చైనా దురాగతం

18 Jun, 2020 00:43 IST|Sakshi

స్నేహం నటిస్తూనే ద్రోహం చేయడం అలవాటైన చైనా అదును చూసి దెబ్బ కొట్టింది. చర్చలకొచ్చినట్టే వచ్చి, ఉన్న ప్రాంతం నుంచి రెండు పక్షాలూ వెనక్కి వెళ్లాలన్న అవగాహనకు అంగీకరించినట్టే కనబడి హఠాత్తుగా సోమవారం రాత్రి దాడికి తెగబడింది. తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌తో సహా 20మంది భారత జవాన్ల ప్రాణాలు బలితీసుకుంది. రాళ్లు, ఇనుపరాడ్లతో సైనికులు చేసిన దాడిని మన జవాన్లు తిప్పికొట్టడంతో అటువైపు 43మంది మరణించారని అంటున్నారు. ఎల్‌ఏసీ వద్ద భారత భూభూగంలో చైనా సైనికులు నిర్మిస్తున్న శిబిరంపై మన జవాన్లు అభ్యంతరం చెప్పడంతో చైనా సైనికులు దాడికి దిగారని మన ప్రభుత్వం చెబుతోంది. ఇదే సంగతిని చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ కి మన విదేశాంగమంత్రి జైశంకర్‌ చెప్పారు. ఒక్క తూటా కూడా పేలలేదు గనుక పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న నిర్ణయానికి రానవసరం లేదు. కానీ ఇదిలాగే కొనసాగితే ఆ పరిస్థితి కూడా ఏర్పడొచ్చు.

నెల రోజులుగా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద లద్దాఖ్‌లో అలజడి రేగుతున్నదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా గాల్వాన్‌ లోయ వద్ద చైనా సైనికులు దాదాపు వంద శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంకర్లను నిర్మించే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలోకి చొరబడటమే కాక... అది ఎప్పటినుంచో తన అధీనంలోనిదేనని, భారత సైనికులే దాన్ని ఆక్రమించే యత్నం చేశారని చైనా కొత్త పాట మొదలుపెట్టింది. వాస్తవానికి గత కొద్ది సంవత్సరాలుగా లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా సైనికుల కదలికలున్నాయి. ఆ ప్రాంతంలోని చుశాల్‌ సబ్‌ డివిజన్‌ వాసులు ఎప్పటినుంచో ఈ సంగతి చెబుతున్నారు. పశువుల మేత కోసం తాము మొదటినుంచీ వెళ్లే ప్రాంతంలో తిరగొద్దని చైనా సైనికులు బెదిరిస్తున్నారని ఫిర్యాదుచేశారు. వాటిపై సకాలంలో స్పందించి చర్య తీసుకునివుంటే బహుశా పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదేమో!

చైనాతో మనకు చేదు అనుభవాలు చాలావున్నాయి. 1962లో జరిగిన యుద్ధం సంగతలావుంచి 1975లో మన భూభాగంలోకి చొరబడి అకారణంగా మన సైనికులు నలుగుర్ని పొట్టనబెట్టుకున్న చరిత్ర దానిది. 1962లో అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 80,000మంది చైనా సైనికులను కేవలం 10,000మంది భారత్‌ సైనికులు నిలువరించారు. అప్పటికి పెద్దగా మెరుగైన ఆయుధాలు లేకపోయినా శక్తికొద్దీ పోరాడారు. చివరకు ఓటమి సంభవించినా మన జవాన్ల ప్రతిఘటన అంత తీవ్రంగా వుంటుందని చైనా వూహించలేదు. అప్పటి యుద్ధంలో పాలుపంచుకున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ హెండర్సన్‌ బ్రూక్స్‌ రూపొందించిన నివేదిక ఆనాటి ఓటమికి ఏయే కారణాలున్నాయో రికార్డు చేసింది. అనంతరకాలంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటూ సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఇరు దేశాలూ అంగీకారానికొచ్చాయి.  

కానీ సరిహద్దుల్లో చైనా తన చేష్టలు మానుకోలేదు. అడపా దడపా సమస్యలు సృష్టిస్తూనే వుంది. 2011నుంచి అది తరచు సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతూనేవుంది. 2013 జూలైలో అప్పటి మన రక్షణమంత్రి ఏకే ఆంటోనీ చైనా పర్యటనలో వుండగానే లద్దాఖ్‌ ప్రాంతంలోని చుమార్‌లో చైనా ఆశ్విక దళం చొరబడి అది తమ భూభాగమని, అక్కడినుంచి నిష్క్రమించాలని మన సైనికులను బెదిరించింది. అంతకు రెండు నెలలక్రితం లద్దాఖ్‌లోని దౌలత్‌బేగ్‌ వద్ద చైనా చొచ్చుకొచ్చి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో వున్న మన నిఘా కెమెరాను చైనా సైనికులు అపహరించారు. 3,488 కిలోమీటర్ల ఎల్‌ఏసీ పొడవునా వివిధచోట్ల సమస్యలున్నాయి. అక్కడి పశ్చిమ, మధ్య, తూర్పు సెక్టార్లలో ఈ రేఖ ఎలావెళ్తుందన్న అంశంలో రెండు దేశాల మధ్యా విభేదాలున్నాయి.

ఆక్సాయ్‌చిన్, లద్దాఖ్‌ ప్రాంతాల్లో సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మన దేశం చెబుతుంటే...భారత్‌ అధీనంలో తమకు చెందిన 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వుందని చైనా దబాయిస్తోంది. గాల్వాన్‌లోయలో అది తరచు ఘర్షణలకు దిగుతోంది. ఇప్పటికే తన ఆక్రమణలోవున్న ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతంలో మెరుగ్గా వుండాలంటే గాల్వాన్‌ లోయ తన సొంతం కావాలన్నది చైనా వ్యూహం. దీనికి గండికొట్టే విధంగా మన దేశం వాస్తవాధీనరేఖ ప్రాంతాల్లో విస్తృతంగా రోడ్ల నిర్మాణం సాగిస్తోంది. దీనికితోడు లద్దాఖ్‌ను మన దేశం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో భవిష్యత్తులో ఆక్సాయ్‌చిన్‌ తన అధీనం నుంచి జారుకునే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన చైనాకు వున్నట్టు కనబడుతోంది. అందుకే మన దేశాన్ని చికాకుపరిచే ఎత్తుగడలకు దిగింది. 

సరిహద్దుల్లో ఎల్లకాలమూ ఘర్షణాత్మక వాతావరణం వుంటే ఎప్పుడో ఒకప్పుడు అది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే ప్రమాదం వుంటుంది. నెలరోజులుగా చైనా సాగిస్తున్న కవ్వింపు చర్యలపర్యవసానమే సోమవారంనాటి విషాద ఘటనలకు దారితీసింది. సీఎంలతో భేటీ సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ప్రతీకార చర్య తప్పదని హెచ్చరించారు. మన విదేశాంగమంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగమంత్రితో మాట్లాడినప్పుడు కూడా ఇటువంటి హెచ్చరికే చేశారు. ఇలా చైనాకు కఠినమైన సందేశాన్ని పంపడంతోపాటు సరిహద్దుల్లో మన ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను మెరుగుపరచుకోవడం, చొరబాటు ప్రయత్నాలను మొగ్గలోనే తుంచడం కొనసాగుతుండాలి.

అది లేనట్టయితే ఎంతో ధైర్యసాహసాలతో పోరాడే విలువైన జవాన్లను కోల్పోయే  స్థితి ఏర్పడుతుంది. 1999లో కార్గిల్‌లో జరిగింది ఇదే. శుక్రవారం కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నది. ఈ సమావేశం దేశ సమష్టితత్వాన్ని చాటాలి. యుద్ధం వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండానే చర్చల ద్వారా, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా చైనా మెడలు వంచగలగాలి. ఈ విషయంలో దృఢంగా వ్యవహరించాలి.

మరిన్ని వార్తలు