కాలేజీ కుర్రకారుకు ‘ఆప్స్’ మిత్రులు!

16 Aug, 2014 23:54 IST|Sakshi
కాలేజీ కుర్రకారుకు ‘ఆప్స్’ మిత్రులు!

ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే రకరకాల ‘సెట్’లలో మంచి ర్యాంకు సాధించి, కోరుకున్న కాలేజీలో అడుగుపెడుతుంటారు విద్యార్థులు. చేరిన కోర్సు ఏదైనా, క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు మరెన్నో నైపుణ్యాలను అలవరచుకోవాలి. వీటితో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ, రోజువారీ ఖర్చులపై నియంత్రణ వంటివీ అవసరమే! ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే వారు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు రకరకాల మొబైల్ అప్లికేషన్స్ (ఆప్స్) చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. ఆప్తమిత్రులుగా మారుతున్నాయి.. ఒకప్పుడు మొబైల్ అంటే మాట ముచ్చట్లకే! కానీ, ఇప్పుడది ‘స్మార్ట్ ఫోన్’గా ముస్తాబై భిన్న అవసరాలను తీరుస్తూ యువత మనసులో చోటుసంపాదిస్తోంది. మొబైల్ ఫోన్లతో మైత్రీ బంధం పెంచుకొని, కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే రకరకాల మొబైల్ ఆప్స్ అందుబాటులోకి వస్తున్నాయి..
 
 మన పీఏ.. మన చేతిలో..
 రోజులో ఏ సమయానికి ఏది చదవాలి? తరగతిలో ఏ రోజు ఏం చెప్పారు? ఏ రోజు ఎక్కడికెళ్లాలి? రికార్డు రూపకల్పనకు అవసరమైన సరంజామా ఏమిటి? అవి ఎక్కడ దొరుకుతాయి? ఇలా రకరకాల పనుల్లో సహకరించి, విద్యార్థి జీవితం సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఆప్స్ మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇవి విద్యార్థికి వ్యక్తిగత సహాయకులుగా సేవలందిస్తున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, అవసరమైన సేవలు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి.
 మచ్చుకు కొన్ని ఆప్స్: Everynote, Colornote, Fancy Hands, Springpad.
 
 నైపుణ్యాలు పెంచుకో!
 కాలేజీ నుంచి బయటికొచ్చిన తర్వాత కెరీర్‌లో సుస్థిర స్థానం సంపాదించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అకడమిక్ స్కిల్స్ బాగున్నా.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్‌లో వెనక వరుసలో ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కమ్యూనికేషన్‌లో ఆంగ్ల భాష కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకుంటూ, పద సంపదపై పట్టు సాధించేందుకు ఉపయోగపడే అనేక ఆప్స్ అందుబాటులో వచ్చాయి. వీటితో పాటు ఉద్యోగ నియామకాల పరీక్షల్లో కీలక విభాగమైన రీజనింగ్‌ను ఒంటబట్టించుకునేందుకు ఉపయోగపడే ఆప్స్ కూడా ఉన్నాయి.
 Ex: Vocab Pro, Logical Test, Easy Vocab, Reasoning Refresher.
 
 ఖర్చులకు కళ్లెం!
 పైసా సంపాదించడం కంటే దాన్ని ఎలా వినియోగిం చారన్న దానిపైనే ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్‌మెంట్ సక్రమంగా లేకుంటే జీవితంలో పైకి ఎదగలేం! సంపాదన ఎంత? ఖర్చు చేస్తున్నది ఎంత? వీటి మధ్య సమన్వయం చాలా ముఖ్యం. సంపాదనకు, ఖర్చులకు పొంతన కుదిరేలా సరైన ప్రణాళికను రూపొందించుకునేందుకు ఉపయోగపడే ఆప్స్ చాలానే ఉన్నాయి. ఇవి అందుబాటులో ఉన్న డబ్బు; బట్టలు, ఆహారం, ప్రయాణం.. ఇలా రోజువారీ అవసరాలకు ఖర్చయ్యే మొత్తం, మిగి లిన మొత్తం.. తదితర వివరాలను సంగ్రహ పరి చేందుకు ఉపకరిస్తాయి. గ్రాఫ్స్ రూపంలో తేలి గ్గా అర్థమయ్యేలా చూపించి బడ్జెట్‌ను రూపొందించుకునేందుకు ఉపయోగపడతాయి.
 Ex: Track My Budget, My Budget Book, Pocket Budget
 
 సామాజిక అనుసంధానత
 విద్యార్థులకు ఉపయోగపడే సామాజిక అనుసంధాన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండటానికి ఉపయో గపడతాయి. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో పాటు టెక్ట్స్ మెసేజ్‌లు, ఫొటోలు పంపించేందుకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న ఓ ఐటీ విద్యార్థి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సందే హం తలెత్తితే ఢిల్లీలోని తన స్నేహితుడితో చాటింగ్ చేస్తూ నివృత్తి చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఉపయోగాలుంటాయి.
 Ex: Viber, Whatsapp, Hike, Skype, Wechat
 
 ఆరోగ్యమే మహా భాగ్యం
 పుస్తకాల ముందు కూర్చొని, గంటల తరబడి పూర్తిగా వాటికే అతుక్కుపోవడం వల్ల లాభం లేదు. రాత్రీపగలూ కష్టపడి చదివిన ఓ విద్యార్థి తీరా పరీక్షల సమయానికి అనారోగ్యానికి గురైతే పరిస్థితి? అందుకే విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటానికి సహకరించే ఆప్స్ చాలానే ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించేది పౌష్టికాహారం. తీసుకునే ఆహారంలో కేలరీలు, వ్యాయామం చేసిన సమయం, ఖర్చయిన కేలరీలు, నడిచిన దూరం.. ఇలాంటి విలువైన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని, విశ్లేషించి చూపే ఆప్స్ ఉన్నాయి.
 Ex: Map My Fitness, Calorie Counter, Cardio Trainer, Slice it.
 
 మొబైలే.. విద్యార్థులకు హ్యాండ్‌బుక్!
 శ్రీప్రపంచీకరణ నేపథ్యంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం కష్టమే. గతంలో సంభాషణకు మాత్రమే వినియోగించే మొబైల్ ఇప్పుడు స్టూడెంట్ కరదీపికగా మారుతోంది. పాటలు, ఆటలతో ఆగిపోకుండా విద్యార్థులకూ హ్యాండ్‌బుక్‌గా పనిచేస్తోంది. ఎన్నో ఎడ్యుకేషన్ అప్లికేషన్‌లు నిక్షిప్తం చేసుకుని విద్యార్థి లోకానికి విశేష సేవలందిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఆప్‌స్టోర్ తదితర ఆన్‌లైన్ స్టోర్‌లలో వివిధ రకాల ఆప్స్ కొలువుదీరాయి. క్విజ్ లు, మాక్‌టెస్ట్‌లు, డిక్షనరీలు, స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్ లెర్నింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌తోపాటు సాధారణ పోటీ పరీక్షల మెటీరియల్ నుంచి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ వరకు స్టడీ మెటీరియల్స్ పొందుపర్చిన అప్లికేషన్ల్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. సీ, సీ++, జావా తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లెర్నింగ్‌కు కూడా ప్రత్యేక ఆప్‌లు వెలిశాయి. స్టడీ మెటీరియల్‌కు సంబంధించి ప్రధానంగా మూడు రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది.
 
 అవి... టెక్ట్స్‌వల్, ఆడియో, వీడియో కంటెంట్. టెక్ట్స్‌వల్ మెటీరియల్ పొందుపర్చిన అప్లికేషన్ల ద్వారా పుస్తకాల్లో చూసినట్లుగా చదువుకోవచ్చు. ప్రొఫెసర్లు బోధించే పాఠాలను రికార్డ్ చేసి వాటిని ఆడియో రూపంలో అందించే ఆప్స్ కూడా ఉన్నాయి. అలాగే రికార్డెడ్ వీడియో లెక్చర్స్, ఆన్‌లైన్ లెక్చర్స్‌ను కూడా కొన్ని ఆప్స్ అందిస్తున్నాయి. ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లకు కూడా ప్రత్యేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. నిర్దిష్ట ప్రశ్నలతో పరీక్షలు రాస్తూ తప్పుగా సమాధానాలు రాసిన ప్రశ్నలకు అక్కడికక్కడే వివరణలు పొందొచ్చు. కొన్ని సంస్థలు మొబైల్ విధానంలోనూ ప్రాక్టీస్ కోసం ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నాయ్ణి
 - బి.వంశీకృష్ణారెడ్డి,
 సీఈఓ, బ్రేవ్‌మౌంట్ ఐటీ సొల్యూషన్స్, హైదరాబాద్

మరిన్ని వార్తలు