వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు

20 Mar, 2014 15:34 IST|Sakshi

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి

కరెంట్ అఫైర్స్ నిపుణులు

 

జాతీయం

 ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేయాలన్న సుప్రీం

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మార్చి 10న కిందిస్థాయి కోర్టులను ఆదేశించింది. అభియోగాలు నమోదైన సంవత్సరంలోగా విచారణ ముగించాలని పేర్కొంది. ఏడాదిలోగా విచారణ పూర్తికాకపోతే దిగువ కోర్టులు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. విచారణలో జాప్యం వల్ల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు తమ పదవుల్లో కొనసాగుతున్నారని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

 

 డ్రాపౌట్ల సంఖ్య 8 కోట్లు

 భారత్‌లో ప్రాథమిక విద్య పూర్తికాక ముందే బడి మానే స్తున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని యూనిసెఫ్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పిల్లలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే స్కూలు డ్రాపౌట్లుగా మారారని తెలిపారు. ప్రాథమిక విద్య (ఎనిమిదో తరగతి వరకూ) పూర్తి కాకుండానే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందన్నారు.

 

 

 10వ యంగ్ ఇండియన్ సదస్సు

 10వ యంగ్ ఇండియన్ సదస్సు న్యూఢిల్లీలో మార్చి 15న ప్రారంభమైంది. ‘ఇండియా-ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే ఇతివృత్తంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కు చెందిన యంగ్ ఇండియన్స్ (వైఐ) సంస్థ ఈ సదస్సును నిర్వహించింది.

 

విద్వేషం చిమ్మే నేతలను బుక్ చేయండి: సుప్రీం

 కులం, మతం, ప్రాంతం, జాతి ఆధారంగా నేతలు చేసే విద్వేష ప్రసంగాలు సమాజానికి విఘాతకరమని.. అలాంటి ప్రసంగాలు చేసే రాజ కీయ, సంఘ, మత సంస్థల నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు లేదా నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే... ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలా? అన్న అంశాన్ని పరిశీలించాలని

 లా కమిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది. నేతల విద్వేష ప్రసంగాలు ప్రజస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ భలాయ్ సంఘటన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మార్చి 12న విచారించింది.

 

 ఎన్నికల్లో నల్లధనం నియంత్రణకు ‘గ్రిడ్’

 రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్లధనాన్ని నియంత్రించడంలో భాగంగా రెవెన్యూ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక నిఘా వ్యవస్థ(గ్రిడ్)ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ఇది ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేస్తుంది. తద్వారా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో తోడ్పడుతుంది.

 

యూఐడీఏఐకి నిలేకని రాజీనామా

 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ పదవికి నందన్ నిలేకని మార్చి 13న రాజీనామా చేశారు. యూఐడీఏఐ చైర్మన్‌గా నిలేకని 2009 జూన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశారు.

 

అంతర్జాతీయం

 దేవయానిపై అభియోగాల కొట్టివేత

 భారత దౌత్యవేత్త దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు మార్చి 12న కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్  తీర్పు ఇచ్చారు. 

 

 దేవయానిపై మార్చి 15 అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. దేవయాని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

 

రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంలో భారత్‌కు 73వ స్థానం

 రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో 73వ స్థానంలో నిలిచింది. ‘ద ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ మ్యాప్-2014’ అనే పేరుతో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ ఉమెన్ సంస్థలు మార్చి 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

 

 ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం విషయంలో నికరాగువా మొదటి స్థానంలో నిలిచింది. స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళ పార్లమెంటేరియన్ల శాతం 21.8గా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో పార్లమెంటరీ లేదా మంత్రిత్వ పదవుల్లో 9 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు హైతీ, రువాండా, కాంగో, ఛాద్, జాంబియాలు భారత్ కంటే మెరగైన స్థానాల్లో ఉన్నాయి.

 

స్వాతంత్య్రం ప్రకటించుకున్న క్రిమియా

 ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగునే ఉన్న రష్యాలో చేరేందుకు అంగీకరించాలని ఆ దేశాన్ని కోరింది. ‘‘క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నింటికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను రష్యా సమాఖ్యలో సభ్యురాలిగా చేర్చుకోవాలని ఆ దేశాన్ని క్రిమియా రిపబ్లిక్ కోరుతోంది’’ అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు ఆమోదించింది.

