చరిత్రాత్మక ఘట్టం

7 Apr, 2018 00:55 IST|Sakshi

అయిదుకోట్లమంది ఆంధ్రుల భవిష్యత్తుతో ముడిపడిన ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా సాగుతున్న పోరాటంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన అయిదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి శుక్రవారం తమ పదవులకు రాజీనామాలు సమర్పించి న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరా హార దీక్షకు ఉపక్రమించారు. ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జాతీయ పక్షాలన్నిటినీ కూడగట్టి ప్రభుత్వంపై అవి శ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తూ వస్తున్న పార్టీ ఎంపీలు ముందు ప్రకటించినట్టే పదవుల నుంచి వైదొలగారు.

ఈ బడ్జెట్‌ సమావేశాలు మొత్తం ఈసారి ప్రత్యేక హోదా అంశం చుట్టూ పరిభ్రమించాయి. ఒక్క రోజంటే ఒక్కరోజైనా ప్రభుత్వం సభను సజావుగా నడపలేకపోయింది. సభలో కావలసినంత మెజారిటీ ఉన్నా అవి శ్వాస తీర్మానం చర్చకొస్తే ఏం సంజాయిషీ ఇచ్చుకోవాల్సివస్తుందోనన్న భీతితో కాలక్షేపం చేసింది. కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు డిమాండుతో అన్నా డీఎంకే సభ్యులు వెల్‌లో సాగిస్తున్న ఆందోళనను చూపి, సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రోజూ వాయిదాలు వేస్తూ పోయారు. 

ఈ ఉద్యమం ఉధృతి ఎట్లా ఉందో, జన హృదయ స్పందనేమిటో అటు ఎన్‌డీఏ ప్రభుత్వానికీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వానికీ మొదటినుంచీ తెలుస్తూనే ఉంది. కానీ ఇద్దరూ కలిసి ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సకలవిధాలా ప్రయ త్నించారు. ‘అది ముగిసిన అధ్యాయమ’ంటూ తప్పించుకోబోయారు. కానీ ఈ నిప్పు కణికను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆరనీయలేదు. విభజన పర్యవసానంగా నిస్స హాయ స్థితికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌... కేవలం ప్రత్యేక హోదా ప్రతిపత్తి వల్లనే పరా క్రమించడం సాధ్యమవుతుందని, పరిశ్రమల ఏర్పాటు సాధ్యమై కోటిన్నరమంది యువతీయువకులకు ఉపాధి లభిస్తుందని నాలుగేళ్లనుంచి చెబుతూవచ్చింది. పార్ల మెంటు సాక్షిగా ప్రధాని హామీ ఇచ్చిన... సాక్షాత్తూ కేంద్రమంత్రివర్గమే తీర్మానిం చిన ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని పట్టుదలగా పోరాడుతోంది.

ఇదే సమ స్యపై ఉద్యమిస్తున్న ఇతర పార్టీలకూ, సంఘాలకూ చేయూతనందించింది. పల్లె సీమలనుంచి పట్టణాలు, నగరాల వరకూ అన్నిచోట్లా్ల సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించింది. ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సభల్లో పాల్గొని ప్రత్యేక హోదా రావడంవల్ల చేకూరే మేళ్లేమిటో విద్యార్థులకూ, యువతకూ చాటి చెప్పారు. వారిలో పోరాటపటిమను పెంచారు. తాను స్వయంగా ఆమరణ దీక్ష చేశారు. హోదా కోసం సాగిన రాస్తారోకోలు, ధర్నాల్లో నిర్బంధాలను ధిక్కరించి లక్షలాది మంది పాల్గొన్నారు. పీడీ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని, భవి ష్యత్తు లేకుండా చేస్తామని బాబు ప్రభుత్వం బెదిరింపులకు దిగినా బేఖాతరు చేశారు.   

