అవకాశాలకు ఆయువుపట్టు.. కంప్యూటర్ సైన్స్

16 Aug, 2014 00:05 IST|Sakshi
అవకాశాలకు ఆయువుపట్టు.. కంప్యూటర్ సైన్స్

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
కంప్యూటరీకరణ నిత్య జీవన ప్రక్రియలో ఓ భాగంగా మారింది. పాత విధానాలను ఆధునికీకరించడం ఎంత ముఖ్యమో.. అన్ని విభాగాల్లో  కంప్యూటరీకరణ అంతే ప్రధానం. అభివృద్ధిలో భాగంగా వైఫై, ఆఫీస్ ఆటోమేషన్ సేవలు విస్తృతమవుతున్న తరుణంలో సంబంధిత సాంకేతిక నిపుణుల అవసరమూ ఏర్పడుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రంగం నిపుణులకు పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి.
 
 మనోజ్ కుమార్... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో జరిగిన ఇంటర్వ్యూలోనే ఓ మల్టినేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. ఆశించిన ఉద్యోగం.. ఆకర్షణీ యమైన వేతనం సొంతం చేసుకున్నాడు. ‘మొదట్నుంచీ నాకు కంప్యూటర్లు, టెక్నాలజీ అంటే ఎంతో ఆసక్తి. కెరీర్‌లో త్వరగా స్ధిరపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌ను ఎంచుకు న్నాను.’ అంటున్న మనోజ్... తెలుగు మీడియం నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో కష్టపడి చదివి నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే కొలువును సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఆసక్తి, అభిరుచికి తగిన కోర్సును ఎంచుకుంటే కెరీర్‌లో సులభంగా రాణించ డానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీపై ఆసక్తి, నైపుణ్యాలు ఉన్నవారికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సరైన బ్రాంచ్.
 
 ప్రవేశం:
 బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీతోపాటు బిట్స్ తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధిత ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాలి.
 
 ఏం చదువుతారు?
 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ప్రధానంగా విద్యార్థులు  కంప్యూటర్‌కు సంబంధించిన భాగాలు, వాటి పనితీరు మొదలు సి, సి++, జావా తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, క ంప్యూటర్ నెట్‌వర్క్స్ వరకూ.. అన్ని రకాల సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అంశాలను అధ్యయనం చేస్తారు. ‘అన్ని యూనివర్సిటీలు.. కోర్సు కాలంలో విద్యార్థి సాధించాల్సిన అన్ని నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కరిక్యులంను రూపొందిస్తాయి. తరగతి గదిలో చెప్పే అంశాలను క్షుణ్నంగా నేర్చుకుంటే కోచింగ్ సెంటర్లకు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు’ అని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.వెంకట్ దాస్ సూచిస్తున్నారు. కొందరు విద్యార్థులు యాడ్‌ఆన్ కోర్సులకు అధిక ప్రాధాన్యతనిస్తూ బీఈ/బీటెక్ కరిక్యులంను అశ్రద్ధ చేయడమే కాకుండా తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సమయాన్ని వృథా చేసుకోవద్దు. కరిక్యులానికి అనుగుణంగా ఉన్న పుస్తకంలోని మొదటి చాప్టర్ నుంచి చివరి అధ్యాయం వరకు అన్ని అంశాలపై గట్టి పట్టు సాధించాలి. విద్యార్థులు.. ముఖ్యంగా గ్రామీణ  నేపథ్యం ఉన్నవారు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరచుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు’ అంటూ వెంకట్ దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.   
 
 కావాల్సిన స్కిల్స్:
 సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటే ఆ రంగంలో పనిచేయాలనుకునేవారు/ పనిచేస్తున్నవారు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి.
 టె క్నాలజీతో ఎక్కువ సమయం పనిచేయూల్సి ఉంటుంది. చిన్నపాటి పొరపాట్లకు ఎక్కువ సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లో సమయ పాలన చాలా ముఖ్యం. కాబట్టి సూక్ష్మ పరిశీలనా నైపుణ్యాలుండాలి. ప్రతి అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయూలి. నిర్దేశిత ఔట్‌పుట్ వచ్చేంత వరకు లేదా అప్పగించిన పని పూర్తయ్యేంతవరకు ఓర్పు, సహనంతో పనిచేయగలగాలి.
 
 ఉన్నత విద్య:
 కంప్యూటర్స్‌లో బీఈ/బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలూ విస్తృతమే. పీజీ స్థాయిలో     మాస్టర్ ఇన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ వంటి టెక్నికల్ కోర్సుల్లో ఎంచుకున్న సబ్జెక్టులో నైపుణ్యాన్ని సాధించొచ్చు. ఐఐటీల్లో నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశమూ ఉంది. ఉన్నత అవకాశాల కోసం విదేశాల్లో ఎంఎస్ చేయొచ్చు.
 
 క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు/ఉద్యోగాలు    
 కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు దేశ, విదేశాల్లో మంచి అవకా శాలున్నాయి. మెకానికల్, సివిల్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆధారిత కంపెనీలు కూడా టెక్నాలజీ విభాగంలో పనిచేయడానికి సీఎస్‌ఈ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ‘ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం తదితర సాఫ్ట్‌వేర్ కంపెనీలు అత్యధిక వేతనాలతో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీలు రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఫ్యాకల్టీగా స్థిరపడాలనుకునే వారికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి’ అని వెంకట్ దాస్ వివరించారు.

>
మరిన్ని వార్తలు