ఉత్పాతాల కాలం!

30 Mar, 2019 00:29 IST|Sakshi

మొన్నటి శీతాకాలంలో, అంతక్రితం వర్షాకాలంలో వాతావరణ పరిస్థితుల్ని చూసి బెంబేలెత్తిన మనల్ని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా నివేదిక మరింత హడలెత్తిస్తోంది. ఈ నివేదిక గత ఏడాది ఎలాంటి ఉత్పాతాలు సంభవించాయో క్రోడీకరించి చెప్పింది. వాటి ఆధారంగా మున్ముందు వాతావరణం ఎలా ఉండబోతున్నదో వివరించింది. వాతావరణంలో నానాటికీ పెరిగి పోతున్న కర్బన ఉద్గారాలు భూతాపానికి దారితీసి సముద్ర జలాలు వేడెక్కడంతో అందులోని జీవుల ఉనికికే ముప్పు ఏర్పడుతున్నదని ఆ నివేదిక తెలిపింది. అలాగే ఆర్కిటిక్‌ సముద్రంలో మంచు పలకలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని వివరించింది. ప్రపంచ శీతోష్ణస్థితి గతులపై న్యూయార్క్‌లో జరిగే సదస్సు సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్‌ విడుదల చేసిన ఈ తాజా నివేదిక నాలుగేళ్లనుంచి వరసగా ఉష్ణోగ్రతలు పెరుగు తున్న వైనాన్ని కూడా కళ్లకు కట్టింది.

ఒకటిన్నర దశాబ్దాలనాడు మొదలైన పారిశ్రామికీకరణ బొగ్గు నిల్వలను, ఇతర శిలాజ ఇంధనాలను ఎడాపెడా వినియోగిస్తున్న పర్యవసానంగానే ఈ స్థితి ఏర్పడింది. ఇది మానవాళిపై మాత్రమే కాదు... భూమ్మీద నివసించే సకల జీవరాశులన్నిటిపైనా పెను ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం అన్నిటికన్నా ముందు తాబేళ్లలో కన బడుతుంది. ఇసుక తిన్నెల్లోని గూళ్లలో అవి పెట్టే గుడ్లు ఉష్ణోగ్రతనుబట్టి ఆడ లేదా మగ తాబేళ్లుగా మారతాయి. ఆస్ట్రేలియాలోని పగడాల దిబ్బ వద్ద ఈసారి భారీ సంఖ్యలో ఆడ తాబేళ్లు బయటికి రావడం ఆందోళనకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు బాగా పెరగడం వల్లే ఈ స్థితి ఏర్పడిందంటున్నారు. డబ్ల్యూఎంఓ గత 25 ఏళ్లుగా ఏటా వార్షిక నివేదికలు విడుదల చేస్తోంది. విషాదమేమంటే అది తొలి నివేదిక విడుదల చేసిన 1994లో వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్‌ పర మాణువుల స్థాయి 357 పీపీఎంగా ఉండేది. 2017నాటికి అది 405.5 పీపీఎంకు చేరుకుంది.  

శాస్త్రవేత్తలు ప్రజానీకాన్ని బెదరగొడుతున్నారు తప్ప పరిస్థితి ఏమంత ప్రమాదకరంగా లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తరచు వాదిస్తున్నారు. కానీ గడ్డు వాతావరణాన్ని ఎదుర్కోని ప్రాంతం భూ మండలం మొత్తం మీద ఎక్కడా లేదు. నిరుడు ఆగస్టులో కేరళను ముంచెత్తిన వరద లైనా, మొన్నటి చలికాలంలో కోత పెట్టిన శీతగాలులైనా ఇందుకు ఉదాహరణ. ఆఫ్రికా, ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా ప్రాంతాలు, ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధ గోళం వరకూ వ్యాపించి ఉన్న మహాసముద్ర ప్రాంత దేశాలు గత పదేళ్లలో కనీవినీ ఎరుగని భారీ ఉష్ణోగ్రతలను చవిచూశా యని నివేదిక వివరిస్తోంది. అంతేకాదు... సముద్ర జలాల ఆమ్లీకరణ వల్ల గత శతాబ్ది మధ్య నుంచి ఆ జలాల్లో ఆక్సిజన్‌ నిల్వలు 1 నుంచి 2 శాతం తగ్గాయని తెలిపింది. ఇదంతా అక్కడి జీవసంబంధ కార్యకలాపాలపై పెను ప్రభావం చూపుతోంది. భీకర వాతావరణ పరిస్థితులు నిరుడు ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్లకుపైగా ప్రజానీకాన్ని ఇబ్బందుల్లో పడేశాయి. గత సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీ త్యాల వల్ల 20 లక్షలకుపైగా మంది నిరాశ్రయులయ్యారు. ఆఖరికి ట్రంప్‌ రాజ్యమేలుతున్న అమె రికాలో నిరుడు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు వందమందిని బలి తీసుకోవడమే కాక, 4,900 కోట్ల డాలర్ల మేర నష్టం కలిగించాయి.