పోటెత్తుతున్న ఉద్యమానికి తూట్లు పొడిచేందుకు అడుగడుగునా ప్రయత్నించి భంగపడిన బాబు ఇక లాభం లేదని చిట్టచివరి అంకంలో స్వరం మార్చారు. ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 13న జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన కార్యాచరణ చూశాక ఆయనలో వణుకు మొదలైంది. మార్చి 1న ప్రారంభమైన ఆ కార్యా చరణతో ఉద్యమం మహోగ్ర రూపం దాల్చేసరికి తనదీ అదే బాట అంటూ బాబు కొత్త రాగం అందుకున్నారు. కానీ ఇందులో సైతం ఆయన వంచననే ఆశ్రయిం చారు. క్షణక్షణానికీ మాట మారుస్తూ ప్రజలను అయోమయ పరిచేందుకు ప్రయ త్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం పెడుతుందని స్పష్టమయ్యాక ఎన్‌డీఏ ప్రభుత్వంలోని తమ పార్టీ మంత్రులిద్దరి చేతా రాజీనామా ఇప్పించారు. కానీ సర్కారుకు మద్దతు కొనసాగిస్తామని చెప్పారు. ఆ తర్వాత మద్దతు ఉప సంహరించుకుంటున్నట్టు ప్రకటిస్తూ అవిశ్వాసం జోలికిమాత్రం వెళ్లబోమని చెప్పారు. దానికీ కట్టుబడి ఉండలేదు.  వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్ద తునిస్తామని మరో రోజు శాసనసభ సాక్షిగా ప్రకటించారు. కానీ తెల్లారేసరికల్లా ప్లేటు ఫిరాయించి మేమే ఆ తీర్మానం పెట్టి అందరి మద్దతూ కూడగడతామని స్వరం మార్చారు. ఈలోగా తన ఎంపీలతో ఢిల్లీలో సభ వెలుపల, బయటా నాటకం ఆడించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి జీవన్మరణ సమస్యవంటి ప్రత్యేక హోదాను అధికారంలోకొచ్చిన వెంటనే అటకెక్కించిన ఘనుడు చంద్రబాబు. ముఖ్యంగా ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో దొరికిపోయాక హోదా ఊసెత్తడమే తగ్గించేశారు. 2015లో అమరావతి శంకుస్థాపనకొచ్చిన ప్రధానిని నిండు సభలో ప్రత్యేక హోదా గురించి అడగటానికి ఆయనకు నోరు పెగల్లేదు. ‘ప్రత్యేక ప్యాకేజీ’ కావాలని అడిగి ప్రజలను దిగ్భ్రాంతిపరిచారు. ఆ మర్నాడు అదీ, ఇదీ ఒకటేనంటూ భాష్యం చెప్పారు. ఇప్పుడూ ఆ తరహా నాటకమే సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఆమరణ దీక్షకు దిగి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగేది. ప్రత్యేక హోదా ప్రకటించక తప్పని స్థితి ఏర్పడేది.

కానీ ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా టీడీపీ ఎంపీలు నిరవధిక వాయిదా పడిన పార్లమెంటులో కాసేపు బైఠాయించి, ఆ తర్వాత స్పీకర్‌ చాంబర్‌ వద్దకు పోయి హడావుడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఇటు రాష్ట్రంలో మొక్కుబడిగా బాబు నాయకత్వంలో సైకిల్‌ ర్యాలీ తీశారు. ఈ క్షణంలో నైనా బాబు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎడతెగని వంచనకు స్వస్తిపలకాలి. ఆంధ్రప్రదేశ్‌కు వేయి కిలోమీటర్ల సాగర తీరం ఉంది. అపార ఖనిజ నిక్షేపాలు న్నాయి. వాటితో పోటీబడుతూ మానవ వనరులున్నాయి. వీటన్నిటినీ సరిగా సమన్వయపరచుకోగలిగితే ఒక మహాద్భుతం ఆవిష్కృతమవుతుంది. రాష్ట్రం సర్వ తోముఖాభివృద్ధి సాధిస్తుంది. అందుకు ప్రత్యేక హోదా తప్ప వేరే దారిలేదు. దానికి అడ్డు నిలిస్తే చరిత్ర క్షమించదని బాబు ఇప్పటికైనా గ్రహించాలి. 

మరిన్ని వార్తలు