జనాభా.. నిర్ధారించే అంశాలు.. 2011 లెక్కలు

23 Oct, 2014 04:48 IST|Sakshi
జనాభా.. నిర్ధారించే అంశాలు.. 2011 లెక్కలు

సోషల్ స్టడీస్ - జాగ్రఫీ
  ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే అది దేశ ఆర్థికాభివృద్ధికి సూచికగా భావించవచ్చు. అందుకే ప్రఖ్యాత జనాభా శాస్త్రవేత్త ‘ఏడ్విన్ కానన్’ అన్నట్లు ‘భూమిపైన పుట్టే ప్రతీ బిడ్డ ఒక అభివృద్ధి కారకం’ అవుతుంది. ఆ విధంగా కాకుండా జనాభా అభిలషణీయ స్థాయిని దాటి పెరుగుతూ పోతే అది దేశ ఆర్థికాభివృద్ధిని హరించి వేస్తుంది. జనాభా సిద్ధాంతకర్త ‘మాల్థస్’ చెప్పినట్లు ‘భూమిపై పుట్టే ప్రతీ బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొందించే వాడవుతాడు.
 
 జనాభా 50 లక్షలు:
 క్రీ.పూ. 8000 నాటికి ప్రపంచ జనాభా 50 లక్షలు. అంటే ప్రతీ 1000 చ.కి.మీ.ల భూమిపై 32 మంది మాత్రమే నివసించే వారు. ఈ జనాభా క్రీ.శ. 1850 వరకు 100 కోట్లకు చేరుకుంది. క్రీ.శ. 2000లో 600 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ప్రస్తుతం సుమారు 720 కోట్లు. ఇది క్రీ.శ. 2050 నాటికి 1000 కోట్లకు చేరవచ్చని గణాంకాలు చెబుతున్నాయి.  మొదటి సారి స్వీడన్‌లో: ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్రీ.శ. 1748లో స్వీడన్‌లో జనాభా లెక్కలను సేకరించడం ప్రారంభించారు. అదేవిధంగా కాలానుగుణంగా వివిధ దేశాల్లో జనాభా లెక్కలను ఏదైనా ప్రాధికార సంస్థ ద్వారా సేకరించే పద్ధతి అమల్లో ఉంది. ఆ గణాంకాల ఆధారంగా భవిష్యత్ ప్రణాళికలను, పథకాలను నిర్మాణాత్మకంగా రూపొందించి అభివృద్ధికి బాటలు వేస్తారు. జన గణన ఆధారంగా నిర్ధారించే అంశాలు..
 
 జన సాంద్రత: సగటున ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను జన సాంద్రత అంటారు. జనసాంద్రత పరిమాణం ద్వారా జనాభా ఎక్కడ అధికంగా లేదా తక్కువగా కేంద్రీకృతమైందో తెలుసుకోవచ్చు. ప్రస్తుత ప్రపంచ జన సాంద్రత 41 మంది.అక్షరాస్యత రేటు: దేశంలో ఏదైనా ఒక భాషను చదవగల, రాయగల ప్రజల సంఖ్యను అక్షరాస్యత అంటారు. ఏడు సంవత్సరాల వయసు పైబడిన మొత్తం జనాభాతో అక్షరాస్యుల సంఖ్యను భాగిస్తే అక్షరాస్యత రేటు వస్తుంది. దీని ఆధారంగా దేశ విద్యా, వైజ్ఞానిక అభివృద్ధి స్థాయిని అంచనా వేయవచ్చు.
 
 జనన రేటు: ప్రతీ 1000 మంది జనాభాకు పుట్టిన సగటు జననాల సంఖ్య.
 మరణ రేటు: ప్రతీ 1000 మంది జనాభాకు మరణించిన సగటు జన సంఖ్య.
 శిశు మరణాల రేటు: పుట్టిన ప్రతీ 1000 మంది పిల్లల్లో ఏడాదిలోపు వయసులోనే మరణించే సగటు పిల్లల సంఖ్య.
 జనాభా పెరుగుదల (వృద్ధి)రేటు: గతం జనాభా లెక్కల ప్రకారం వచ్చిన మొత్తం జనాభా.. ప్రస్తుత గణాంకాల ద్వారా తెలిసిన మొత్తం జనాభాతో పోల్చితే ఎంత శాతం పెరిగిందో తెలుసుకోవడానికి పెరుగుదల రేటు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా వార్షిక వృద్ధిరేటు 1.7 శాతం.
 
