ఈ విష సంస్కృతికి విరుగుడేది?

12 Aug, 2015 00:13 IST|Sakshi
ఈ విష సంస్కృతికి విరుగుడేది?

విద్య, వివేక, వినయ సంపదకూ, వ్యక్తిత్వవికాసా నికీ నిలయాలుగా ఉండవలసిన విద్యాలయాలను ర్యాగింగ్ భూతాలు రాజ్యమేలుతున్నాయి. బయ టకు చెప్పుకోలేక మానసిక క్షోభననుభవిస్తున్న రిషి తేశ్వరిలు ఎందరో! విద్యాలయాల్లో శ్రుతిమించిన ర్యాగింగ్‌తో, ఆత్మన్యూనత, అభద్రతాభావాలతో రోజు గడుస్తుంటే విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై మనసు లగ్నమవుతుందా?

ఉన్నత  చదువుల కోసం కొండంత ఆశలతో విశ్వవిద్యాలయాల్లో తమ పిల్ల లను తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకోర్చి, స్తోమతకు మించిన ఫీజులు చెల్లించి చేర్పిస్తారు. కాని తమ బిడ్డ లు ఆత్మహత్యలు చేసుకోవడమో, ప్రేమ ముసుగు లో మోసపోవడమో జరిగితే వారి క్షోభ చెప్పనలవి కాదు. ముఖ్యంగా ఆడపిల్లల మరణాలకు దారితీసే విషవాతావరణం విద్యాలయాల్లో పెరిగిపోతున్నం దుకు నేటి సమాజం ఎంతో కలవరపడుతున్నది.

ఎక్కడుంది లోపం? ఎందుకు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి వాతావరణం నెలకొం టున్నది? నిజానికి ప్రతి విద్యార్థిలో అనంతమైన మానవతా గుణాలు, నీతి, నిజాయితీ, స్నేహం, సాయపడేతత్వం అంతర్లీనంగా ఉంటాయి. కానీ సరైన మార్గదర్శి, వ్యక్తిత్వాలను వికసింపచేసే ఆదర్శ ప్రాయులు లేక యువతలో నివురుగప్పిన అజ్ఞానం, అసూయాద్వేషాలు వారిని అమానవీయ ప్రవర్తన వైపు నడిపిస్త్తున్నాయి.

ఆ  ప్రవృత్తులను తుడిచి వారి లో సహజంగా ఉన్న మంచి గుణాలను, ఉన్నత విలువలను పైకి తీయడం, వారిని తీర్చిదిద్దడం బాధ్యత నెరిగిన ప్రతి ఉపాధ్యాయుడు నిర్వర్తించవ లసిన కర్తవ్యం. ప్రతి విద్యాలయ ప్రథమ లక్ష్యం కూడా అదే. విద్యాలయాలు కేవలం వ్యాపార దృష్టి తో, ఉద్యోగాల కోసం డిగ్రీలనందించే  కార్ఖానాలు గా మారిపోతుంటే మంచి నైతిక విలువలతో కూడిన మానవ వనరులను ఎలా తయారు చేయగలుగు తాయి? భారత జనాభాలో 25 శాతం యువతరం ఉంది. వీరిని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నత విద్యాల యాలుంటే దేశమెలా బాగుపడుతుంది?

కళాశాలల్లోగాని, విశ్వవిద్యాలయాల్లోగాని ప్రి న్సిపాల్ లేదా ఉపకులపతుల బాధ్యత గురుతరమై నది. అతడు, ఆమె; కుల, మత, ప్రాంతీయ తత్వా లకు, రాజకీయాలకతీతంగా కళాశాలను, విశ్వవిద్యా లయాన్ని వారు నడిపించాలి. ఉపకులపతులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను, వారు ఎంచు కున్న విద్య, శిక్షణలలో అగ్రగాములుగా నిలిపే దిశ గా ప్రయాణించేటట్టు చేయడమేకాదు, వారంతా ఉన్నత పౌరులుగా, జీవించడమనే కళ తెలిసిన వారి గా రూపొందే వాతావరణాన్ని కూడా నిర్మించాలి. ఈ కృషిలో అధ్యాపకులు, పరిపాలనా విభాగం, సీని యర్  విద్యార్థుల సహకారాలను తీసుకోవాలి.

ఇప్పుడు ఒక భూతంలా వేధిస్తున్న ర్యాగింగ్ అసలు లక్ష్యం-కొత్తగా చేరిన విద్యార్థుల్లో భయాన్ని  పోగొట్టి, ఆత్మ స్థయిర్యాన్ని నింపడం. ఇది శ్రుతిమిం చడమే ఇప్పటి సమస్యకు మూలం. కాబట్టి ప్రతిభకు మెరుగుపెట్టే పెద్ద విద్యాలయంలో సంకోచాలు లేకుండా, విశాల దృక్పథంతో వ్యవహరిస్తే, విశ్వవి ద్యాలయం ఇచ్చే అవకాశాలను వినియోగించుకుం టే విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయిని అందుకొనే  అవకాశాలు ఉన్నాయో ప్రతి ఉపాధ్యాయుడు చెప్పి, సీనియర్  విద్యార్థుల చేత చెప్పించడం అవసరం.

అలాగే  శ్రుతిమించిన ర్యాగింగ్‌తో కలిగే అనర్థాల గురించి విస్తృత అవగాహన కల్పించాలి. కమిటీలు ప్రతిపాదించిన శిక్షలను అమలు జరపాలి. రాజకీ యాల పేరుతో ప్రవేశించే కాలుష్యాన్ని నివారించి, దానికి అతీతంగా యువతకు దిశా నిర్దేశం చేయాలి. ప్రధానోపాధ్యాయుడు, ఉప కులపతుల నియామ కాల్లో విలువలను పాటించాలి. సమర్థ నాయకత్వ లక్షణాలు కలిగి, విశ్వవిద్యాలయాలలో మంచి విద్యా వాతావరణాన్ని నెలకొల్పగలిగే సచ్ఛీలురను, మేధావులను ఆ పదవులకు ఎంపిక చేయడం కూడా ప్రభుత్వం నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో ప్రధాన మైనది. విద్యను కాపాడుకుందాం. విద్యాలయా లను పవిత్రంగా చూసుకుందాం.


- డా॥పి. విజయలక్ష్మి పండిట్,  హైదరాబాద్
 (విశ్రాంత ఆచార్యులు, బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం)

మరిన్ని వార్తలు