నిజనిజాలు తేల్చాలి

22 Jul, 2014 00:00 IST|Sakshi

మన దేశంలో న్యాయవ్యవస్థపై ఉండే విశ్వాసం మొత్తంగా ప్రజా స్వామ్య మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నది. ఇతర వ్యవస్థలపై ఆరోపణలువస్తే... చర్య తీసుకునేందుకు న్యాయవ్యవస్థ ఉన్నదన్న భరోసా ఉంటుంది. ఈ భరోసాయే ప్రజాస్వామ్య వ్యవస్థను చెక్కుచె దరకుండా కాపాడుతున్నది. కానీ, అన్నిటిలాగే న్యాయవ్యవస్థ కూడా చెదలు పడుతున్నదని అందులో భాగంగా ఉన్నవారు చెబుతుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా అవతా రమెత్తిన ఒక అవినీతిపరుడి గురించి వెల్లడించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ప్రస్తుత అధ్యక్షుడు మార్కండేయ కట్జూ తేనెతుట్టెను కదిపారు. ఆ వ్యక్తి జిల్లా జడ్జీగా నేరుగా నియమితుడై అనంతరకాలంలో ఎన్ని అవినీతి ఆరోపణలొచ్చినా హైకోర్టు న్యాయ మూర్తి వరకూ ఎదిగిన తీరును బయటపెట్టారు. ఆయనలా ఎదగ డంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ మొదలుకొని కేంద్ర మంత్రులు, ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరకూ ఎవరెవరి ప్రమేయం ఎంతవరకూ ఉన్నదో పూసగుచ్చినట్టు వివరిం చారు. అతన్ని రెగ్యులర్ న్యాయమూర్తిగా నియమించకపోతే యూపీఏ సర్కారు మనుగడకే ముప్పువాటిల్లే స్థితి ఏర్పడేసరికి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లహోటి దగ్గరకు కేంద్రమంత్రి ఒకరు వెళ్లి పనిపూర్తిచేయించుకున్న వైనాన్ని తెలిపారు. సాధారణంగా హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితుల య్యేవారిని అరుదైన కేసుల్లో తప్ప ఏడాదికాలం గడిచాక రెగ్యులర్ న్యాయమూర్తిగా నియమిస్తారు. జస్టిస్ కట్జూ చెప్పినదాన్నిబట్టి అవి నీతి ఆరోపణలొచ్చిన ఆ న్యాయమూర్తి రెగ్యులర్ న్యాయమూర్తి కావ డానికి రెండేళ్లు పట్టింది. అందువల్లే జస్టిస్ లహోటీ, జస్టిస్ బాల కృష్ణన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చినా ఇందులో ‘ఏదో జరిగివుం టుంద’న్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇప్పుడు జస్టిస్ కట్జూ వెల్లడించిన అంశాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన న్యాయవ్యవ స్థలో బాధ్యతాయుత పదవుల్లో కొనసాగు తుండగా దీనిపై బహిరంగంగా ఎందుకు మాట్లాడలేదన్నది అందులో ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న న్యాయ మైనదా కాదా అన్నది పృచ్ఛకులెవరన్న అంశంపై ఆధారపడి ఉం టుంది. అడిగినవారు సామాన్యులైతే ప్రశ్న సమంజసమైనదే. దానికి జస్టిస్ కట్జూ జవాబివ్వాల్సిందే. కళ్లముందు జరిగే అన్యాయాన్ని ఎదు ర్కొనలేనప్పుడు సామాన్యులకూ, అలాంటి బాధ్యతాయుత పద వుల్లో ఉన్నవారికీ తేడా ఏమిటన్న సందేహం సబబైనదే. కానీ, న్యాయ వ్యవస్థను భ్రష్టుపట్టించడానికి చూసినవారే ఆ ప్రశ్నవేస్తే అందులో నిజాయితీకన్నా తప్పించుకునే ధోరణే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఈ బాపతు ప్రశ్నతో తమ పాపాలను కడిగేసుకుందామని చూస్తున్నారు. జస్టిస్ కట్జూ పదేళ్ల తర్వాతనైనా లోపాయికారీగా జరిగిపోయిన ఒక దారుణాన్ని వెలుగులోకి తెచ్చా రని, అందునా న్యాయవ్యవస్థ జవాబుదారీ బిల్లు పార్లమెంటు ముం దుకు రాబోతున్న తరుణంలో ఒక విస్తృతమైన చర్చకు వీలుకల్పిం చారని సంతోషించాలి.  న్యాయవ్యవస్థ గురించి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. జస్టిస్ రామస్వామి మొదలుకొని జస్టిస్ బాలకృష్ణన్ వరకూ ఎందరిపైనో అవినీతి ఆరోపణలు వచ్చాయి. న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు ఒక చట్టం తీసుకురావలసిన అవసరం ఉన్నదని 1997లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ ప్రభుత్వానికి  లేఖ రాశారు.  మొత్తానికి కొద్దో గొప్పో తేడా తప్ప మిగిలిన అన్ని వ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థలో కూడా లోపాలు న్నాయి. మిగిలిన వ్యవస్థల లోపాలపై తరచు బహిరంగంగా చర్చ జరుగుతుంటుంది. వాటి అమరిక సరిచేయడానికి ప్రయత్నాలూ సాగుతుంటాయి. కానీ, న్యాయవ్యవస్థ అలా కాదు. దాన్నేమయినా అంటే కోర్టు ధిక్కార నేరం ఎదుర్కొనవలసివస్తుందన్న భయం సామాన్యుల్లో నెలకొంటుంది.