యురప్, జపాన్, అమెరికాల్లో వడగాల్పుల కారణంగా నిరుడు 1,600మంది చనిపోయారు. వాతావరణ మార్పుల దుష్ప్రభావం బహుముఖాలుగా ఉంటుంది. పెరిగే ఉష్ణోగ్రతలు జల, వాయు కాలుష్యాలను పెంచడంతోపాటు... సాంక్రమిక వ్యాధు లకు దారితీస్తాయి. అపార జననష్టాన్ని కలిగిస్తాయి. ఆహార కొరత ఏర్పడుతుంది. ఇవన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీస్తాయి. ఉపాధి అవకాశాలు కుంచించుకుపోతాయి. పర్యవసానంగా సమాజాల్లో హింస, దౌర్జన్యం పెచ్చరిల్లి సామాజిక సంక్షోభాలకు దారితీస్తాయి. దీన్ని గురించి గత మూడు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఖాతరు చేసే దెవరు? థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, బొగ్గు ఆధారిత పరిశ్రమలు పెంచుతున్న కాలుష్యం భూతా పానికి కారణమై ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, పేద దేశాల్లో ఏటా లక్షన్నరమంది అకాలమరణం చెందుతున్నారని శాస్త్రవేత్తలు గణాంకసహితంగా చెబుతున్నారు. ఇదంతా ఉన్నకొద్దీ మరింత ఉగ్రరూపం దాలుస్తున్నదని తాజా నివేదిక హెచ్చరిస్తోంది.

నిరుడు అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం(ఐపీసీసీ) ప్రపంచ దేశాలన్నిటినీ హెచ్చరించింది. రానున్న రోజుల్లో భూతాపం వల్ల కోట్లాదిమంది పౌరుల జీవితాలు అస్తవ్యస్థమవుతాయని తెలిపింది. ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కదిలి పర్యావరణ హితమైన చర్యలకు నడుం బిగించాలని సూచించింది. అది జరిగినప్పుడే 2030నాటికి ఆరున్నర కోట్ల ఉద్యో గాలను సృష్టించడానికి, దాదాపు 3 లక్షల కోట్ల కోట్ల డాలర్ల మేర ఆర్థిక ప్రయోజనం సాధించడానికి ఆస్కారం కలుగుతుందని చెప్పింది. అయితే పర్యావరణానికి ముంచుకొస్తున్న ముప్పును నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ దేశాల్లో తగినంత చిత్తశుద్ధి కనబడటం లేదు. వచ్చే ఏడాది నుంచి అమలు కావాల్సిన పారిస్‌ ఒడంబడిక విషయంలో తగినంత ప్రగతి లేదు. దాన్నుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించిన ట్రంప్‌ను దారికి తెచ్చేందుకు అమెరికాలో డెమొక్రాట్లు ప్రయత్నాలు ప్రారంభించారు. పారిస్‌ ఒడంబడిక నుంచి వైదొలగడాన్ని నిరోధించే బిల్లును బుధవారం ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ప్రవేశపెట్టారు. ఆ ఒడంబడిక నుంచి బయటికొచ్చే పక్షంలో ప్రత్యామ్నాయం ఏమిటో ట్రంప్‌ చెప్పాలన్నది బిల్లు సారాంశం. వాతావరణ మార్పుల కారణంగా మన సమీప భవిష్యత్తు దుర్భరం కాబోతున్నదని... కరువుకాటకాలు, రాజ కీయ సంక్షోభాలు, బీటలువారే ఆర్థిక వ్యవస్థలే మున్ముందు చూడబోతామని శాస్త్రవేత్తలు హెచ్చ రిస్తున్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు జడత్వం వదిలించుకుని సమష్టిగా కదలాలి. భూగోళాన్ని రక్షించుకోవాలి.

మరిన్ని వార్తలు