ఇంకా ఇంత అంతరమా?

21 Jan, 2020 00:10 IST|Sakshi

సంపద రాకపోకల గురించి శతకకారుడొక మంచి మాట చెప్పాడు. ‘సిరి తా వచ్చిన వచ్చును, సరళముగా నారికేళ సలిలము భంగిన్‌...’ అన్నాడు. అంటే, కాలం కలిసొస్తే కొబ్బరి నీళ్లు దొరికినంత సరళంగా, సులువుగా సంపద వచ్చి చేరుతుందని కవి హృదయం. పోయే విషయం లోనూ... ‘సిరి తా పోయిన పోవును, కరిమింగిన వెలగపండు కరణిన్‌ సుమతీ!’ అంటాడు. ఏనుగు తినడానికి ముందు, తిన్న తర్వాత కూడా బయటకు వెలగపండు అంతే నిక్షేపంగా కనబడుతుంది, కానీ, లోపల గుజ్జంతటినీ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లాగా ఏనుగు లాగేస్తుంది. అలా తెలియకుండానే సంపద వెళ్లిపోతుందని ఉవాచ. ఒకరికి సంపద ఎంత తేలిగ్గా రావచ్చో అంతే చడీచప్పుడు లేకుండా వెళ్లిపోనూ వచ్చని, అది స్థిరం కాదని చెప్పడం కవి ఉద్దేశం. కానీ, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో తేడా ఉంది. ఏమంటే, వచ్చే వాళ్లకు పైన చెప్పినట్టు తేలిగ్గా, సులభంగా సంపద వచ్చి చేరుతోంది.

ఇక పోయే వాళ్లకు పాపం, చడీచప్పుడు లేకుండా సంపద దక్కకుండా పోతోంది. దాంతో ఆర్థిక అంతరాలు బాగా పెరుగుతున్నాయి. ధనవంతులు ఇంకా సంపన్ను లవుతుంటే, పేదలు మరింత పేదరికంలోకి జారి, బతుకు సమరం నెగ్గలేక చతికిలపడుతున్నారు. మన దేశంలో ఒక శాతం జనాభా దగ్గర ఉన్న సంపద, 70 శాతం అట్టడుగు జనాభా (అంటే, 95 కోట్ల మంది) వద్దనున్న సంపదకు నాలుగురెట్లపైనే అధికం అంటే ఆలోచించండి! దావోస్‌లో సోమవారం ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్లుఈఎఫ్‌) యాభయవ వార్షిక భేటీ సందర్భంగా ఎప్పట్లాగే ‘ఆక్స్‌ఫామ్‌’ ఓ నివేదిక విడుదల చేసింది. ‘జాగ్రత్తకు వేళాయె’ (టైమ్‌ టు కేర్‌) అంటూ ఈ అధ్యయన నివేదిక వెల్లడించిన వివరాలు సగటు ఆలోచనాపరుల్ని కలవరపరుస్తున్నాయి. ఇంతటి ఆర్థిక అంతరాలు ఎడతెగని సామాజిక అసమానతలకు, అశాంతికి దారితీస్తున్నాయి.

భూమ్మీది 60 శాతం జనాభా (460 కోట్ల మంది) వద్ద కన్నా ఎక్కువ సంపద ప్రపంచంలోని 2,153 మంది కోటీశ్వరుల వద్ద పోగులుపడి ఉందనేది తాజా లెక్క! దశాబ్ద కాలంలో ప్రపంచ కోటీశ్వరుల సంఖ్య రెట్టింపయింది. అసమానతల్ని తొలగించే నిర్దిష్ట విధానాలు, కార్యక్రమాలు లేకుండా ఈ అంత రాల్ని తగ్గించడం దాదాపు అసంభవమని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో అశాంతికి కారణమౌతున్న సామాజిక, రాజకీయ అంశాలకు తోడు ఈ ఆర్థిక అంతరాల సమస్య తోడవడం అగ్నికి ఆజ్యం పోస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక ‘గ్లోబల్‌ రిస్క్స్‌ రిపోర్ట్‌’ కూడా ఇలాంటి హెచ్చరికే చేసింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) గుర్తించిన 195 ప్రపంచ దేశాల్లో 40 శాతం, అంటే 75 దేశాల్లో ఈ సంవత్సరం (2020) అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయన్నది ‘వెరిక్స్‌ మ్యాపిల్‌ క్రాఫ్ట్‌’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డాటా విశ్లేషణ సంస్థ అంచనా! అందులో భారత్‌ కూడా ఉంది. 2019 లో హాంగ్‌కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్‌ వంటి 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులుంటే ఇప్పుడా దేశాల సంఖ్య 75కు చేరుతోంది.

ఆర్థిక అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తున్న దుస్థితి దాదాపు అన్ని ఖండాల్లోనూ ఉంది. అవినీతి, పాలకుల ఆశ్రితపక్షపాతం, రాజ్యాంగ ఉల్లంఘనలు, అడ్డగోలుగా పెరిగే నిత్యావసరాల ధరలు వంటివే ఆర్థిక అంతరాల వృద్ధికి కారణమని ఎకనమిక్‌ ఫోరమ్‌ భావన. అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లోనూ వ్యక్తులు, కుటుంబాల వార్షికాదాయాల్లో పెరుగుతున్న వ్యత్యాసాలు రికార్డు స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అవకాశాల అంతరాలే ఆర్థిక అసమానతలకు కారణం. ఉన్న వాళ్లకు అన్నీ సమకూరుతాయి. తద్వారా వాళ్లు సంపదను పెంచుకుంటున్నారు. అవకాశాల్లోనే అన్యాయం వల్ల పేదలు తమ పరిస్థితిని ఎప్పటికీ మెరుగు పరచుకోలేకపోతున్నారు. ఉద్యోగాలుండవు, ఉపాధి దొరకదు, జీవన ప్రమాణాలు మెరుగుపరచుకునే ఆస్కారమే  శూన్యం! అరకొర సంపాదన కూడా రోజువారీ ఖర్చు లకు తోడు విద్య, వైద్యం వంటి అత్యవసరాలకే కరిగిపోతోంది. ఇక సంపద వృద్ధికి అవకాశ మెక్కడ? వారి ఆర్థికస్థితి మెరుగుకు దోహదపడకుండా, ఎంత సేపూ వారిని ఓటు బ్యాంకులుగా పరిగణించే పాలనా వ్యవస్థలు ఎప్పటికప్పుడు తృణమో, పణమో తాయిలాలు అందించి పబ్బం గడుపుకుంటున్నాయి.

‘అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో వడ్డించే...’ పద్ధతిలో ఎర్ర తివాచీలు పరచి కార్పొరేట్లకు దాసోహమంటున్నాయి. పెద్ద ఖర్చుతో కూడుకున్న మన ఎన్నికల సమయంలో వారు వీరికి, అధికారం చేపట్టాక వీరు వారికి పరస్పరం తోడ్పడుతూ ప్రజాధనం కొల్లగొడుతున్న ఫార్ములాలే సమాజంలో ఆర్థిక అంతరాల్ని పెంచుతున్నాయి. ఏటా ఇది పెరు గుతోంది. 63 మంది భారత అతి ఐశ్వర్యవంతుల సంపద 2018–19 కేంద్ర మొత్తం బడ్జెట్‌ (రూ.24,42,200 కోట్లు) కంటే ఎక్కువ. డాక్టర్‌ అంబేద్కర్‌ చెప్పినట్టు, మన అంతరాల సమాజం... మధ్యలో మెట్లు, నిచ్చెనల్లేని బహుళ అంతస్తు భవనం లాంటిది. పై అంతస్తుల్లో ఎవరైనా అనర్హు లున్నా కిందకు రారు. కింది అంతస్థుల్లోని వారిలో యోగ్యులున్నా పైకి రాలేరు. కాలక్రమంలో మన వ్యవస్థలు ఈ దుస్థితినే మరింత పెంచిపోషిస్తున్నాయి. మరి మన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ రక్షణలు, పంచవర్షప్రణాళికలు, భారీ బడ్జెట్లు... ఏం ఫలితాలు సాధించి నట్టు? అనే ప్రశ్న సహజం. ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అంతరాల్ని తొలగిం చాలన్నది యూఎన్‌ నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో (ఎస్డీజీ) ముఖ్యమైంది. అసమానతల్ని పూడ్చే ప్రత్యేక ఆర్థిక వనరుల్ని సమకూర్చుకునే అవకాశాలున్నా మన ప్రభుత్వాలు సంపన్నులపై పన్ను విధింపులో ఉదారంగా ఉంటున్నాయి. ప్రపంచ జనాభాలో శీర్షాన ఉన్న ఒక శాతం సంప న్నులు 0.5 శాతం పన్ను ఎక్కువ చెల్లిస్తే, వచ్చే పదేళ్లలో విద్య–వైద్యం, పిల్లలు–వృద్ధుల సంక్షేమం వంటి కీలక రంగాల్లో 11.70 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించొచ్చు. ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ ప్రతిపాదనే!

మరిన్ని వార్తలు