న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే కొలీ జియం విధానమే ఈ మొత్తం కశ్మలానికి కారణమన్న న్యాయనిపు ణుల అభిప్రాయంలో నిజముంది. న్యాయమూర్తులుగా నియమితుల య్యేవారి గురించి ఐబీ దర్యాప్తు చేస్తున్నది. నివేదికలు ఇస్తున్నది. అయితే, ఆ నివేదికల్లోని నిజానిజాల సంగతిని నిర్ధారించుకునేది న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే. అందుకు వారికుండే ప్రాతిపదికలేమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు జస్టిస్ కట్జూ చెప్పిన వివరాలనుబట్టి చూస్తే అవినీతిపరుడైన న్యాయమూర్తిపై ఐబీ నివేది కలూ బుట్టదాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటకూ విలువ లేకుండా పోయింది. ఒకరు కాదు...ఏకంగా ముగ్గురు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లు అధికారంలో ఉన్నవారి ప్రయోజ నాలను రక్షించడం కోసం అవినీతి ఆరోపణలొచ్చిన న్యాయమూర్తిని పదవిలో కొనసాగించారని అర్ధమవుతుంది.  ఈ మొత్తం వ్యవహారం కార్యనిర్వాహక వ్యవస్థకూ, న్యాయవ్యవస్థకూ మధ్య ఉండే సంబం ధాలపైనా... న్యాయవ్యవస్థకు ఉందనుకుంటున్న స్వతంత్రతపైనా సందేహాలు రేకెత్తిస్తున్నది. వ్యవస్థల పనితీరుపై నీలినీడలు కమ్ము కుంటే, వాటి విశ్వసనీయత దెబ్బతింటే అది ప్రమాదకర పర్యవసా నాలకు దారితీస్తుంది. అందువల్లే జస్టిస్ కట్జూ చేసిన ఆరోపణల్లో నిజానిజాలేమిటో దేశ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉన్నది. ఆ హైకోర్టు న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలు, ఐబీ నివేదికలు, ఆయనను కొనసాగించడానికి కొలీజియం చెప్పిన కారణాలు వగైరా అంశాలన్నీ బహిరంగపర్చాల్సి ఉంది. న్యాయవ్యవస్థ విశ్వసనీ యతను కాపాడాలంటే ఇది చాలా అవసరం.
 
 
 

మరిన్ని వార్తలు