గ్రూపులో సాధారణంగా పెరిగే ధర్మాలు ఏవి?

12 Aug, 2014 22:40 IST|Sakshi
గ్రూపులో సాధారణంగా పెరిగే ధర్మాలు ఏవి?

రసాయన శాస్త్రం: మూలకాల వర్గీకరణ - ఆవర్తన ధర్మాలు
అసంఖ్యాకంగా ఉన్న మూలకాల ధర్మాలను అర్థం చేసుకోవడానికి వాటి వర్గీకరణ చాలా అవసరం. ఈ దిశగా చేసిన ప్రయత్నాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ‘డాబర్ నీర్ త్రికసిద్ధాంతం’. దీని ప్రకారం మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు త్రికంలోని మధ్య మూలకం పరమాణుభారం మొదటి, మూడో మూలకాల పరమాణు భారాల సగటుకు దాదాపుగా సమానం.
 డాబర్‌నీర్ త్రికాలకు ఉదాహరణలు:
     క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ (Cl, Br, I)
     లిథియం,సోడియం,పొటాషియం(Li, Na, K)
     ఐరన్, కోబాల్ట్, నికెల్ (Fe, Co, Ni)
 న్యూలాండ్, మెండలీఫ్ కూడా మూలకాలను వాటి పరమాణుభారాల ఆరోహణ క్రమంలో వర్గీకరించారు.
 న్యూలాండ్ మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ప్రతి 8వ మూలకం, మొదటి మూలక ధర్మాన్ని పోలి ఉండటాన్ని గమనించి, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్నే ‘న్యూలాండ్ అష్టక సిద్ధాంతం’ అంటారు. దీన్ని భారతీయ సంగీతంలోని స్వరాలు ‘స రి గ మ ప ద ని స’లతో పోల్చవచ్చు.
 మెండలీఫ్ పూర్తిస్థాయిలో, క్రమ పద్ధతిలో వర్గీకరణ చేశాడు. ఇతడు మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అనే ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించాడు. పరమాణు భారాలను నిర్ణయించే సరైన పద్ధతులు లేనప్పటికీ కొన్ని మూలకాల ఉనికిని, వాటి ధర్మాలను ఊహించగలగడం మెండలీఫ్ గొప్పదనం. ఉదాహరణకు  పరమాణుభారం 68 ఉన్న మూలకాన్ని ఊహించి, దానికి  ‘ఎకా అల్యూమినియం’ అని పేరు పెట్టాడు. 1875లో డెబోస్పాడ్రన్ ఈ మూలకాన్ని కనుగొని ‘గాలియం’ అని పేరు పెట్టాడు. అదేవిధంగా పరమాణు భారం 44 ఉన్న మూలకాన్ని ఊహించి, ‘ఎకా బోరాన్’గా నామకరణం చేయగా,  దీన్ని నిల్సన్ కనుగొని ‘స్కాండియం’ అని పేరు పెట్టాడు.
 మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు అని మోస్లే ప్రతిపాదించాడు. ప్రస్తుతం వినియోగిస్తున్న విస్తృత ఆవర్తన పట్టిక లేదా ఆధునిక ఆవర్తన పట్టికను ఈ ఆవర్తన నియమం ఆధారంగానే రూపొందించారు.
 -    ఆవర్తన పట్టికలోని నిలువు వరుసలను  గ్రూపులుగా, అడ్డు వరుసలను పీరియడ్‌లుగా వ్యవహరిస్తారు.
 -    సుమారు 117 మూలకాలను 7 పీరియడ్‌లు, 16 గ్రూపులుగా విభజించారు.
 -    మొదటి పీరియడ్ అతి చిన్న పీరియడ్. దీనిలో  హైడ్రోజన్,  హీలియం అనే రెండు మూలకాలు మాత్రమే ఉన్నాయి. హైడ్రోజన్ పట్టికలోని మొదటి మూలకం. ఇది అత్యంత తేలికైంది.
 -    అత్యంత పొడవైన పీరియడ్ 6వది. దీంట్లో 32 మూలకాలున్నాయి.
 -    7వది అసంపూర్తి పీరియడ్.
 -    {పతి పీరియడ్ జడవాయువుతో అంతమవుతుంది.
 అవి: హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), క్జినాన్ (Xe), రెడాన్ (Rn)
 సాధారణంగా ఆవర్తన పట్టికలో ఎడమవైపు లోహాలు, కుడివైపు అలోహాలుంటాయి.
 ఆవర్తన ధర్మాలు: ఒక నిర్దిష్ట వ్యవధిలో పునరావృతమయ్యే ధర్మాలను ఆవర్తన ధర్మాలు అంటారు. అవి:  పరమాణు పరిమాణం
     రుణ విద్యుదాత్మకత
     ఎలక్ట్రాన్ అఫినిటీ
     అయనీకరణ శక్మం
     ధన విద్యుదాత్మకత
 పరమాణు పరిమాణం: కేంద్రకం నుంచి బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్ మేఘం వరకు ఉన్న మధ్య దూరాన్ని పరమాణు పరిమాణం అంటారు. దీన్ని అంగ్‌స్ట్రామ్ యూనిట్లలో కొలుస్తారు.
 -    పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి  కేంద్రకావేశం పెరగడం వల్ల పరమాణు పరిమాణం తగ్గుతుంది.
 -    గ్రూపులో పై నుంచి కిందికి కక్ష్యల సంఖ్య పెరగడం కారణంగా (ఉల్లిగడ్డపై పొరలు పెరిగినట్లు) పరమాణు పరిమాణం పెరుగుతుంది.
 రుణ విద్యుదాత్మకత (ఎలక్ట్రో నెగెటివిటీ): బంధంలోని పరమాణువు ఎలక్ట్రాన్ జంటను తనవైపు ఆకర్షించుకునే స్వభావాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు.
 -    రుణ విద్యుదాత్మకతను పౌలింగ్ స్కేలు ద్వారా కొలుస్తారు.
 -    పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది.
 -    గ్రూపులో పై నుంచి కిందికి రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది.
 -    రుణ విద్యుదాత్మకత గరిష్టంగా ఫ్లోరిన్‌కు, కనిష్టంగా సీజియంకు ఉంటుంది.
 -    రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకాలు ఎలక్ట్రాన్‌లను గ్రహించి ‘రుణ అయాన్‌లు లేదా ఆనయాన్’లను ఏర్పరుస్తాయి.
 అయనీకరణ శక్మం: వాయుస్థితిలోని పరమాణు బాహ్య ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన కనీస శక్తిని ‘అయనీకరణ శక్మం’ అంటారు. దీని ప్రమాణం ఎలక్ట్రాన్ వోల్ట్.
 -    సాధారణంగా పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి అయనీకరణ శక్మం పెరుగుతుంది. (కొన్ని మినహాయింపులుంటాయి)
 -    గ్రూపులో పై నుంచి కిందికి అయనీకరణ శక్మం తగ్గుతుంది. సాధారణంగా లోహాలకు అత్యల్ప అయనీకరణ శక్మం ఉంటుంది.
 ఎలక్ట్రాన్ అఫినిటీ: వాయుస్థితిలో ఉన్న పరమాణు బాహ్య ఆర్బిటాల్‌లో ఒక ఎలక్ట్రాన్‌ను చేర్చినప్పుడు వెలువడే శక్తినే ‘ఎలక్ట్రాన్ అఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్ఫీ’ అంటారు.
 -    గ్రూపులో పై నుంచి కిందికి ఎలక్ట్రాన్ అఫినిటీ తగ్గుతుంది. పీరియడ్‌లో పెరుగుతుంది (కొన్ని మినహాయింపులుంటాయి)
 -    ఆవర్తన పట్టికలో గరిష్ట ఎలక్ట్రాన్ అఫినిటీ ఉన్న మూలకం క్లోరిన్.
 ధన విద్యుదాత్మకత: ఎలక్ట్రాన్‌లను కోల్పోయే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత అంటారు.
 -    సాధారణంగా లోహాలకు ధన విద్యుదాత్మకత ఎక్కువగా ఉంటుంది.
 -    పరమాణువులు ఎలక్ట్రాన్‌లను కోల్పోయి ‘ధనాత్మక అయాన్‌లు లేదా కేటయాన్’లుగా మారతాయి.
 ఆక్సీకరణ, క్షయకరణ ధర్మాలు:
 -    ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలపడం లేదా హైడ్రోజన్‌ను తీసివేయడం లేదా పరమాణువు నుంచి ఎలక్ట్రాన్‌లను తీసివేయడాన్ని ‘ఆక్సీకరణం’ అంటారు.
 -    ఒక సమ్మేళనానికి హైడ్రోజన్‌ను కలపడం లేదా ఆక్సీజన్‌ను తీసివేయడం లేదా పరమాణువులకు ఎలక్ట్రాన్‌లను కలపడాన్ని ‘క్షయకరణం’ అంటారు.
 -    ఆవర్తన పట్టికలో ఎడమవైపున్న మూలకాలు లేదా లోహాలు బలమైన క్షయకరణులుగా పని చేస్తాయి ఉదా: సీజియం, పొటాషియం. గ్రూపులో ఈ ధర్మం పెరుగుతుంది, పీరియడ్‌లో తగ్గుతుంది.
 కార్బన్ మోనాక్సైడ్ (CO), కోక్ లాంటివి కూడా బలమైన క్షయకరణులుగా పని చేస్తాయి. ఇవి లోహశాస్త్రంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆక్సీకరణ ధర్మం గ్రూపులో తగ్గుతుంది, పీరియడ్‌లో పెరుగుతుంది. ఆవర్తన పట్టికలో కుడివైపున ఉన్న  మూలకాలు (జడవాయువులు మినహా) బలమైన ఆక్సీకరణులు.
 ఉదా: హాలోజన్‌లు (ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్).
 
 మాదిరి ప్రశ్నలు
 1.మెండలీఫ్ ఆవర్తన పట్టికను దేని ఆధారంగా రూపొందించాడు?
     1) పరమాణు భారం
     2) పరమాణు సైజు
     3) పరమాణు సంఖ్య
     4) పరమాణు ఘన పరిమాణం
 
 2.    సరైన వాక్యాలను గుర్తించండి.
     ఎ. మూలకాలను మొదటిసారిగా వర్గీకరించింది డాబర్‌నీర్
     బి. పరమాణు సైజు ప్రమాణం అంగ్ స్ట్రామ్
     సి. ఎకా అల్యూమినియంకు గాలియం అని పేరు పెట్టారు
 
     డి. విస్తృత లేదా ఆధునిక ఆవర్తన పట్టికను పరమాణు సంఖ్య ఆధారంగా రూపొం దించారు.
     1) ఎ, బి మాత్రమే    2) బి, సి మాత్రమే
     3) ఎ, బి, సి మాత్రమే 4) ఎ, బి, సి, డి
 
 3.    గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం?
     1) తగ్గుతుంది    2) పెరుగుతుంది
     3) మారదు    
     4) మొదట పెరిగి, తర్వాత తగ్గుతుంది
 
 4.    స్కాండియంను కనుగొన్నది?
     1) డెబోస్పాడ్రన్    2) నీల్సన్
     3) డాబర్‌నీర్    4) లోథర్ మేయర్
 
 5.    సరైన వాక్యాలు గుర్తించండి.
     ఎ. ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ కలపడాన్ని క్షయకరణమంటారు
     బి. లోహాలు బలమైన క్షయకరణులు
     సి.గ్రూపులో క్షయకరణ ధర్మం పెరుగుతుంది
     1) ఎ, బి మాత్రమే    2) బి, సి మాత్రమే
     3) ఎ, బి, సి    
     4) ఏదీకాదు
 
 6.    నిశ్చితవాక్యం (A): ఆవర్తన పట్టికలో రసాయన మూలకాల ఎలక్ట్రాన్ అఫినిటీ ఎల్లప్పుడూ  పై నుంచి కిందికి పెరుగుతుంది.
     కారణం(R): పరమాణు వ్యాసార్ధం సాధారణంగా పై నుంచి కిందికి పెరుగుతుంది.
     1) అ, ఖ సరైనవి. R, A కు సరైన వివరణ.
     2) అ, ఖ సరైనవి. R, A కు సరైన వివరణ  కాదు.
     3) అ సరైంది, R  సరైంది కాదు
     4) అ  సరైంది కాదు, R  సరైంది
 
 7.    సాధారణంగా ఒక ఎలక్ట్రోనెగెటివ్ మూలకం పరమాణువు అయాన్  అయితే?
     1) అది ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లను కోల్పోతుంది
     2) అది అయనీకరణం చెందుతుంది
     3) దాని పరమాణు సంఖ్య పెరుగుతుంది
     4) దాని ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది
 
 8.     సరైన వాక్యాన్ని గుర్తించండి.
     ఎ. ఒక పరమాణువు ఎలక్ట్రాన్‌లను గ్రహించినప్పుడు ఏర్పడే రుణ అయాన్ సైజు పెరుగుతుంది.
     బి. ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయి అయనీకరణం చెందినప్పుడు దాని పరిమాణం తగ్గుతుంది.
     సి. పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించినా లేదా కోల్పోయినా దాని పరిమాణం మారదు
     డి. లోహాలకు ఎలక్ట్రాన్‌లను గ్రహించే స్వభావం అధికంగా ఉంటుంది.
     1) సి మాత్రమే    2) సి, డి మాత్రమే
     3) ఎ, బి, సి మాత్రమే    
     4) ఎ, బి, సి, డి
 
 9. గ్రూపులో సాధారణంగా పెరిగే ధర్మాలు ఏవి?
     ఎ) పరమాణు పరిమాణం
     బి) లోహ స్వభావం
     సి) ఎలక్ట్రో నెగెటివిటి
     డి) అయనీకరణ శక్మం
     1) ఎ, బి        2) బి, సి
     3) సి, డి                4) బి, సి, డి
 
 సమాధానాలు:
     1) 1; 2) 4; 3) 2; 4) 2; 5) 3; 6) 4; 7) 4; 8) 3; 9) 1.

మరిన్ని వార్తలు