క్లరికల్ కొలువుకు సక్సెస్ మార్గాలు..

22 Aug, 2013 15:15 IST|Sakshi

కె.వి. జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్,హైదరాబాద్.
 
 బ్యాంకులు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన బ్యాంకుల సేవలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ, రుణాలు ఇవ్వడం వంటివే కాకుండా బీమా వంటి కార్యకలాపాలనూ సాగిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రాంచ్‌ల సంఖ్యను పెంచుకుంటూ కుర్రకారుకు కలల కొలువులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలా యువత భవితకు సుస్థిర బాటలు వేస్తున్న బ్యాంకింగ్ రంగంలో తొలి మెట్టు అయిన క్లరికల్ ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే ఐబీపీఎస్ ఎగ్జామ్‌లో మెరుగైన మార్కులు సాధించాలి. ఈ నేపథ్యంలో మంచి స్కోర్ కోసం ప్రిపరేషన్ ప్లాన్..
 
 19 బ్యాంకుల్లో ఉన్న క్లరికల్ ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉంటాయని అంచనా. వేలాది మంది బ్యాంకు ఉద్యోగుల పదవీ విరమణ, పెరుగుతున్న బ్రాంచ్‌ల సంఖ్య వల్ల ఖాళీల సంఖ్య అధికమవుతోంది. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.
 
 రాత పరీక్ష విధానం


 రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో రెండు గంటల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.


 విభాగం     మార్కులు
 రీజనింగ్     40
  ఇంగ్లిష్ లాంగ్వేజ్     40
   న్యూమరికల్ ఎబిలిటీ     40
   జనరల్ అవేర్‌నెస్
    (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం)    40
   కంప్యూటర్ నాలెడ్జ్     40
   మొత్తం    200
 
 ప్రిపరేషన్ వ్యూహం


 పట్టుదలతో చదివితే సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం చదవాలి. దీనికోసం 90 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఐబీపీఎస్ క్లరికల్ పరీక్షకు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉంది. అందువల్ల మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా శ్రమించి విజయాన్ని అందుకోవచ్చు.
 
 రీజనింగ్


 అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్ కోడిం గ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. దీంతో సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.
 
Ex: In a certain code "TERMINAL' is written as "NSFUMBOJ' and "TOWERS' is written as "XPUTSF'. How is "MATE' written in that code?
   1) FUBN    2) UFNB
   3) BNFU    4) BNDS    5) Non of these


 ఇంగ్లిష్ లాంగ్వేజ్:రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో దాదాపు 20 మార్కులు సాధించి ముందుగా కటాఫ్ నుంచి పైకి వెళ్లొచ్చు. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. మిగిలిన అంశాల్లో జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివి ఉంటాయి. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి.
 
 Ex: Read below sentence to find out whether there is any grammatical mistake/ error if any, will be one part of sentence. Mark the number of the part with errors as your answer. If there is "No error', mark (5).
    If you have made a mistake(1)/while filling up the form(2)/you should be informed(3)/ the Income Tax department immediately(4). No error(5)


 
 న్యూమరికల్ ఎబిలిటీ:న్యూమరికల్ విభాగంలో ఎక్కువగా సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, రేషియోస్‌కు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆన్‌లైన్ పరీక్షలో సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కడ ఇచ్చారో తెలుసుకోవడానికి పైకి-కిందకు స్క్రోల్ చేసి చూడాలి. ఎందుకంటే ఒక్కోసారి దీనికి సంబంధించిన ప్రశ్నలు చివర్లో ఇస్తారు.
 
 Ex: The average weight of 21 boys was recorded as 64 kgs. If the weight of the teacher was added, the average increased by one kg. What was the teachers' weight?
1) 86 kgs    2) 64 kgs    3) 72 kgs    4) 98 kgs


 
 జనరల్ అవేర్‌నెస్:జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. స్టాండర్డ్ జీకే. 2. కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్‌లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల్లో విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రముఖ అతిథులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి.
 
 ఈ పేపర్‌లోనే బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి దాదాపు 20 వరకు ప్రశ్నలు రావొచ్చు. దీనికోసం ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్‌నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. అదే విధంగా ఓ ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో నిరంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ బ్యాంకుల కొత్త విధానాలు, ఆర్‌బీఐ తాజా సమాచారం తెలుసుకోవాలి.
 
 
 Ex: 1. Which of the following is Not a function of a commercial bank?


