్రతిఘటించడానికే ప్రయత్నించాడు ప్రభాకర్‌. 

గ్రేహౌండ్స్‌లో మరణించిన సుశీల్‌కుమార్‌ శరీరంలో వెళ్లిన బుల్లెట్‌ ఎదురుగా వచ్చి తాకింది కాదు. వెనుకనించి దూసుకువచ్చిందని పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు. శవపరీక్ష చేసినవాళ్లు నిజాలు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు గానీ శవాలు అబద్ధం చెప్పవు కదా. దడబోయిన స్వామి ఏబైమూడేళ్లకు పూర్వం అప్పటి అవిభక్త వరంగల్‌ జిల్లాలో కడిపికొండ శివారుగ్రామంగా ఉన్న రాంపేట గ్రామంలో ఇద్దరన్నల తర్వాత మూడోవాడుగా ఒక పేద గొల్లకుటుంబంలో పుట్టాడు. నగర శివారు ప్రాంతంలో రాజకీయ, విద్యాచైతన్యం ఉండటం వల్ల పట్టుదలగా చదువుకున్నాడు. ఐదోతరగతి వరకు ఊర్లో, ఇంటర్‌వరకు కాజీపేటలో, డిగ్రీ కాకతీయ యూనివర్సిటీలో చేసి హనుమకొండ బీఎడ్‌ కాలేజీలో బీఎడ్‌ చేశాడు,  తర్వాత ఎంఎస్సీ కూడా పూర్తి చేసి కడిపికొండ పరిసర గ్రామాల్లో విద్యావలంటీర్‌గా పనిచేసాడు.

స్వామికి బుద్ధి తెలిసేనాటికే కడిపికొండ, భట్టుపల్లి, కాజీపేట డీజల్‌కాలనీ, రోడ్డు దాటితే సోమిడి మొదలైన అన్ని గ్రామాల్లో విప్లవోద్యమం, రాడికల్‌ విద్యార్థి, యువజనోద్యమాలే గ్రామీణ వరంగల్‌ జిల్లాలో ప్రాధామ్యంలో ఉన్నవి. తనకంటే ముందు సీకేఎం కాలేజీ విద్యార్థి అయిన క్రాంతి రణదేవ్, తన ఊరివాడే అనదగిన శ్యాంసుందరరెడ్డి ఆయనకు నవయవ్వనం నాటికే వేలుపట్టుకొని నడిపించే రాడికల్‌ విద్యార్థి, యువజనోద్యమ నాయకులయ్యారు. 

సూరపనేని జనార్దన్, జన్నుచిన్నాలు నాయకత్వ వారసత్వాన్ని స్వీకరించి కాకతీయ యునివర్సిటీలో రాడికల్‌ విద్యార్థి ఉద్యమం మొదలు, జిల్లాలో విప్లవోద్యమం విస్తృతంగా నిర్మాణం చేసిన పులి అంజయ్య (సాగర్‌) కు పైన పేర్కొన్న గ్రామాలు పెట్టని కోటలు. ఈ వాతావరణంలో విద్యార్థిగానైనా, ఉపాధ్యాయునిగానైనా మసలుకున్న స్వామి 1985 నుంచే ప్రజలమధ్య వివిధ రకాల విప్లవ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. విద్యావలంటీర్‌గా పనిచేసే అవకాశం ఉపయోగించుకొని తన ఊరి పరిసర గ్రామాల్లో స్టడీసర్కిల్స్‌  ఏర్పాటుచేసి విప్లవ రాజకీయ అధ్యయనం, అధ్యాపనలను ప్రోత్సహించాడు.

ఆయన పనిచేసిన తీరుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తీవ్ర నిర్బంధం అమలవుతున్న 1999లో రాజ్యం దృష్టిలో పడిన తన సీనియర్‌ ఒకరు శత్రువు దృష్టి మళ్లించడానికి ఖమ్మంలో కాంగ్రెస్‌ సేవాదళ్‌ శిబిరంలో పాల్గొనడానికి వెళ్తే తాను కూడ వెంట వెళ్లాడు. కానీ మళ్లీ అతనితో తిరిగి రాలేదు. పోలీసులకేమి ఉప్పు అందిందో కానీ వచ్చి ఇల్లంతా సోదా చేసారు. ఇంటి అటక పైన గెరిల్లా యూనిఫాం కని పించింది. ఇంటివాళ్లను వేధించి, బెదిరించి స్వామి వెనక్కిరాగానే ఎస్పీ ఆఫీసుకు తీసుకురమ్మని పురమాయించి పోయారు. స్వామి ఇంటికివచ్చి పోలీసులు వచ్చి పోయారని ఇంటివాళ్లు చెప్పగానే అటక ఎక్కి చూసి ఇంక అదే పోకడగా వెళ్లిపోయాడు. అలా 2001లో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్న స్వామి ఏడేళ్లపాటు వరంగల్, జనగామ ఏరియాలో పనిచేసి కమాండర్‌ స్థాయికి ఎదిగాడు. 1993కన్నా ముందు సాగర్‌కు కొరియర్‌గా కూడ పనిచేసాడు. 

ఇంత సుదీర్ఘకాలపు పట్టణ, గ్రామీణ విద్యార్థులు, యువకులు, ప్రజలమధ్యన వివిధ రంగాలలో పనిచేసిన అనుభవంతో ఒక స్థిమితమైన పరిణతితో ఆయన 2008లో దండకారణ్యానికి వెళ్లి అక్కడ అప్పటినుంచీ స్థిరంగా సీపీఐ మావోయిస్టు సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరోలో ప్రెస్‌వర్క్‌లో ఉన్నాడు. నాయకత్వానికి శ్రేణులకు అనుసంధానంగా పత్రిక, ప్రచురణలు వెలువరించడంలో నిరంతరం కృషిచేస్తూ నేర్చుకుంటూనే నేర్పుతూ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌కమిటీ డివిజన్‌ కమిటీ నాయకత్వ స్థాయికి ఎదిగాడు. అంత కీలకమైన స్థానంలో ఇంత సుదీర్ఘకాలంగా ఉంటూ శత్రువు దృష్టి పడకుండా ఆయన వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయమైనది. 

రాంపేట గ్రామ ఉమ్మడి అవసరాల కోసం ఉపయోగించే ఏ అగ్రిమెంట్‌ కాగితంలోనైనా, యాదవ సంగం రికార్డుల్లో, స్థల కొనుగోలు కాగితాల్లో, స్మశాన వాటిక కాగితాల్లో, ప్రభుత్వ ఫిర్యాదుల్లో ప్రభాకర్‌ రాతే ఉంది. అలాంటి వ్యక్తి మార్చి 2న ఎన్‌కౌంటర్లో చనిపోయినప్పుడు వార్తల్లోనూ, బ్యానర్లలోనూ, మావోయిస్టు పార్టీ కేంద్ర రీజనల్‌ బ్యూరో ప్రెస్‌ ఇన్‌చార్జిగా ఉన్నాడని వచ్చిన వార్త రాంపేటకే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఊళ్లో కాగితాలపై రాసిన పని అతడిని దక్షిణభారత దేశం దాకా తీసుకుపోయింది. 

1998లో గ్రామంలోనే తొలి వ్యక్తిగా బీఎడ్‌ పూర్తి చేసి డీఎస్సీ పరీక్షకు అర్హుడైన ప్రభాకర్‌ 2018 మార్చి 2వ తేదీ తాజాగా తెలంగాణ డీఎస్సీ పరీక్ష జరిగిన సమయంలోనే తన అంతిమ యాత్రలో ఊరేగవలసిరావడం కాకతాళీయమూ, విషాదం కూడా. 
(మార్చి 2న పూజారి కాంకేర్‌ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగిన దడబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ స్మృతిలో)

- వరవరరావు 
వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు

మరిన్ని వార్తలు