అమ్మకు ఆసరా ఏది?

5 Jan, 2014 00:40 IST|Sakshi

అన్నిటా వెనకబాటుతనాన్నే ప్రదర్శిస్తున్న వేళ ఏ కొంచెమైనా ప్రగతి కనిపిస్తే ప్రాణం కుదుటపడుతుంది. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు తగ్గిందని భారత రిజిస్ట్రార్ జనరల్ ఈమధ్యే విడుదల చేసిన నివేదిక తీసుకొచ్చిన కబురు ఎవరికైనా సంతోషం కలిగించకమానదు. అయితే, పేదరికంలో మనకన్నా చాలా వెనకబడివున్న దేశాలు సాధించినదాంతో పోలిస్తే మనదేమీ అంత ఎక్కువ కాదని తెలిసినప్పుడు మనసు చివుక్కుమంటుంది. ప్రసూతి సమయంలో ఏర్పడే చిక్కులవల్ల మరణించే తల్లుల సంఖ్య 2007-09 నాటి మరణాలతో పోలిస్తే 16శాతం తగ్గిందని రిజిస్ట్రార్ జనరల్ తాజా నివేదిక చెబుతోంది. లక్ష శిశు జననాలకు 2007-09లో 212 మరణాలుండగా ఇప్పుడది 178కి చేరుకుంది. గత దశాబ్దకాలంలో ఈ తగ్గుదల 40శాతంవరకూ ఉంది. ఇలా మరణాల సంఖ్య తగ్గడం ఆనందించదగ్గ అంశమే అయినా నిర్దేశించుకున్న లక్ష్యం 109తో పోలిస్తే ఇది చాలా తక్కువే. 2015కల్లా ప్రపంచమంతటా ప్రసూతి మరణాలను గణనీయంగా తగ్గించాలని నిర్దేశిస్తూ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన లక్ష్యమది. మరొక్క ఏడాది కాలంలో ఆ లక్ష్యం చేరుకోగలమా అన్న సందేహం ఎవరికైనా కలిగిందంటే అలాంటివారిని నిరాశావాదులుగా కొట్టిపారేయనవసరంలేదు. మన ప్రభుత్వాల పనితీరు ఆ భరోసాను కలిగించడంలేదు. ఎందుకంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ముందుకెళ్లి తల్లీపిల్లల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటుంటే మరికొన్ని మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని పరిస్థితులు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి.

 గ ర్భిణిగా ఉన్నపుడు మహిళకు అందించే కొద్దిపాటి ఆసరా ఆమె ప్రాణాలను నిలబెడుతుంది. రక్తహీనతను, ఇన్ఫెక్షన్లనూ సకాలంలో గుర్తించి అవసరమైన వైద్య సాయం అందిస్తే వేలాదిమంది తల్లులు మృత్యుఒడినుంచి బయటకు రాగలుగుతారు. కానీ, ఆ చిన్న సాయమందించే బాధ్యతను కూడా ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నాయి. సకాలంలో లోటుపాట్లను గుర్తించి సరిచేయలేకపోతున్నాయి. గ్రామసీమల్లో గర్భిణులను గుర్తించి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే విస్తృతమైన నెట్‌వర్క్ మనకుంది. కానీ, ఆ నెట్‌వర్క్‌లో పనిచేసే వాలంటీర్లకు ఇస్తున్న అరకొర వేతనాలు ఆ పని సక్రమంగా నడవడానికి అవరోధమవుతున్నాయి. ఏదో మొక్కుబడి సందర్శన తప్ప గర్భిణిగా ఉన్నామె పరిస్థితి ఎలా ఉన్నదో, ఏం అవసరమో గ్రహించి...అవసరమైన సందర్భంలో వైద్యుల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించేవారు కొరవడుతున్నారు. ఈ నెట్‌వర్క్‌కు తోడు గ్రామాల్లో అంగన్‌వాడీలు కూడా ఉంటున్నాయి. ఈ రెండు వ్యవస్థల నిర్వహణా సక్రమంగా లేదని తాజా నివేదికను చూస్తే అర్ధమవుతుంది.

  గ్రామసీమల్లో ఆరోగ్య సంబంధమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా కొరవడటమే ఈ స్థితికి కారణం. బడ్జెట్లలో ప్రజారోగ్యానికి అవసరమైన ప్రాధాన్యత ఇప్పటికీ ఇవ్వడంలేదు. గ్రామసీమల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటికీ వెనకబడే ఉన్నాం. ముఖ్యంగా వైద్యుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా మహిళలు తమ తిండితిప్పలపైనా, ఆరోగ్యంపైనా శ్రద్ధపెట్టరు. వేళకు ఇంత తిన్నాం కదా చాలనుకుంటారు. గర్భస్థ శిశువుకు అవసరమైన పోషకాహారం అందజేయగలుగు తున్నామా... రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామా అని ఆలోచించరు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలకైతే అలాంటివి సాధ్యమే కాదు. ఇక సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రికి వెళ్లి పురుడుపోసుకునే పరిస్థితే ఉండదు. ఫలితంగా ప్రసూతి మరణాలు, అర్భక శిశు జననాలు ఎక్కువవుతున్నాయి. పురిట్లోనే కన్నుమూసే శిశువులకు తోడు చాలామంది శిశువులు చాలా తక్కువ బరువుతో పుడుతున్నారు.

  రిజిస్ట్రార్ జనరల్ నివేదికతోపాటే ప్రసూతి మరణాల రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసింది. 2017 నాటికల్లా ఇవి వందకు మించకుండా చూడాలని కోరింది. కానీ, ఇలా లేఖలు రాసి సరిపెట్టుకుంటే పనికాదని రిజిస్ట్రార్ గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సగటున ప్రసూతి మరణాల సంఖ్య 105 ఉంటే... బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అది 257గా నమోదైంది. అయితే, 2007-09 మధ్య ఇది 308గా ఉన్నది కనుక మందకొడిగా అయినా ఈ రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగవుతున్నదని భావించాలి. దక్షిణాది రాష్ట్రాలమధ్య పోల్చిచూసినా ఈ తారతమ్యాలు ఎక్కువగానే ఉన్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో ప్రసూతి మరణాలను 87కి తీసుకురాగలిగితే తమిళనాడు 90తో తర్వాతి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య 110. కర్ణాటకలో ఇది 144గా ఉంది. ప్రపంచదేశాల్లో సింగపూర్ (3), స్వీడన్ (4), నార్వే (7), అమెరికా (21) వంటి దేశాలను చూస్తే మనం ఆ స్థాయికి చేరడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఊహకే అందదు. మన పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్ కూడా మనతో పోలిస్తే గర్భిణులు, బాలింతల విషయంలో అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నాయి. వాటిని చూసైనా మనం మరింత శ్రద్ధ కనబరచాలి. ముఖ్యంగా పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలను పెంచి, పేదరిక నిర్మూలనకు అవసరమైన పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తాజా గణాంకాల నేపథ్యంలోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సవరించుకోవాల్సి ఉంది. అప్పుడే మాతాశిశు సంరక్షణ పూర్తిస్థాయిలో సాధ్యమవుతుంది.
 

మరిన్ని వార్తలు