  1)    Providing project finance
  2)    Settlement of payments of behalf of the customers
   3)    Decide policy rates like CRR, SLR, & Reporates
   4)    Issuing credit/debit/ATM cards
   5)    Providing services such as locker facilities, remittances


2.   Shanti Swarup Bhatnagar Award is given for excellence in the field of ................
1) Literature    2) Music    3) Sports
4) Science and Technology
5) Social service
 
 కంప్యూటర్ నాలెడ్జ్:ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంటుంది. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారించాలి. తొలి ఐబీపీఎస్ పరీక్ష నుంచి చూస్తే ఈ విభాగంలో ఇస్తున్న ప్రశ్నల కఠినత్వ స్థాయి పెరుగుతోంది. అందువల్ల అభ్యర్థులు కంప్యూటర్స్-జనరేషన్స్; ఎంఎస్ వర్డ్; ఎంఎస్ ఆఫీస్; డేటాబేస్ మేనేజ్‌మెంట్, షార్ట్‌కట్ కమాండ్స్ తదితరాల గురించి తెలుసుకోవాలి.
 
   Ex: The permanently etched program in ROM that automatically begins executing the computer's instructions is the
   1) BIOS     2) ROM    3) CMOS
   4) RAM     5) None of these
 
 రిఫరెన్‌‌స బుక్స్:    వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్
 ఆబ్జెక్టివ్ అర్థమెటిక్- ఎస్.ఎల్ గులాటీ
 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్- దిల్హాన్ పబ్లికేషన్స్
 ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్
 
 100 వరకు మోడల్ పేపర్లు చేశా
 నేను 100 వరకు మోడల్ పేపర్లు సాధన చేశాను. షార్ట్‌కట్స్ ఎన్ని తెలిసినా తగినన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకుంటే ఫలితం ఉండదు. ప్రామాణిక ఇంగ్లిష్, తెలుగు పత్రికలతో పాటు ఇంటర్నెట్ సహాయంతో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌పై పట్టు సాధించా. దినపత్రికల్లో బిజినెస్ పేజీలను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంపై అవగాహన ఏర్పడింది. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ జనరేషన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల రోజులో కొంత సమయాన్ని ఇంగ్లిష్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇంటర్వ్యూ ఎనిమిది నిమిషాలు జరిగింది. కుటుంబ నేపథ్యం, బ్యాంకింగ్‌కు సంబంధించిన కరెంట్ టాపిక్స్‌పై ప్రశ్నలు అడిగారు.
 
 - కృష్ణ చైతన్య, విజయా బ్యాంక్, హైదరాబాద్.
 (2012 ఐబీపీఎస్ క్లరికల్ విజేత)
 
 సక్సెస్‌కు ప్రాక్టీస్ కీలకం
 ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత ఫోకస్డ్‌గా చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఐబీపీఎస్ క్లరికల్, పీఓ పరీక్షల్లో విజయానికి వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం చాలా అవసరం. టైమ్ పెట్టుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల తెలియని ప్రశ్నలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుంది. గ్రూప్‌గా చదవడం వల్ల సమస్యలకు తొందరగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడే షార్ట్‌కట్స్ తెలుస్తాయి. కరెంట్ అఫైర్స్‌పై అప్‌డేట్‌గా ఉండాలి. దినపత్రికల్లోని ఆర్థిక సంబంధమైన ఎడిటోరియల్స్‌ను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఒంటపడుతుంది. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ బుక్స్‌ను ఉపయోగించుకోవాలి.
 - బొడ్డు శ్రీకాంత్, ఐవోబీ, నల్లజెర్ల.
 (2012 ఐబీపీఎస్ పీఓ విజేత)
 
 ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ వివరాలు
 
 అర్హత: ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ వాడుకకు సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం.
 వయో పరిమితి: 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఆగస్టు 1, 2013 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది.
 ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 19, 2013.
 ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: సెప్టెంబర్ 7, 2013.
 ఆన్‌లైన్ పేమెంట్: 19.8.2013-7.9.2013.
 ఆఫ్‌లైన్ ఫీ పేమెంట్: 21.8.2013-12.9.2013.
 పరీక్షల తేదీలు: 30.11.2013, 1.12.2013, 7.12.2013, 8.12.2013, 14.12,2013, 15.12.2013.
 (వీటిలో మార్పులు, చేర్పులు జరగొచ్చు.)
 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కంచికచర్ల, కరీంనగర్, కర్నూలు, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
 
 ఐబీపీఎస్ ద్వారా క్లరికల్ నియామకాలు చేపడుతున్న బ్యాంకులు
 
 అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్.
 
 
 వెబ్‌సైట్:www.ibps.in
 

మరిన్ని వార్తలు