 భారతదేశం - జనాభా
 భారతదేశంలో మొదటిసారిగా క్రీ.శ. 1872లో లార్‌‌డ మేయో  వైశ్రాయ్‌గా ఉన్న సమయంలో జనాభాను లెక్కించారు. ఈ గణన వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో జరిగింది. వైశ్రాయ్ లార్‌‌డ రిప్పన్ హయాంలో మాత్రం క్రీ.శ. 1881లో దేశం మొత్తంమీద ఏకకాలంలో జనగణన చేశారు. అప్పటి నుంచి (1881) ప్రతీ పది సంవత్సరాలకోసారి క్రమం తప్పకుండా జన గణన చేస్తున్నారు. 2011లో నిర్వహించిన జనగణన మొత్తం మీద 15వది కాగా స్వతంత్ర భారతదేశంలో 7వది. ప్రపంచ భూభాగంలో కేవలం 2.4 శాతం విస్తీర్ణం కలిగిన భారతదేశం (భూభాగ విస్తీర్ణంలో 7వ పెద్ద దేశం) ప్రపంచ జనాభాలో మాత్రం 17.5 శాతం వాటాను కలిగి ఉంది (జనాభాలో రెండో పెద్ద దేశం).
 
 2011 లెక్కలు:
 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. 2011 జనాభా లెక్కలు (సెన్సస్) ఆ సంవత్సరం మార్చి 1 వరకు గల జన సంఖ్యను తెలుపుతాయి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 9, 2011న ప్రారంభమైంది. ఈ సెన్సస్ ప్రకారం.. మొత్తం జనాభా 21,07,26,932. వీరిలో పురుషుల సంఖ్య 62.39 కోట్లు (51.6 శాతం), మహిళల సంఖ్య 58.58 కోట్లు (48.4 శాతం). మొత్తం గ్రామీణ జనాభా 83.36 కోట్లు (68.8 శాతం), పట్టణ జనాభా 37.71కోట్లు (31.2 శాతం). 2001-11 మధ్య జనాభా పెరుగుదల 18.196 కోట్లు (17.7శాతం). జనాభా వార్షిక వృద్ధిరేటు 1.64 శాతం. ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు 2045 నాటికీ భారతదేశం, చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుంది.
 
 గొప్ప విభాజక సంవత్సరం:
 దేశంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు నమోదైన దశాబ్దం 1961-71. ఆ సమయంలో 24 శాతం జనాభా పెరిగింది. 1911-21 దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా (-0.31 శాతం) నమోదైంది. అందుకే 1921 సంవత్సరాన్ని మన దేశ జనాభా పరిణామ క్రమంలో ‘గొప్ప విభాజక సంవత్సరం’గా గుర్తించారు. భారత జనాభా అధికారికంగా 2000, మే 11న 100 కోట్లకు చేరుకుంది. అందుకు గుర్తుగా జనాభా పెరుగుదలను కార్యక్రమాలను సమన్వయం చేయడం కోసం ‘జాతీయ జనాభా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ‘జాతీయ జనాభా విధానం - 2000’ అమలును పర్యవేక్షిస్తుంది. దీని ప్రకారం 2045 నాటికి జనాభాను స్థిరీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
 
 కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు:
  ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసిన మొదటి దేశం భారత్. 1952 నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చైనా ‘వన్ ఆర్ నన్’ .. అనే నినాదంతో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మన దేశంలో ‘మేమిద్దరం - మాకిద్దరు’ అనే నినాదం అమల్లో ఉంది. అంతేకాకుండా కేంద్రంలో కుటుంబ నియంత్రణ శాఖను 1966లో ఏర్పాటు చేశారు. జనాభా విస్ఫోటన ప్రమాదాన్ని గమనించిన ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి మొదటిసారిగా 1976లో జాతీయ జనాభా విధానాన్ని రూపొందించింది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి 8వ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యాలను నిర్ణయించారు. అంతేకాకుండా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణ పథకాల అమలును పర్యవేక్షించే అధికారాన్ని పంచాయితీరాజ్ వ్యవస్థకు బదలాయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం
 2003లో ‘రాష్ట్రీయ జన సంఖ్యకోశ్’ పేరుతో దేశంలో జనాభా స్థిరీకరణ కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనికి చైర్మన్‌గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉంటారు.
 
 భారతదేశ జనాభా - ముఖ్యాంశాలు
 అత్యధిక జనాభా గల రాష్ట్రం    ఉత్తరప్రదేశ్
 అత్యల్ప జనాభా గల రాష్ట్రం    సిక్కిం
 అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం    ఢిల్లీ
 అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం    లక్ష్వద్వీప్
 అత్యధిక జనాభా గల జిల్లా    థానే (మహారాష్ర్ట)
 అత్యల్ప జనాభా గల జిల్లా    దిబాంగ్ వ్యాలీ (అరుణాచల్‌ప్రదేశ్)
 భారతదేశ జనసాంద్రత    382 మంది
 అధిక జనసాంద్రత గల రాష్ట్రం    బీహార్ (1106)
 అధిక జనసాంద్రత గల కేంద్ర పాలిత ప్రాంతం    ఢిల్లీ (11,320)
 అధిక జనసాంద్రత గల జిల్లా    ఈశాన్య ఢిల్లీ (37,346)
 అల్ప జనసాంద్రత గల జిల్లా    దిబాంగ్ వ్యాలీ (అరుణాచల్‌ప్రదేశ్)
 జాతీయ అక్షరాస్యత    73 శాతం (పురుషుల అక్షరాస్యత -
 81శాతం, స్త్రీలు 64.6 శాతం)
 అధిక అక్షరాస్యత గల రాష్ట్రం    కేరళ (94 శాతం)
 అల్ప అక్షరాస్యత గల రాష్ట్రం    బీహార్ (61.8శాతం)
 జాతీయ లింగ నిష్పత్తి    1000 మంది పురుషులు :
     943 మంది స్త్రీలు
 లింగ నిష్పత్తిలో స్త్రీలు అధికంగా ఉన్న రాష్ట్రం    కేరళ (1000 : 1084)
 లింగ నిష్పత్తిలో స్త్రీలు తక్కువగా ఉన్న రాష్ట్రం    హర్యానా (1000 : 879)
 గ్రామీణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం    హిమాచల్ ప్రదేశ్ (తక్కువ : గోవా)
 పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం    గోవా (తక్కువ హిమాచల్ ప్రదేశ్)
 ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం    ఉత్తరప్రదేశ్ (తక్కువ  పంజాబ్)
 ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం    మధ్యప్రదేశ్ (తక్కువ హర్యానా)
 
 గతంలో వచ్చిన ప్రశ్నలు
 1.    2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంతశాతం పెరిగింది?
     1) 17.19        2) 16.64
     3) 18.12        4) 17.64 (17.7)
 
 2.    2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి?
     1) ప్రతీ ఒక్కరూ లెక్కిస్తారు
     2) మన జనాభా లెక్కలు, మన భవిష్యత్తు
     3) నన్ను లెక్కించండి    4) ఏదీకాదు
 
 3.    2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యతా శాతం?
     1) 64    2) 82    3) 53    4) 73

 4.    2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండు రాష్ట్రాలు?
     1) ఉత్తరప్రదేశ్, బీహార్
     2) ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట
     3) ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్
     4) ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
 
 5.    2011 తాత్కాలిక జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం?
     1) ఉత్తరప్రదేశ్    2) బీహార్
     3) కేరళ        4) పశ్చిమ బెంగాల్
 
 6.    దేశంలో ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా నమోదైంది?
     1) 1911-21    2) 1921-31
     3) 1931-41    4) 1941-51
 
 7.    {పపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
     1) మే 11        2) జూలై 11
     3) సెప్టెంబర్ 11    4) డిసెంబర్ 11
 
 8.    భారత జనాభా గణన చట్టం - 1948 ప్రకారం అక్షరాస్యులంటే?
     1)    చదవడం, రాయడం వచ్చి ఐదేళ్లు నిండిన వారు
     2)    6 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చిన వారు
     3)    7 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చినవారు
     4)    4 ఏళ్ల నుంచి చదవడం, రాయడం వచ్చినవారు
 సమాధానాలు
     1) 4;    2) 2;    3) 4;    4) 2;
     5) 2;    6) 1;    7) 2;    8) 3.

 
 ప్రపంచ జనాభా ప్రధానాంశాలు
 అత్యధిక జనాభా గల దేశం    చైనా (సుమారు 140 కోట్లు)
 అత్యధిక జనాభా గల రెండో దేశం    భారత్ (2011 లెక్కల
 ప్రకారం 121కోట్లు) అతి తక్కువ జనాభా ఉన్న దేశం    వాటికన్ సిటీ
 నిలకడైన జనాభా ఉన్న దేశం    దక్షిణ కొరియా
  జనాభా పెరుగుదల వేగంగా ఉన్న దేశం    ఫిలిప్పైన్‌‌స
 వేగంగా జనాభా తగ్గుతున్న దేశం    జపాన్
 అత్యధిక జనసాంద్రత గల దేశం    మొనాకో
 అత్యల్ప జన సాంద్రత గల దేశం    పశ్చిమ సహారా
 

మరిన్ని వార్తలు