పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి..

11 Sep, 2014 03:49 IST|Sakshi
పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి..

పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఎనిమిది దేశాల కూటమిని జీ-8 (గ్రూప్ ఆఫ్ ఎయిట్) దేశాలని పిలుస్తారు. ఈ కూటమి 1975లో ఆరు దేశాలతో ఆవిర్భవించింది. అవి ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, యునెటైడ్ కింగ్‌డమ్, యునెటైడ్ స్టేట్స్. ఈ జీ6 దేశాల మొదటి సదస్సు ఫ్రాన్స్‌లో జరిగింది. ఇది 1976లో కెనడా చేరికతో జీ7గా మారింది. ఈ గ్రూపులో 1998లో రష్యా ఎనిమిదో సభ్య దేశంగా చేరింది. కూటమిలో ఐరోపా యూనియన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. క్రిమియాను తనలో అంతర్భాగం చేసుకున్నందుకుగాను 2014, మార్చి 24న రష్యాను కూటమి నుంచి సస్పెండ్ చేశారు. అందువల్ల ప్రస్తుతానికి ఇది జీ7 కూటమిగా ఉంది.
 
 కూటమి 40వ సదస్సు:
 కూటమి 40వ  సదస్సు రష్యాలోని సోచి నగరంలో జరగాలి. కానీ, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాను సస్పెండ్ చేయడంతో సదస్సు వేదికను బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు మార్చారు. ఇందులో రష్యా పాల్గొనలేదు కాబట్టి దీన్ని జీ7 సదస్సుగా పరిగణిస్తున్నారు. ఐరోపా యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. ఐరోపా యూనియన్ జీ8/జీ7 సదస్సుకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.
 
 సదస్సులో పాల్గొన్న నేతలు:
  స్టీఫెన్ హార్పర్- కెనడా ప్రధానమంత్రి
  ఫ్రాంకోయిస్ హాలండ్- ఫ్రాన్స్ అధ్యక్షుడు
  ఏంజెలా మెర్కల్- జర్మనీ చాన్స్‌లర్
  మాటియో రెంజీ- ఇటలీ ప్రధాని
  షింజో అబే- జపాన్ ప్రధాని
  డేవిడ్ కామెరాన్- బ్రిటిష్ ప్రధాని
  బరాక్ ఒబామా- అమెరికా అధ్యక్షుడు
  జోస్ మాన్యుల్ బరోసో- ఐరోపా కమిషన్ అధ్యక్షుడు
  హెర్మాన్ వాన్ రోంపీ- ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు
  ఈ సదస్సులో జీ-7 దేశాల నేతలు.. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని అతిక్రమిస్తున్నందుకు రష్యాను తీవ్రంగా విమర్శించారు. కూటమి 41వ సదస్సు 2015 జూన్‌లో జర్మనీలో జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు