గృహాలంకరణ కళాకారుడు.. ఇంటీరియర్ డిజైనర్

9 Jul, 2014 01:37 IST|Sakshi
గృహాలంకరణ కళాకారుడు.. ఇంటీరియర్ డిజైనర్

అప్‌కమింగ్ కెరీర్: గృహమే కదా స్వర్గసీమ! ఆనందాల పొదరిల్లును నయనానందకరంగా తీర్చిదిద్దుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. ఇంటి లోపలి అలంకరణ కనువిందుగా ఉంటే అలసిన మనసులు సేదతీరుతాయి. ఆనందం, సంతృప్తి కలుగుతాయి. అలాంటి అలంకరణ చేసిపెట్టి, గృహస్థుల మదిని దోచే నిపుణుడు... ఇంటీరియర్ డిజైనర్. మన దేశంలో క్రమంగా డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. ఇంటీరియర్ డిజైనింగ్!
 
నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఆధునిక గృహాల నిర్మాణం వేగంగా సాగుతోంది. క్లయింట్ల అభిరుచుల్లో మార్పు వస్తోంది. ఇంటి నిర్మాణంతో పాటు లోపలి అలంకరణకూ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందుకోసం నిపుణులను సంప్రదిస్తున్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను అభ్యసిస్తే ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు.  
 ఇంటీరియర్ డిజైనింగ్ రంగం నానాటికీ వృద్ధి చెందుతోంది. వ్యక్తిగత నివాస గృహాలతోపాటు కార్పొరేట్ కార్యాలయాల్లోనూ ఇంటీరియర్ డిజైనర్లకు డిమాండ్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా డిజైనర్లను విరివిగా నియమించుకుంటున్నాయి. అపార్టుమెంట్లు, విల్లాల్లో అలంకరణ బాధ్యతలను వారికి అప్పగిస్తున్నాయి.
 ఇంటీరియర్ డిజైనింగ్ అంటే.. ఇంట్లో ఫర్నీచర్‌ను, వస్తువులను అటూఇటూ మార్చేయడం కాదు. ఇది సృజనాత్మకతతో కూడిన వృత్తి. ఇది ఒక కళ.  ఇంటీరియర్ డిజైనర్‌గా వృత్తిలో రాణించాలంటే.. సృజనాత్మకత, కష్టపడేతత్వం తప్పనిసరిగా ఉండాలి. క్లయింట్ల అభిరుచులను, అవసరాలను గ్ర హించే నేర్పుతో  పనిచేస్తే మెరుగైన ఆదాయం ఆర్జించొచ్చు.
 అర్హతలు: ఇంజనీరింగ్/ఆర్కిటెక్చర్ కోర్సులను చదివినవారు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును కూడా పూర్తిచేస్తే కెరీర్ మెరుగ్గా ఉంటుంది. ఇంటర్, డిగ్రీ తర్వాత కూడా 6, 12 నెలల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇలాంటి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజైన్ స్కూల్స్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను, ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్‌గా మాస్టర్స్(ఫైన్ ఆర్ట్స్) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
 వేతనాలు: ఇంటీరియర్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. సొంతంగా డిజైనింగ్ సంస్థను ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఆదాయం కళ్లజూడొచ్చు.
 
 ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
 1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: http://www.iiiddelhi.org/
 2. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: http://www.nift.ac.in/delhi/  
 3. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: http://www.iiftindia.net/
 
 సృజనాత్మకతే కెరీర్‌కు ప్రాణం
 ‘‘విభిన్నమైన వృత్తి  ఇంటీరియర్ డిజైనర్. నిర్మాణ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ఆసక్తి, సృజనాత్మకంగా ఆలోచించే నేర్పు ఉంటే చాలు. ఐదేళ్ల బీఆర్క్‌తో అందమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ తర్వాత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు సమయంలోనే చిన్నపాటి ప్రాజెక్టులతో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సమాజంలో పరిచయాలు, పలుకుబడి పెరిగేకొద్దీ ప్రొఫెషనల్‌గా స్థిరపడవచ్చు. ఉద్యోగిగా సీనియారిటీ ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంటీరియర్ డిజైనర్లకు మరింత డిమాండ్ ఉంటుంది’’  
 -ఎస్.శ్రీకర్, ఇంటీరియర్ డిజై నర్, బంజారాహిల్స్

మరిన్ని వార్తలు