సీఎంఏ.. సర్వీసెస్ to సాఫ్ట్‌వేర్..

14 May, 2016 02:54 IST|Sakshi
సీఎంఏ.. సర్వీసెస్ to సాఫ్ట్‌వేర్..

గెస్ట్ కాలమ్
ఉజ్వల అవకాశాలకు అందిస్త్తున్న సేవరంగం నుంచి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థల వరకు అన్నింటా కాస్ట్ అండ్ అకౌంటెన్సీ విభాగానిది కీలకభూమిక.
విశ్లేషణా నైపుణ్యం, ప్రశ్నించే లక్షణం ఉన్న అభ్యర్థులు అకౌంటెన్సీ కోర్సుల్లో తేలిగ్గా విజయం సాధించొచ్చు అంటున్న..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా -హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, విజయ్ కిరణ్ అగస్త్యతో గెస్ట్ కాలం...
 
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ కోర్సులు క్లిష్టమైనవి! ఎంత చదివినా వీటిలో ఉత్తీర్ణత సాధించడం కష్టం! అనే అభిప్రాయాలు చాలా మంది విద్యార్థుల్లో ఉన్నాయి. ఇలాంటి భావనల వల్లే ఈ కోర్సుల్లో ప్రవేశించాలనే ఉత్సాహం ఉన్నవారు కూడా వెనకడుగు వేస్తున్నారు. భయాన్ని వీడి ముందడుగేస్తే..ఈ కోర్సుల్లో సులభంగా విజయం సాధించవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో ప్రవేశించవచ్చు. మూడు దశలుగా (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉండే ఈ  కోర్సు పూర్తిచేసిన వారికి కలర్‌ఫుల్ కెరీర్ ఆప్షన్లు ఖాయం.
 
ప్రొడక్షన్‌కే పరిమితం కాదు
గతంలో కాస్ట్ అకౌంటెంట్లకు ఉత్పత్తి సంస్థల్లో మాత్రమే అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.  బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, టెలికం, సాఫ్ట్‌వేర్, బీపీవో ఇలా ప్రతి రంగంలోనూ వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఈ కోర్సు పూర్తిచేసిన వారికి.. తక్కువ ఖర్చుతో సంస్థ కార్యకలాపాలను నిర్వహించే నైపుణ్యాలుంటాయని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తుండటమే. దీంతో ఆయా సంస్థలన్నీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించి, కొలువులను అందిస్తున్నాయి.
 
అంతర్జాతీయ గుర్తింపు
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ కోర్సు పూర్తిచేసి సభ్యత్వాన్ని సొంతం చేసుకున్న వారికి అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. అదే విధంగా వీరికి యూకేకు చెందిన కాస్ట్ అకౌంటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు సీఐఎంఏ, ఏసీసీఏలు  నిర్వహించే పరీక్షల్లో కొన్ని పేపర్లకు మినహాయింపు ఇస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే కామన్వెల్త్ దేశాలన్నింటిలోనూ ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది.
 
ఫస్ట్ అటెంప్ట్‌లోనే..
సీఎంఏ కోర్సు (మూడు దశలు)ను తొలి ప్రయత్నంలోనే పూర్తిచేయడం కష్టమనే అభిప్రాయం సరికాదు. ప్రాక్టికల్ అప్రోచ్, అనలిటికల్ థింకింగ్‌తో అంశాలను అధ్యయనం చేస్తే అన్ని దశలనూ తొలి ప్రయత్నంలోనే పూర్తి చేయొచ్చు.
 
‘ఫౌండేషన్’ నుంచే పునాదులు
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ కోర్సులో ఫౌండేషన్ స్థాయిలోనే ప్రవేశిస్తే విద్యార్థుల్లో బలమైన పునాది ఏర్పడుతుందని నేను భావిస్తాను. ఇంటర్/10+2 అర్హతతో ఫౌండేషన్ కోర్సు పరీక్షలు పూర్తిచేస్తే ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు డెరైక్ట్ ఎంట్రీ స్కీం కింద బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కానీ, ఈ రంగంపై నిజమైన ఆసక్తి ఉన్న వారు ఫౌండేషన్ నుంచే ఈ దిశగా అడుగులు వేయడం ప్రయోజనకరం.

ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు జూలై 31, జనవరి 31లోపు; నాలుగు సార్లు (మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహించే ఫౌండేషన్ పరీక్షలకు వరుసగా అక్టోబర్ 31, జనవరి 31, ఏప్రిల్ 30, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
వెబినార్స్, ఆన్‌లైన్ లెక్చర్స్

సీఎంఏ కోర్సు రెగ్యులర్ కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు వెబినార్స్ ద్వారా ఆన్‌లైన్ లెక్చర్స్, అదే విధంగా ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ సెషన్స్ అందుబాటులోకి తెచ్చాం.
 
ముఖ్యంగా కామర్స్ సంబంధిత ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నా పరంగా ఇచ్చే సలహా... ఒక సమస్యకు సంబంధించి ఎలా? అనే దృక్పథం నుంచి ఎందుకు? అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు? అనే ప్రశ్న తలెత్తినప్పుడే మనలో ఆ సమస్యను  పరిష్కరించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో అనేక  నైపుణ్యాలను అలవడుతాయి. అభ్యర్థులు ప్రారంభం నుంచే చదవడం, వ్యక్తీకరించడం, ప్రణాళిక- అమలు .. వంటి అంశాలను ఆచరణలో పెడితే విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకొని కలర్‌ఫుల్ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు