ఆకాశయానంలో అవకాశాలెన్నో...

11 Aug, 2014 23:50 IST|Sakshi
ఆకాశయానంలో అవకాశాలెన్నో...

భారత్‌లో ఆర్థిక సంస్కరణల ప్రవేశంతో విమానయాన రంగంలో అభివృద్ధి ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న సంస్థలతోపాటు మరికొన్ని ఈ రంగంలో అడుగుపెట్టనున్నాయి. ఇందులో డిమాండ్‌కు తగిన స్థాయిలో నిపుణులు లేరు. నగరంలో ఈ రంగానికి అవసరమైన కోర్సులను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, పెలైట్ ట్రైనింగ్, కేబిన్ క్రూ శిక్షణకు హైదరాబాద్ పేరుగడించింది. మనదేశంలో వచ్చే పదేళ్లలో.. ఏవియేషన్ రంగంలో ‘పెలైట్ మొదలు.. టికెట్ కౌంటర్ స్టాఫ్’ వరకు పలు విభాగాల్లో దాదాపు 30 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో విమానయానంలో అవకాశాలపై ఫోకస్..
 
 ఎన్నో విభాగాల్లో కొలువులు
 విమానయాన రంగం అంటే.. కేవలం పెలైట్లు మాత్రమే కాదు. ఇంకా ఎన్నో విభాగాల ఉద్యోగాలు ఉంటాయి. కో పెలైట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ఏటీసీ), ఏరోనాటికల్ ఇంజనీర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్స్ ఇంజనీర్లు, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ నిపుణులు, ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్డ్, ఇతర టెక్నీషియన్స్.. ఇలా ఎంతోమంది సమాహారమే ఏవియేషన్.
 
 ఎయిర్‌క్రాఫ్ట్/ఏరోనాటికల్ ఇంజనీరింగ్
 విమానయాన రంగంలో మరో ముఖ్య విభాగం ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్. విమానాల్లో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్ది వాటిని సక్రమంగా ఉంచడమే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన విధి. దీంతోపాటు డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్ విధులను కూడా ఈ సిబ్బందే నిర్వర్తిస్తారు. నిర్దేశిత మార్కులతో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసినవారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్/ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కోర్సులు చేయొచ్చు. వీరికి ప్రారంభంలో నెలకు రూ.40,000 వేతనం ఉంటుంది.
 
 సంస్థలు: ఐఐటీ ఖరగ్‌పూర్, మద్రాస్, బాంబే, కాన్పూర్; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, డెహ్రాడూన్; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం. వీటితోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులను బోధిస్తున్నాయి.  
 
 ఎయిర్ టికెటింగ్
 విమానాల వేళలు, ప్రయాణికుల అవసరాలను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. వీటిని అనుసంధానం చేసుకుంటూ టికెట్లను ఖరారు చేసి అందించే కోర్సే ఎయిర్‌లైన్ టికెటింగ్. ఈ కోర్సులో పలు రకాల పద్ధతులు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, ఏజెంట్ నెట్‌వర్క్, కౌంటర్) ద్వారా విమాన టికెట్ల బుకింగ్, రిజర్వేషన్ వంటి అంశాల్లో శిక్షణనిస్తారు. ప్రస్తుతం ఎయిర్‌లైన్ టికెటింగ్ విభాగంలో రెండు నెలల నుంచి ఏడాది వ్యవధిలో పలు రకాల కోర్సులు అందుబాటు లో ఉన్నాయి.  ఎయిర్ టికెటింగ్ సిబ్బందికి ప్రారంభంలో నెలకు రూ.25,000 నుంచి కెరీర్ ఆరంభమవుతుంది. తర్వాత పనితీరు, అనుభవం ఆధారంగా నెలకు రూ.50,000 వరకు సంపాదించొచ్చు.
 కోర్సులను అందిస్తున్న సంస్థలు: ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ), ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్, ఇగ్నో.
 
 గ్రౌండ్ డ్యూటీ
 బస్సు, రైలు వంటి రవాణా పద్ధతులతో పోల్చితే.. విమాన ప్రయాణాల విషయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలు (చెక్-ఇన్, చెక్-అవుట్, బ్యాగేజ్ కలెక్షన్ తదితర) ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో  ప్రయాణికులకు తమ సేవల ద్వారా సహకరించే సిబ్బందే గ్రౌండ్ స్టాఫ్. ప్రతి ఎయిర్‌లైన్ సంస్థ.. తమ విమాన సర్వీసుల ప్రయాణికుల సౌకర్యం కోసం ఆయా విమానాశ్రయాల్లో ఈ గ్రౌండ్ స్టాఫ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తాయి. వాస్తవానికి ఒక విమానయాన సంస్థకు పేరు ప్రతిష్టలు తీసుకురావడంలో గ్రౌండ్ స్టాఫ్‌దే కీలక పాత్ర. వీరి పనితీరును బట్టే సంస్థకు ప్రయాణికుల ఆదరణ లభిస్తుంది. గ్రౌండ్ డ్యూటీ స్టాఫ్‌కు విమానయాన సంస్థను బట్టి ప్రారంభంలో నెలకు రూ.25,000  వరకు వేతనం లభిస్తుంది. రెండు, మూడేళ్ల పని అనుభవంతో నెలకు రూ.50,000కు పైగానే పొందొచ్చు. కోర్సులను అందిస్తున్న సంస్థలు: ఐరావత్ ఏవియేషన్ అకాడమీ -ముంబై, ఆప్‌టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ-కోల్‌కతా, ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ - చెన్నై.
 
 డెవలప్‌మెంట్, టీచింగ్ రంగాల్లోనూ..
 ఎయిర్‌లైన్‌‌స సంస్థల్లో వివిధ విభాగాల్లో అవకాశాలుంటాయి. ఏరోనాటికల్ ఇంజనీర్లకు డిజైన్, డెవలప్‌మెంట్‌తోపాటు మేనేజ్‌మెంట్, టీచింగ్ రంగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్‌లలో, ఏవియేషన్ రంగంలోని డిజైన్ యూనిట్లలో వీరికి మంచి డిమాండ్ ఉంది. ఇస్రో, డీఆర్‌డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో... ప్రైవేటు రంగంలో ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌లైన్, శాటిలైట్, డిఫెన్స్ ఇండస్ట్రీతోపాటు వాటి అనుబంధ రంగాల్లోనూ ఉపాధి పొందొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయా విమానయాన సంస్థల్లో ఎయిర్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, ఫేర్స్ అండ్ టికెటింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. అనుబంధ ఉద్యోగాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
 
 విమానయాన రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు
 ‘‘ఏవియేషన్‌లో పెలైట్‌లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్స్ ఇంజనీర్స్, గ్రౌండ్ డ్యూటీ, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. విమానయానం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం దానికి అనుగుణంగానే కొత్తగా ఏర్పాటవుతున్న ఆధునాతన ఎయిర్‌పోర్టులు, సరికొత్త విమానాల వృద్ధే దీనికి నిదర్శనం. తాజాగా ఏవియేషన్ రంగంలో ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌డీఐ)లకు ఆస్కారం ఏర్పడడంతో ఈ రంగం మరింత పుంజుకోనుంది. కొత్తగా ఎయిర్ ఆసియా, టాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ కోస్టా తదితర విమానయాన సంస్థల రంగ ప్రవేశంతో ఏవియేషన్‌లో మరిన్ని ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఎయిర్ ఆసియా, ఎయిర్ కోస్టా విమానయాన సేవలను ప్రారంభించాయి. ఎయిర్ ఇండియా కూడా తన సేవల పరిధిని క్రమంగా పెంచడానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచాన్ని చుట్టేస్తూ, ఆకర్షణీయ వేతనం అందుకోవాలనుకునేవారు పెలైట్‌లుగా కెరీర్ ప్రారంభించొచ్చు’’
 - కెప్టెన్ ఎస్.ఎన్. రెడ్డి,  సెక్రటరీ అండ్ సీఈఓ, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్  
 
 పెలైట్
 ‘విమానం ఎగిరినప్పటి నుంచి జాగ్రత్తగా నిర్దేశిత గమ్యస్థానంలో దించేవరకు పెలైట్‌దే ప్రధాన బాధ్యత. పదో తరగతి ఉత్తీర్ణులు స్టూడెంట్ పెలైట్ లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్.పి.ఎల్. సాధించాక ప్రైవేట్ పెలైట్ లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దశలో కనీసం 60 గంటలపాటు ఫ్లైయింగ్ అనుభవం సంపాదిస్తే లెసైన్స్ లభిస్తుంది. దీంతోపాటు డీజీసీఏ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ప్రైవేట్ పెలైట్ లెసైన్స్ కూడా సాధిస్తే.. చివరి దశ కమర్షియల్ పెలైట్ లెసైన్స్ కోసం ప్రయత్నించాలి. ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. ఈ దశలో 200 గంటలు విమానాన్ని నడిపిన అనుభవం సొంతం చేసుకుంటే పరిపూర్ణ పెలైట్‌గా పరిగణిస్తారు. పెలైట్‌కు క్షణాల్లో సరైన నిర్ణయాలు తీసుకొనే సత్తా ఉండాలి. ఎలాంటి సవాల్‌కైనా సిద్ధంగా ఉండాలి. పెలైట్లకు ప్రారంభంలో ఏడాదికి రూ. 15 లక్షల నుంచి వేతనాలు ఉంటాయి. సీనియర్ పెలైట్‌లు ఏడాదికి రూ. 65 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జించొచ్చు.  
 
 పైలట్ శిక్షణనిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్; రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ, హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, సికింద్రాబాద్; బాంబే ఫ్లైరుుంగ్ క్లబ్; గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, భువనేశ్వర్; గవర్నమెంట్ ఫ్లైరుుంగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా; గవర్నమెంట్ ఫ్లైరుుంగ్ ట్రైనింగ్ స్కూల్, బెంగళూరు; రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ, తిరువనంతపురం
 
 కేబిన్ క్రూ
ఆకట్టుకునే రూపం.. ఎదుటివారిని ఒప్పించే నేర్పు ఉంటే అద్భుత అవకాశాలందించే విభాగం కేబిన్ క్రూ. ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ స్టీవార్డ్, ఫ్లైట్ అటెండెంట్ హోదాలు ఈ విభాగంలో లభిస్తాయి.  ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్, 18 ఏళ్ల వయసు ఉంటే చాలు.. కేబిన్ క్రూలో కెరీర్‌ను అన్వేషించవచ్చు.  వీరికి సమయస్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విదేశీ భాషల్లో పట్టు అవసరం. కేబిన్ క్రూ అభ్యర్థులు ప్రారంభంలో రూ.50,000 అందుకోవచ్చు. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.80,000కు పైగా పొందొచ్చు.
 కోర్సులను అందిస్తున్న సంస్థలు: కేబిన్ క్రూకు సంబంధించి శిక్షణనిచ్చే సంస్థలు ప్రభుత్వ రంగంలో లేవు. ప్రైవేట్ రంగంలో ఎన్నో ఉన్నాయి. ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడెమీ - సికింద్రాబాద్, ఫ్రాంక్‌ఫిన్ - ముంబై, కింగ్‌ఫిషర్ ట్రైనింగ్ అకాడెమీ - ముంబై వంటి ప్రైవేటు సంస్థలు కేబిన్ క్రూ కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి.

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా