మైనారిటీ తీరని మాతృత్వం!

11 Jul, 2013 02:15 IST|Sakshi
మైనారిటీ తీరని మాతృత్వం!

 నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
 జనాభా పెరుగుదలను అరికట్టడంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని ఎత్తిచూపడానికి ఐక్యరాజ్య సమితి 1989 నుంచి జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది  ‘కౌమార గర్భవతుల’ (ఎడోలసెంట్ ప్రెగ్నెన్సీ) దుస్థితిపై దృష్టి పెట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.
 
 అంతకంతకూ పెరుగుతున్న జనాభా ప్రపంచానికి పెనుభారంగా మారింది. జనా భా పెరుగుదల వల్ల ముసురుకుంటున్న సమస్యలెన్నో! కౌమార బాలలు సాధికారతతో, సంపూర్ణ వ్యక్తులుగా వికాసం పొందిననాడే మానవాళి మనుగడ సజావుగా సాగుతుంది. కానీ, పేదరికం, లింగవివక్ష, లైంగికహింస, బలవంతపు బాల్యవివాహాలు కౌమార బాలి కలకు శాపంగా పరిణమిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్చుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకొని సంపూర్ణ వ్యక్తులుగా వికసిం చాల్సిన వారి బతుకులు ఎదిగీఎదగని దశలోనే బండబారిపోతున్నాయి. తండ్రులకు ఎదురు చెప్పలేని స్థితిలో  బాలికలు బలవంతపు పెళ్లిళ్లకు తలొగ్గాల్సివస్తోంది. వీరి హక్కులను పరిరక్షించాల్సిన సామాజిక వ్యవస్థలు, సంస్థలు విఫలం కావడం కౌమార బాలికల పాలిటశాపంగా పరిణమిస్తోంది.
 
 అధిక జనాభావల్ల తలెత్తుతున్న సమస్యలపై ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1987, జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనా భా పెరుగుదలను అరికట్టడంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని ఎత్తిచూపడానికి ఐక్యరాజ్య సమితి 1989 నుంచి జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘కౌమార గర్భవతుల’ (ఎడోలసెంట్ ప్రెగ్నెన్సీ) దుస్థితిపై దృష్టి పెట్టాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.
 
 ప్రస్తుతం ప్రపంచ జనాభా సంఖ్య 713 కోట్లు దాటింది. వీరిలో మొత్తం 60 కోట్ల మంది కౌమార బాలికలు ఉండగా, అందులో 50 కోట్ల మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని అంచనా. చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు, కట్టుబాట్లు తదితర కారణాలవల్ల కౌమార బాలికలు బలవంతంగా తాళి కట్టించుకోవా ల్సివస్తోంది. ఏటా కోటి 60 లక్షల మంది వివాహిత కౌమార బాలికలు తల్లులవుతున్నారు. చిన్న వయస్సులోనే గర్భవతులవుతున్నందువల్ల ఆరోగ్య సమస్యలతో ప్రసవించే సమయంలో మరణిస్తున్న వారిసంఖ్య కూడా పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశా ల్లో ఇటువంటి అభాగ్య తల్లుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. అంతేకాదు, 32 లక్షల మం ది బాలికలు ప్రమాదకరమైన స్థితిలో గర్భస్రావాలు చేయించుకోవాల్సి వస్తోంది.   
 
 ప్రపంచవ్యాప్తంగా 1985-1990 మధ్యకాలంలో ప్రసవించిన కౌమార బాలికల సం ఖ్య 8 కోట్ల 49 లక్షలకు చేరింది. దీంతో ప్రపంచ దేశాలు ఈ అంశంపై దృష్టి సారించడంతో తగ్గుముఖం పట్టింది. 2005-2010 మధ్య కాలం నాటికి కౌమార తల్లుల సంఖ్య 7 కోట్ల 31 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రతి వందమంది బాలికల్లో 19 మంది పద్దెనిమిదేళ్ల వయసు నిండక ముందే బిడ్డకు జన్మనిస్తున్నారు. వీరి లో ముగ్గురు 15 ఏళ్లు నిండక ముందే తల్లులు అవుతున్నారని ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాలు చెబుతున్నాయి.
 
 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3 ప్రకారం... మన దేశంలో 47 శాతం మంది బాలికలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు అవుతున్నాయి. మైనారిటీ తీరకముందే వీరం తా తల్లులవుతున్నారు. వీరికి జన్మించిన శిశువులు తక్కువ బరువుతో పుట్టడంవల్ల శిశు మరణాలు కూడా అధికంగా ఉంటున్నాయి.
 
 మన దేశంలో కౌమార తల్లుల సంఖ్య 1990-1995 మధ్యకాలంలో 2 కోట్ల 31 లక్షలకు పెరిగి, 2005-2010 నాటికి కోటి 39 లక్షలకు తగ్గింద ని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఏటా 2 కోట్ల 60 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, ఇందులో కోటి 25 లక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లోనే చోటుచేసుకుంటున్నాయని సర్కారు గణాంకాలు తెలి యజేస్తున్నాయి.
 
 15-19 ఏళ్ల మధ్య పెళ్లయిన అమ్మాయిల్లో 7 శాతం మంది మాత్రమే కుటుంబ నియంత్రణ సాధానాలు వినియోగించగలుగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3 తేల్చింది. మన దేశంలో గర్భవతులవుతున్న వారిలో 16 శాతం వరకూ కౌమార బాలికలే కావడం ఆందోళనకరమైన విష యం. ప్రసవ సమయాల్లో మృత్యువాత పడుతున్న వారిలో 9 శాతం కౌమార బాలికలే కావడం మరింతగా కలవరపరుస్తోంది.  
 కౌమార బాలలకు లైంగిక  విద్యను అందించడంతోపాటు పోషకాహారంపై చైతన్యం కలి గించేందుకు పాలకులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం అవసరం.
 పంతంగి రాంబాబు
 ‘సాక్షి’ స్పెషల్ డెస్క్
 

>
మరిన్ని వార్తలు