మావో సరసన జిన్‌పింగ్‌!

18 Oct, 2017 00:47 IST|Sakshi

అయిదేళ్లకోసారి జరిగే అత్యంత కీలకమైన చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ జాతీయ మహాసభలు బీజింగ్‌లో బుధవారం ప్రారంభం కాబోతున్నాయి. వారం రోజులపాటు కొనసాగే ఈ సమావేశాలు వచ్చే అయిదేళ్లలో పార్టీ చేపట్టవలసిన కార్య క్రమాలతోపాటు, భిన్న రంగాల్లో దేశం అనుసరించాల్సిన మౌలిక విధానాలను కూడా నిర్ణయిస్తాయి. లక్ష్య నిర్దేశం చేస్తాయి. వీటికి సారథ్యం వహించగల ఉన్నత స్థాయి నాయకత్వాన్ని ఎన్నుకుంటాయి. ఈ సమావేశాల్లో దేశాధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ను వరసగా రెండోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతోపాటు దేశ చరిత్రలో ఇంతవరకూ మావో, డెంగ్‌ జియావోపింగ్‌లకు మాత్రమే లభించిన అరుదైన గౌరవాన్ని కూడా అందుకోబోతున్నారు. ‘మావో ఆలోచనా విధానం’, ‘డెంగ్‌ జియావోపింగ్‌ సిద్ధాంతం’ వరసలో జీ జిన్‌పింగ్‌ రాజకీయ తాత్వికతకు కూడా పార్టీ నియమ నిబంధనావళిలో చోటు లభిం చబోతోంది. ఇందుకోసం దాన్ని సవరించాలని నిర్ణయించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ తాత్వికతను ఏ పేరుతో వ్యవహరించదల్చుకున్నదో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఆ తాత్వికతను ‘నాలుగంచెల సమగ్ర వ్యూహమ’ని అంటున్నారు. తగు విధమైన సంపద్వంత సమాజ నిర్మాణం, చట్టబద్ధ పాలన స్థిరపరచడం, పటిష్టమైన పార్టీ క్రమశిక్షణ, వేగవంతమైన సంస్కరణల సాధన–ఆ నాలుగంచెల సమగ్ర వ్యూహం లోని ప్రధానాంశాలు. వీటిని 2021లో జరగబోయే పార్టీ శత వసంతాల ఉత్సవాల కల్లా సాధించాలని జీ జిన్‌పింగ్‌ చెబుతున్నారు. ఆయన అనం తరం 2022లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అధిష్టించగలరని అందరూ భావించిన కీలక చోంకింగ్‌ మున్సిపల్‌ కమిటీ మాజీ కార్యదర్శి సన్‌ ఝెంకాయ్‌ తోపాటు 12మంది సీనియర్‌ నాయకులను ‘అవినీతి ఆరోపణల’ కారణంగా బహిష్కరించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది గనుక జీ జిన్‌ పింగ్‌కు పార్టీలో ఎదురుండదు. ఆయన 2022 తర్వాత కూడా మరో అయిదేళ్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగడానికి అవరోధాలుండవు. సంప్రదాయం ప్రకారమైతే రెండు దఫాలు మించి ఎవరూ ఆ పదవిలో కొనసాగటం లేదు. కానీ అది నియమావళిలో లేదని ఒక నాయకుడు చెబుతున్న మాటల్నిబట్టి జీ జిన్‌పింగ్‌ ఆ సంప్రదాయాన్ని పాటించక పోవచ్చునన్న ఊహా గానాలొస్తున్నాయి.

  జీ జిన్‌పింగ్‌ 2012లో జరిగిన పార్టీ జాతీయ మహాసభలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాక అప్పటికే పటిష్టంగా ఉన్న చైనా ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, మూడీస్‌ వంటి సంస్థల∙నివేదికలు ఈ సంగతి చెబుతున్నాయి. గత అయిదేళ్లలో వృద్ధి రేటు సగటు 7.2 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 6.9 శాతానికి చేరుకుంది. ఆర్ధిక వృద్ధికి ప్రధానంగా దోహదపడే గృహ నిర్మాణ రంగం ఎగుడు దిగుళ్లను దాటుకుని గత మూడేళ్లలో సుస్థిరతను సంతరించుకుంది. నిరుటితో పోలిస్తే చైనా ఎగుమతులు 8.1 శాతం పెరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులు కూడా చైనా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. 2016లో నిరాశాజనకంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3.6 శాతం మేర వృద్ధి సాధించవచ్చునన్న అంచనాలున్నాయి.

