అంత అబద్ధం ఎలా రాశారు?

29 Oct, 2018 00:33 IST|Sakshi

సాహిత్య మరమరాలు

విజయనగరం సంస్కృత కళాశాలలో వినాయక నవరాత్రులు కళాశాల ప్రిన్సిపాల్‌ మానాప్రగడ శేషశాయి ఘనంగా జరిపించేవారు. ప్రతి సాయంత్రం ముందు ఒక సాహిత్య ప్రసంగం, తరువాత ఒక సంగీత కార్యక్రమం ఉండేది. ఆ రెండు రంగాల్లో మేటి ఘనాపాఠీలందరూ మా కళ్ళకు, వీనులకు విందు చేసేవారు. అప్పటి ఆ కళాశాల విద్యార్థిగా ఒక మరచిపోలేని సంఘటన. 1972లో ఒకనాటి ప్రసంగంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన ఉద్యోగ జీవితంలోని ఒక సంఘటన వివరించారు. ఆయన గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్‌ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఆదివారం తన ఇంటికి కొంతమంది విద్యార్థినులు వచ్చారట. వారిని వరండాలో ఉన్న కుర్చీలలో కూర్చోమని, ఇంట్లోకి పోయి, మంచినీరు తెచ్చి ఇస్తుండేసరికి ఆ అమ్మాయిలు ‘‘మాస్టారూ! మీరు రాసిన ఉదయశ్రీ పుస్తకంలో ‘కూర్చుండ మాయింట కుర్చీలు లేవు’ అని ఓ పద్యం రాశారు కదా! ఇక్కడ ఇన్ని కుర్చీలు ఉండగా అక్కడ అంత అబద్ధం ఎలా రాయగలిగారండీ?’ అని ప్రశ్నించారట.

అనుకోని ఆ ప్రశ్నకు అవాక్కయిన కరుణశ్రీ ‘‘ఇవన్నీ మీలాంటి అతిథులు కూర్చోడానికి తగిన కుర్చీలు. నేనా పద్యం సకలలోక పాలకుడైన భగవంతుని గూర్చి రాసినది. ఆయన కూర్చోడానికి తగిన కుర్చీ నేనెక్కడి నుండి తేగలను? అందుకే అలా రాయవలసి వచ్చింది’’ అని  తిరిగి బదులిచ్చారట. ఆ మాటలకు మేము ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురయ్యాం.
గార రంగనాథం
 

మరిన్ని వార్తలు