ఎన్‌పీటీఐ ఆఫర్ చేస్తున్న కోర్సులేవి?

28 Nov, 2013 14:26 IST|Sakshi

 బీమా (Insurance) సంబంధిత కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలపగలరు?

 - శశాంక్, నిర్మల్.

 చాలా సంస్థలు బీమాకు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. బీమా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలపై ఈ కోర్సులు దృష్టిసారిస్తున్నాయి. యాక్చూరియల్ సైన్స్.. బీమా వ్యాపారానికి ఆధారమైనది. ఇది ఇన్సూరెన్స్ రిస్క్స్, ప్రీమియంలకు సంబంధించిన గణాంకాలను వివరిస్తుంది. బీమా పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికల విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు యాక్చూరియల్ సైన్స్ ఉపయోగపడుతుంది.

 

 కోర్సుల వివరాలు:

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్.. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌ల్లో ది ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తోంది. ఏ గ్రూపులోనైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారితో పాటు సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు. ఈ సంస్థ యాక్చూరియల్ సైన్స్‌లో పీజీ డిప్లొమాను కూడా అందుబాటులో ఉంచింది.

 వెబ్‌సైట్: www.iirmworld.org.in

 యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.. ఎంఎస్సీ యాక్చూరియల్ సైన్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో చేరేందుకు మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.

 వెబ్‌సైట్: www.unom.ac.in

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, హైదరాబాద్.. ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది.

 వెబ్‌సైట్: www.ipeindia.org

 అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ యాక్చూరియల్ సైన్స్, నోయిడా.. ఎంబీఏ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. 

 వెబ్‌సైట్: www.amity.edu

 కెరీర్: కోర్సులు పూర్తిచేసిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టన్సీలు తదితరాల్లో అవకాశాలుంటాయి.

 

 నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సులేవి?    

  - శ్రీకాంత్, కాకినాడ.

 నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ), ఫరీదాబాద్.. విద్యుత్ రంగంలో శిక్షణ, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి దేశంలో అత్యున్నత సంస్థ.

 

 కోర్సుల వివరాలు:

 బీటెక్/బీఈ (పవర్ ఇంజనీరింగ్): కోర్సులో ప్రవేశానికి 10+2 పూర్తిచేసి ఉండాలి. ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా పూర్తిచేసిన వారికి ఆరు సీట్లు కేటాయించారు. వీరికి గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ ద్వారా నేరుగా కోర్సు మూడో సెమిస్టర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

 ఎంబీఏ (పవర్ మేనేజ్‌మెంట్): కోర్సులో ప్రవేశానికి బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)ను 60 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి. క్యాట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 ఎన్‌పీటీఐ- ఇతర కోర్సులు: పీజీ డిప్లొమా- థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్; పీజీ డిప్లొమా ఇంజనీర్స్ కోర్సు-హైడ్రో; పోస్ట్ డిప్లొమా కోర్సు-థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్; సర్టిఫికెట్ కోర్సు-పవర్ డిస్ట్రిబ్యూషన్.

 వెబ్‌సైట్: www.npti.in

 

 నాకు పక్షులంటే ఆసక్తి. ఆర్నిథాలజిస్ట్ కెరీర్‌ను ఎంపిక చేసుకుందామనుకుంటున్నాను.. వివరాలు తెలియజేయండి?

 - శ్రవణ్, నిజామాబాద్.

 ఆర్నిథాలజీ.. పక్షుల ప్రవర్తన, వర్గీకరణ, ఫిజియాలజీ, ఎకాలజీ వంటి అంశాలను వివరిస్తుంది. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకుంటే బయాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ, జువాలజీ వంటి కోర్సులు చేసుండాలి. అకడమిక్ అర్హతలతో పాటు పక్షులపై అమితమైన ప్రేమ, ఎక్కువ గంటల పాటు పనిచేయగల ఓర్పు, పరిశోధనలపై ఆసక్తి, ఆత్మ ప్రేరణ అవసరం.

 

 కోర్సులు:

 సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ, తమిళనాడు.. ఆర్నిథాలజీలో పరిశోధనలు చేస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్థాయిలో ఆర్నిథాలజీ, నేచురల్ హిస్టరీ కోర్సులను అందిస్తోంది.

 వెబ్‌సైట్: www.sacon.in

 

 కెరీర్: కోర్సులు పూర్తిచేసిన వారికి జంతు ప్రదర్శనశాలలు, శాంక్చురీలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. వైల్డ్‌లైఫ్ బయాలజిస్టులు, ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్స్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేటర్స్, ఎకాలజిస్టులు వంటి హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

 

 

 పీజీ స్థాయిలో సోషియాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?

 - క్రాంతి, విజయవాడ

 

 వివిధ వృత్తుల్లో ప్రవేశించేందుకు లిబరల్ ఆర్ట్స్ కోర్సులు దారి చూపుతాయి. సోషియాలజీ అనేది లిబరల్ ఆర్ట్స్‌కు చెందిన ఒక సబ్జెక్టు. ఇది సామాజిక జీవితంలో మనుషుల ప్రవర్తనను వివరిస్తుంది. సమాజంలో ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్స్ నిర్మాణానికి, నిర్వహణకు ప్రాధాన్యమిస్తుంది.

 కోర్సుల వివరాలు:

 ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఏ-సోషియాలజీ కోర్సును అందిస్తోంది. అర్హత: బీఏ/బీఎస్సీ/బీకాంను 40 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.osmania.ac.in

 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఎంఏ సోషియాలజీని ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఏ/బీకాం/బీఎస్సీ/బీఎస్సీ హోంసైన్స్/బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ నర్సింగ్/ బీబీఎం/ బీసీఏ లేదా బీఏఎల్.

 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఎంఏ సోషియాలజీని అందిస్తోంది. అర్హత: గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.svuniversity.ac.in

 కెరీర్: కోర్సులు పూర్తిచేసిన వారికి అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, పబ్లిషింగ్, జర్నలిజం వంటి రంగాల్లో అవకాశాలుంటాయి. విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

 

టి. మురళీధరన్

 టి.ఎం.ఐ. నెట్‌వర్క్

 

మరిన్ని వార్తలు