‘క్లినికల్’ హత్యలు ఆగేనా?!

31 Jul, 2013 00:35 IST|Sakshi
ఏటా వందల మంది నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్లినికల్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఎంత అదిలించినా కేంద్ర ప్రభుత్వం మందగమనం విడనాడలేదని మరోసారి రుజువైంది. స్వాస్థ్య అధికార్ మంచ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ క్లినికల్ పరీక్షలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసి ఏడాదిన్నర దాటింది. ఆ పిటిషన్ విచారణకొచ్చిన ప్రతిసారీ కేంద్రం నీళ్లు నములుతూనే ఉంది. రాష్ట్రాలతో మాట్లాడుతున్నామని, సమగ్ర చట్టం తేవడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతూనే ఉంది. ఇప్పటికైతే తాత్కాలికంగా కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెట్టామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చట్టానికి సవరణలు తెస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేశంలో అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతున్న అనధికార, అధికార ఔషధ ప్రయోగాల పర్యవసానంగా వందల మంది మృత్యువాత పడటమో, తీవ్ర అస్వస్థతకు గురికావడమో సంభవిస్తున్నది.
 
దేశంలోని అత్యున్నత శ్రేణి ఆసుపత్రి అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో రెండున్నరేళ్ల వ్యవధిలో 49 మంది పిల్లలు మరణించారు. ఇది 2006 నాటి మాట. 2005-12 మధ్య జరిగిన 475 ఔషధ పరీక్షల్లో 2,644 మంది మరణించారని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది. అలాగే, ఇదే కాలంలో మరో 11,972 మందిలో దుష్ఫలితాలు కనబడ్డాయని తెలిపింది. గుంటూరు జిల్లాలో రెండేళ్లక్రితం 30 మంది మహిళలపై బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధాన్ని ప్రయోగించి చూసినప్పుడు 8మందికి కంటిచూపు దెబ్బతినగా, ఇద్దరికి మధుమేహం సోకింది. 
 
అసలు ఔషధ ప్రయోగాలపై మన దేశంలో నిర్దిష్టమైన చట్టమేదీ లేదు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో వచ్చిన డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంకిందనే ఇలాంటి ప్రయోగాలకు అనుమతిస్తున్నారు. అయితే , అందులోని నిబంధనలు ఈ ప్రయోగాలను క్రమబద్ధీకరించడంలోగానీ, బాధితులకు న్యాయం చేకూర్చడంలో గానీ విఫలమవుతున్నాయి. అనేక బహుళజాతి సంస్థలు ఇక్కడి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రయోగాలు చేస్తున్నాయి. నిరుపేదలు, నిరక్షరాస్యులు ఇలాంటి సంస్థల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. తమ ఆర్ధిక సమస్య కొంతైనా తీరుతుందని వీరందరూ ఈ ప్రయోగాలకు సిద్ధపడుతూ, ఆ తర్వాత వచ్చే దుష్పరిణామాలతో నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులకు ప్రధాన బాధ్యత యూపీఏ ప్రభుత్వానిదే. వేరే దేశంలో ఒక ఔషధంపై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నప్పుడు మాత్రమే ఇక్కడ రెండో దశ ప్రయోగాలకు అనుమతించాలన్న నిబంధనను యూపీఏ ప్రభుత్వం సవరించింది. అక్కడ ఏ దశలో ప్రయోగాలు జరుగుతున్నాయో ఇక్కడా అవే జరపవచ్చునని మార్చింది. అటు తర్వాతే దేశంలో ఔషధ ప్రయోగాలు పెరిగిపోయాయి.
 
పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ప్రయోగాలపై సవాలక్ష నిబంధనలున్నాయి. ముఖ్యంగా అలాంటి ప్రయోగాలకు సిద్ధపడే రోగులకు వాటి దుష్ఫలితాలను కూడా విశదీకరించాలన్న నిబంధన ఉంది. కానీ, మన దేశంలో చట్ట సవరణకు ఉత్సాహం చూపిన పాలకులు ఇలాంటి నిబంధనలను పెట్టడం మాత్రం మరిచారు. అంతేకాదు...మన దేశంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తగిన సంఖ్యలో లేరు. అక్కడున్న నిబంధనలను తట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉండే బహుళజాతి సంస్థలకు ఇదంతా వరంగా మారింది. ప్రపంచంలో జరిగే ఔషధ ప్రయోగాల్లో మన శాతం 1.5 మాత్రమే అయినా మరణాల రేటు అత్యధికంగా ఉంది. ప్రయోగాలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలుగానీ, అధికారుల పర్యవేక్షణగానీ మృగ్యంకావడంవల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.
 
నిరక్షరాస్యులనూ, నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకుని ఈ ప్రయోగాలు ప్రధానంగా సాగుతున్నాయి. వీరిలో అత్యధికులు ఆదివాసులు, దళితులు, ఇతర అట్టడుగు కులాలవారే కావడం యాదృచ్ఛికంకాదు. ఔషధ ప్రయోగాలు ప్రారంభించినప్పుడు అరచేతిలో స్వర్గం చూపే సంస్థలు తీరా ఆరోగ్యం విషమించే సరికి పత్తాలేకుండా పోతున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ కేసే ఇందుకు ఉదాహరణ. హృద్రోగంతో బాధపడుతున్న ఆ మహిళకు చికిత్స చేస్తామని చెప్పి ఒక  సంస్థ ఔషధ ప్రయోగం చేసింది. లక్షా 25వేల రూపాయల ఖరీదుచేసే ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నామని నమ్మబలికారు. దాన్ని వాడిన తర్వాత ఆమె మరణించింది. ఔషధ నిపుణులు, ఔషధ సంస్థలు కుమ్మక్కయి చెలరేగిపోతుంటే ప్రభుత్వం వైపుగా పర్యవేక్షణ కరువవుతున్నది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇలాంటి ప్రయోగాలపై నియంత్రణకు సంబంధించి కఠినమైన నిబంధనలు పెట్టారు. అన్ని రకాల ఔషధ ప్రయోగాలనూ క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీలో నమోదుచేయడం తప్పనిసరి చేశారు.
 
ప్రయోగాల సందర్భంగా మరణించినా, ఇతరత్రా దుష్ఫలితాలు ఏర్పడినా ఇవ్వాల్సిన నష్టపరిహారంపై ఇన్నాళ్లూ ఎలాంటి నిబంధనలూ లేవు. మరణం సంభవించిన సందర్భంలో బాధిత కుటుంబానికి రూ.2,20,000 ఇవ్వాలని నిబంధన విధించారు. మంచిదే. అయితే, ప్రభుత్వం ఈ స్థాయిలోనైనా స్పందించడానికి ఏడాదిన్నర కాలం పట్టింది. ప్రతిసారీ రాష్ట్రాలతో చర్చిస్తున్నామని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు. కనీసం ఇన్నాళ్లకైనా కొన్ని నిబంధనలనైనా అమల్లో పెట్టడం హర్షించదగిందే. ఔషధ ప్రయోగాలపై చట్ట సవరణ చేసే సందర్భంలోనే చిత్తమొచ్చినట్టుగా దేశంలోకి ఔషధాలను అనుమతించే విధానాన్ని కూడా మార్చాలి. ఇక్కడి రోగులకు అసలే పనికిరాని ఔషధాలకు, విదేశాల్లో అనుమతి లభించని ఔషధాలకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఇలాంటి ఔషధాలు ప్రాణాంతకమవుతున్నాయి. అందువల్ల ఔషధాలను అనుమతించే నిబంధనలనూ కఠినం చేయాల్సి ఉంది. అయితే, సుప్రీంకోర్టు గట్టిగా ఒత్తిడి తె చ్చినా ఔషధ ప్రయోగాలపై ఇంత ఆలస్యంగా కదిలిన కేంద్రం దీనిపై దృష్టి సారించడానికి ఎన్నాళ్లు పడుతుందో?!
>
మరిన్ని వార్తలు