బ్యాంకింగ్, పరిశ్రమలు, మదుపు, రియల్‌ఎస్టేట్‌ రంగాల పని తీరు బాగుందని గణాంకాలు చెబుతున్నాయి. వీటికితోడు జీ జిన్‌పింగ్‌ మానస పుత్రిక అయిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టు రాగల కాలంలో చైనా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇక చైనా ప్రజల జీవన ప్రమాణం చెప్పుకోదగ్గ రీతిలో మెరుగైంది. సగటు ఆయుర్దాయం 76.34 ఏళ్లుగా ఉంది. ఆసియా ఖండ దేశాల మౌలిక వసతులు మెరుగుపర్చడానికి అవసరమైన పెట్టుబడులు అందించేందుకు ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు (ఏఐడీబీ) నెలకొల్పడంలో చైనాదే కీలకపాత్ర.

ఇలా భిన్న రంగాల్లో మెరుగ్గా ఉన్న చైనాకు అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ అధిరోహించడం కలిసొచ్చింది. స్థిరచిత్తం కొరవడిన ట్రంప్‌ మాటెలా ఉన్నా తాను ప్రపంచీకరణకు, స్వేచ్ఛా వాణిజ్యానికి వెన్నుదన్నుగా ఉంటానని, కర్బన ఉద్గారాల తగ్గింపుపై కుదిరిన పారిస్‌ ఒడంబడికను ముందుకు తీసుకుపోయేం దుకు కృషి చేస్తానని మొన్న జనవరిలో దావోస్‌లో జీ జిన్‌పింగ్‌ ఇచ్చిన హామీ ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. చైనాపై కుదిరిన ఈ విశ్వాసానికి మూలం–దాని దగ్గరున్న వేలాదికోట్ల డాలర్ల నిధులు, ప్రపంచంలో ఏమూలనైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురికే తత్వం వగైరాలే. అమెరికాయే ఇప్పటికీ ప్రపంచంలో నంబర్‌ వన్‌ ఆర్ధిక వ్యవస్థ కావొచ్చుగానీ... గత దేశాధ్యక్షుల మాదిరి అంతర్జాతీయంగా ప్రభావవంతమైన ముద్రేయాలన్న ఆసక్తిగానీ, అందుకు కావల సిన శక్తిసామర్థ్యాలుగానీ ట్రంప్‌కు లేవు. అందుకే చైనాలో మాత్రమే కాదు.... ప్రపంచంలోనే జీ జిన్‌పింగ్‌ శక్తిమంతుడైన నాయకుడిగా ఎదగొచ్చునన్న అంచనా లున్నాయి.

పాశ్చాత్య దేశాల ప్రమాణాలతో పోలిస్తే చైనా ఏక పార్టీ వ్యవస్థ అసలు ప్రజాస్వామికమైనదే కాదు. కానీ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం 8 కోట్ల 90 లక్షలు. జర్మనీ జనాభా కంటే ఇది అధికం. ఏడాదికోసారి సమావేశమయ్యే 205 మంది సభ్యులుండే కేంద్ర కమిటీ పార్టీ కాంగ్రెస్‌ నిర్ణయాల అమలు తీరును సమీక్షిస్తుంటుంది. దాని ఛత్రఛాయలో పనిచేసే 25మంది సభ్యుల పొలిట్‌బ్యూరో ప్రతి నెలా... ఏడుగురు సభ్యుల పొలిట్‌బ్యూరో స్థాయీ సంఘం వారానికోసారి సమావేశమై కేంద్ర కమిటీ నిర్ణయాల అమలును పర్యవేక్షిస్తాయి. విడిగా పనిచేసే కేంద్ర క్రమశిక్షణ కమిషన్‌ అవినీతిపరుల ఏరివేతలో నిమగ్నమై ఉంటుంది. కాలుష్యాన్ని తరిమి... అసమానతలను, అంతరాలనూ చక్కదిద్ది... గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంచి పట్టణాలు, నగరాలపై ఒత్తిళ్లు తగ్గించడం చైనా ముందున్న సవాళ్లు. వీటిని ఎదుర్కొనడానికి  ఈ మహాసభలు ఎలాంటి దిశా నిర్దేశం చేస్తాయో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు