కాంపిటీటివ్‌ కౌన్సెలింగ్‌

25 Jan, 2017 04:45 IST|Sakshi

ఉద్యోగ నియామక పరీక్షలకు
కీలకమైన కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే ఏం చేయాలి?
– ఎం.రవికుమార్, విజయవాడ

ముందు అభ్యర్థి తాను రాయదలచుకున్న పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో గుర్తించడం ప్రధానం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించడానికి పత్రికలను ప్రాథమిక వనరులుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు పత్రికలను చదవాలి. ముఖ్యఅంశాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకోవాలి. వాటి నేపథ్య సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిట్ల రూపంలో వచ్చే ప్రశ్నలతోపాటు డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు కూడా సమర్థంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. వర్తమాన వ్యవహారాలపై అవగాహన లేకపోతే ఎస్సేతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాల నుంచి వచ్చే డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వలేం.
n కరెంట్‌ అఫైర్స్‌ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్‌ అఫైర్స్‌ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్‌ అవసరం. పత్రికలతోపాటు ఒక ప్రామాణిక కరెంట్‌ అఫైర్స్‌ మ్యాగజైన్‌ చదివితే మంచిది.

n పత్రికలను చదవడం వల్ల కరెంట్‌ అఫైర్స్‌పై పట్టుతోపాటు వివిధ రంగాల
(ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)కు సంబంధించిన పదజాలంపై అవగాహన ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్‌ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలపై గ్రూప్‌ డిస్కషన్‌ వల్ల కూడా ప్రయోజనం ఎక్కువ.

మరిన్ని వార్తలు