 

 ఉక్రెయిన్‌లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో.. స్వయం ప్రతిపత్తి గల క్రిమియా తాను ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? లేక ఆ దేశం నుంచి విడిపోయి రష్యాలో చేరాలా? అనే అంశంపై మార్చి 16న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది ఉక్రెయిన్ నుంచి వేరుపడి రష్యాలో చేరాలని తీర్పుచెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ ప్రకటించారు. మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి (జీఎంటీ + 4, ప్రస్తుత క్రిమియా కాలమానం కంటే రెండు గంటలు ముందుకు) మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ అక్సియోనోవ్ పేర్కొన్నారు.

 

 ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్

 ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు.

 

 ఆయుధాల దిగుమతుల్లో భారత్ టాప్

 ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కంటే ముందుంది. ఆ దేశాల కంటే మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

 

 ఈ నివేదిక ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. భారత్ తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కంటే ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని సిప్రి ప్రస్తావించింది.

 

 వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు

వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఇంటర్‌నెట్‌లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్‌పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్‌నెట్ కారణమైనా.. దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్‌లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది.

 

 

 క్రీడలు

 ఇండియన్ వెల్స్ విజేత జొకోవిచ్

 ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమెరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

 

 విజయ్ హజారే విజేత కర్ణాటక

 దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. మార్చి 16న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో రైల్వేస్‌ను ఓడించింది. ఈ విజయంతో కర్ణాటక ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీలలో విజేతగా నిలిచింది.

 

 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్

 ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. మాగ్నుసన్ (మెక్‌లారెన్) రెండో స్థానంలో నిలిచాడు. ఇదే రేసులో ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్‌గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు.

 

 హాకీ జూనియర్ ఉమెన్‌‌స చాంపియన్‌షిప్

 హాకీ ఇండియా జూనియర్ ఉమెన్‌‌స చాంపియన్‌షిప్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకుంది. మైసూర్‌లో మార్చి 13న జరిగిన ఫైనల్లో కేరళను ఓడించింది.

 

 క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్ సచిన్

 భారత మాజీ ఆటగాడు, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డుకు ఈఎస్‌పీఎన్-క్రిక్ ఇన్ఫో సంస్థ ఎంపిక చేసింది.

  

 ఇతర అవార్డుల విజేతలు:

 టెస్టు బ్యాటింగ్ అవార్డు: శిఖర్ ధావన్ (ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 187 పరుగుల ఇన్నింగ్స్) వన్డే బ్యాటింగ్ అవార్డు: రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ); తొలి ఏడాది అత్యుత్తమ ప్రదర్శన అవార్డు: షమీ (2013లో టెస్టులు, వన్డేలు కలిపి 47 వికెట్లు); ఉత్తమ టెస్టు బౌలింగ్ అవార్డు: మిచెల్ జాన్సన్ (7/40, ఇంగ్లండ్‌పై); ఉత్తమ వన్డే బౌలింగ్ అవార్డు: షాహిద్ ఆఫ్రిది (7/12, వెస్టిండీస్‌పై).

 

అవార్డులు

 జ్ఞాన్ కొర్రేకు గొల్లపూడి అవార్డు

 గొల్లపూడి శ్రీనివాస్ (జీఎస్) మెమోరియల్ ఫౌండేషన్ అందజేసే జీఎస్ జాతీయ అవార్డు- 2013కు దర్శకుడు జ్ఞాన్ కొర్రే ఎంపికయ్యారు. గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’కు దర్శకత్వం వహించినందుకుగాను కొర్రేను ఈ పురస్కారం వరించింది.

 

భారతీయ అమెరికన్ విద్యార్థులకు ఇంటెల్ అవార్డులు

 ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆనంద్ శ్రీనివాసన్(17), శౌన్ దత్తా(18) మార్చి 12న ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను వీరిద్దరూ కైవసం చేసుకున్నారు.

 

 అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్‌ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్‌వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు.

 

 నలిమెల భాస్కర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు

 ప్రముఖ కవి, భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ‘అనువాద సాహిత్యం’లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శిలగళ్’ నవలను ‘స్మారక శిలలు’ పేరుతో 2010లో భాస్కర్ తెలుగులోకి అనువదించారు. అవార్డు కింద రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని 1989 నుంచి 24 భాషల్లోని అత్యున్నత అనువాదాలకు అందజేస్తోంది.

 

 టోమస్ హలిక్‌కు టెంపుల్‌టన్ ప్రైజ్

 చెక్‌కు చెందిన మతగురువు, మేధావి టోమస్ హలిక్‌కు 2014 టెంపుల్‌టన్ ప్రైజ్ లభించింది. పురస్కారాన్ని అందజేసే జాన్ టెంపుల్‌టన్ ఫౌండేషన్ మార్చి 13న ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డు కింద 1.1 మిలియన్ పౌండ్లు బహూకరిస్తారు.

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా