కలాన్ని కదిలిస్తూ.. జనానికి గళమవుతూ..

5 Dec, 2013 15:53 IST|Sakshi

జర్నలిస్టు

 పాత్రికేయం.. ప్రజా సమస్యలపై పోరాడే పాశుపతాస్త్రం. కలం కదిలించి, అక్షర అస్త్రాలను సంధించి.. ప్రజలకు తోడుగా, పచ్చని కెరీర్‌కు నీడగా నిలిచే ప్రొఫెషన్. చేపట్టిన వృత్తి.. వ్యక్తిగత వికాసానికే కాకుండా, పది మంది పురోగతికీ ఉపయోగపడాలన్న కోరిక ఉన్న వారికి సరైన కెరీర్ ఆప్షన్ జర్నలిజం. సామాజిక స్పృహ, సృజనాత్మకతకు భాషా సామర్థ్యం, కష్టపడి పనిచేసే తత్వం తోడైతే ఉన్నత అవకాశాలకు కొదవలేని జర్నలిజం కెరీర్‌పై స్పెషల్ ఫోకస్..

 

 దేశంలో మీడియా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రారంభమవుతున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్నాయి. ముఖ్యంగా 24 గంటల వార్తా చానళ్ల సంఖ్య అధికమవుతోంది. వీటికి తోడు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పీసీల వాడకం ఎక్కువ కావడంతో టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ కంటెంట్ వినియోగం అధికమైంది. దీంతో ఆన్‌లైన్ జర్నలిజం సరికొత్త ఉద్యోగాలకు ద్వారాలు తెరుస్తోంది.

 

 జర్నలిజం ప్రొఫెషనల్స్‌కు తీవ్ర డిమాండ్ ఉండటంతో విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి.

 

 నిత్యనూతనం..

 కెరీర్‌లో అడుగుపెట్టింది మొదలు... ఎప్పుడూ నవ్యతకు అవకాశం ఉండటం, ఆకర్షణీయ పే ప్యాకేజీలతోపాటు సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో జర్నలిజం కెరీర్ దిశగా అడుగులు వేసే వారి సంఖ్య అధికమవుతోంది.

 

 పరిశోధన వరకు

 మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. జర్నలిజం కోర్సునకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో జర్నలిజంను ఒక సబ్జెక్టుగా చేర్చి వివిధ కోర్సులను అందించే కళాశాలలూ ఉన్నాయి.

 

 అధిక శాతం మంది బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి డిస్టెన్స్ విధానంలో జర్నలిజం కోర్సులను యువతకు అందుబాటులో ఉంచాయి. ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు.

 రాష్ట్రానికి బయట జర్నలిజం కోర్సులు అందిస్తున్న వాటిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నో, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి.

 ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

 

 జర్నలిజం- కరిక్యులం

 జర్నలిజం కోర్సు కరిక్యులంను తరగతి గది పాఠాలు, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ వర్క్, గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్‌షిప్‌ల సమ్మేళనంగా రూపొందిస్తున్నారు.

 

 కరిక్యులంలోని కొన్ని అంశాలు:

 జర్నలిజం ప్రాథమిక భావనలు.

 ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ మీడియా.

 అడ్వర్టైజింగ్, మ్యాగజైన్ అండ్ ఫొటో జర్నలిజం.

 రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్.

 క్రియేటివ్ థింకింగ్ అండ్ రైటింగ్.

 కార్పొరేట్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్.

 ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్.

 డెవలప్‌మెంట్ జర్నలిజం.

 మీడియా లాస్ అండ్ ఎథిక్స్.

 

 సొంతంగా జర్నలిజం కోర్సులు

 ప్రస్తుత సాంకేతిక ప్రపంచం ఒక గ్లోబల్ గ్రామంగా మారిన పరిస్థితుల్లో కచ్చితత్వంతో పాటు వేగం కూడా అత్యవసరమైంది. దీంతో మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. సమర్థవంతమైన, సుశిక్షితులైన మానవ వనరుల కోసం పత్రికలు, చానళ్ల యాజమాన్యాలు సొంతంగా జర్నలిజం స్కూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ ఈ తరహా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతూ తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. జాతీయస్థాయి సంస్థలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ సొంతంగా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతున్నాయి. ఈ సంస్థలు తరచూ జర్నలిజం స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి.

 రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన వారికి జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జర్నలిజం స్కూళ్లలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో భాషా నైపుణ్యాలు, వర్తమాన వ్యవహారాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి అంశాలపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

 

 ఉద్యోగ అవకాశాలు

 జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి.

 ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. రిపోర్టర్.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రాంతంలో ప్రతిరోజూ జరిగే కీలక పరిణామాలను గమనిస్తూ కథనాలు, వార్తలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

 సబ్‌ఎడిటర్ లేదా కాపీ ఎడిటర్.. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సమగ్రంగా తీర్చిదిద్దుతారు. వార్తా సంస్థలు అందించే ఇంగ్లిష్ వార్తలను స్థానిక భాషలోకి అనువదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతుంది.

 ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్‌వోలుగా నియమించుకుంటున్నాయి.

 బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు.

 యూజీసీ-నెట్‌లో అర్హత సాధించి విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో జర్నలిజం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు.

 ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు.

 

 అవసరమైన స్కిల్స్

 సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, చొరవ, కష్టపడే తత్వం.

 రోజువారీ లక్ష్యాలు, వాటి సాధనకు వ్యూహ రచన సామర్థ్యం.

 కమ్యూనికేషన్ స్కిల్స్ (లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్..).

 ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం.

 భాష, స్వేచ్ఛానువాద నైపుణ్యం.

 

 వేగం (Speed)

 స్పష్టత (Clarity)

 కచ్చితత్వం (Accuracy). ఇవి జర్నలిజం కెరీర్‌లో రాణించేందుకు ముఖ్యమైనవి.

 

 

 రేపటి జర్నలిస్టులకు ఆహ్వానం

 జనజీవనానికి అద్దం పడుతూ.. జనం కోసం పనిచేసే కెరీర్‌ను కోరుకునే వారికి ‘సాక్షి’ సాదర స్వాగతం పలుకుతోంది. ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు, తదనంతరం ఉద్యోగానికి ఆహ్వానిస్తోంది.

 

 అర్హతలు:

 తెలుగు, ఇంగ్లిష్ భాషల మీద పట్టు.

 వర్తమాన అంశాల మీద అవగాహన.

 డిగ్రీ ఉత్తీర్ణత.

 01.01.2014 నాటికి 30 ఏళ్లకు మించని వయసు.

 

 రెండు దశల్లో ఎంపిక:

 తొలిదశ: ఈ దశలో అభ్యర్థులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, వర్తమాన అంశాలపై ఆబ్జెక్టివ్, వ్యాసరూప ప్రశ్నలుంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది. నమూనా ప్రశ్నపత్రాలు

 www.sakshischoolofjournalism.com

 

 వెబ్‌సైట్‌లో ఉంటాయి.

 రెండో దశ: మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి మౌఖిక పరీక్షలు ఉంటాయి. వర్తమాన అంశాలపై లోతైన అవగాహన, భాషా నైపుణ్యాలను పరీక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పరీక్షలో నెగ్గిన అభ్యర్థులను సంస్థ నియమావళికి అనుగుణంగా శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.

 

 శిక్షణ భృతి:

 శిక్షణ దశలో తొలి ఆరునెలలు రూ.8 వేల చొప్పున, తర్వాతి ఆరు నెలలు రూ.10 వేల నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం ఏడాది పాటు ట్రైనీగా పనిచేయాలి. ఆ సమయంలో నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. ఆపై సబ్‌ఎడిటర్/ రిపోర్టర్, కాపీ ఎడిటర్, కంటెంట్ డెవలపర్‌గా నియమితులవుతారు. అప్పుడు ఆయా విభాగాల నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలుంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

 

 నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతో పాటు సాక్షిలో కనీసం నాలుగేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం సమర్పించాలి.

 

 దరఖాస్తు విధానం:

 www.sakshieducation.com

 లేదా

 www.sakshischoolofjournalism.com

 వెబ్‌సైట్‌లో దరఖాస్తులుంటాయి. అందులోని సూచనలను క్షుణ్ణంగా చదివి దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసి సబ్‌మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్‌లోడ్ చేయాలి.

 

 దరఖాస్తుకు గడువు:10.12.2013

 రాత పరీక్ష: 22.12.2013

 ఇంటర్వ్యూలు: 18.01.2014 నుంచి ప్రారంభం

 కోర్సు ప్రారంభం: 01.02.2014

 

 చిరునామా:

 ప్రిన్సిపల్,

 సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం

 6-3-249/1, సాక్షి టవర్స్,

 రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్,

 హైదరాబాద్-500034.

మరిన్ని వార్తలు