ప్రతిభావంతులను శోధించే..సీఎస్‌ఐఆర్-నెట్

31 Jul, 2014 03:59 IST|Sakshi
ప్రతిభావంతులను శోధించే..సీఎస్‌ఐఆర్-నెట్

పరిశోధనలు చే స్తూ ప్రతి నెల ఫెలోషిప్ పొందాలన్నా..యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలన్నా రాయాల్సిన పరీక్ష.. జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్).  దీన్ని ఏటా రెండు సార్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్‌‌చ నిర్వహిస్తుంది..దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు,ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్..
 
 జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష ఆరు సబ్జెక్ట్‌లలో జరుగుతుంది. అవి.. కెమికల్ సెన్సైస్; ఎర్త్- అట్మాస్పియరిక్-ఓషియన్-ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్; ఇంజనీరింగ్ సెన్సైస్. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 200 మార్కులకు ఉండే ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా పార్ట్-ఎ, బి, సిగా విభజించారు. సమాధానాలను గుర్తించడానికి 3 గంటల సమయం కేటాయించారు.
 
 ఒకేరకంగా పార్ట్-ఎ:
 రాత పరీక్షలో మొదట ఉండే పార్ట్-ఎ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిషన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ అంశాల నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఈ విభాగానికి మార్కులు 30.
 
 సబ్జెక్టివ్‌గా పార్ట్-బి:
 పార్ట్-బీలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌ల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున  మొత్తం 70 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున మొత్తం  75 మార్కులు ఉంటాయి. ఫిజికల్ సెన్సైస్‌లో 25 ప్రశ్నల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి మొత్తం 70 మార్కులు.  నైపుణ్యాధారితం పార్ట్-సి: పార్ట్-సీలో ప్రధానంగా నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా సబ్జెక్ట్‌ల్లోని శాస్త్రీయ అనువర్తనాలకు అభ్యర్థి ఏమేరకు అన్వయించే నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు? అనే అంశాన్ని పరీక్షిస్తారు.

 ఇందులో కూడా అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్‌లో 75 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. ఎర్త్ సెన్సైస్‌లో 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ఈ విభాగానికి 100 మార్కులు. లైఫ్ సెన్సైస్‌లో 75 ప్రశ్నలకుగాను 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 4.75 మార్కుల చొప్పున ఈ విభాగానికి 95 మార్కులు. ఫిజికల్ సెన్సైస్‌లో 30 ప్రశ్నలకుగాను 20 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు.
 
 లైఫ్ సెన్సైస్:గత రెండేళ్ల సరళిని పరిశీలిస్తే.. అధిక శాతం ప్రశ్నలు బయోకెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి వచ్చాయి. బయోకెమిస్ట్రీ నుంచి 20-25 మార్కులకు; అమైనో ఆమ్లాలు, వాటి రసాయనిక నిర్మాణం, తత్వం, ప్యూరిఫికేషన్ నుంచి ఎనిమిది మార్కులకు ప్రశ్నలు అడిగారు. సెల్ బయాలజీ మెంబ్రాన్ నుంచి  నాలుగు నుంచి ఎనిమిది, సెల్ సైకిల్ నుంచి నాలుగు నుంచి ఆరు, సెల్ సిగ్నలింగ్ నుంచి 16 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. జెనెటిక్స్‌లో కూడా 20-25 మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మెండీలియన్ జెనెటిక్స్, పాపులేషన్ జెనెటిక్స్ మీద దృష్టి సారించాలి. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి తప్పకుండా 20-25 మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు.
 
  కిరణజన్య సంయోగక్రియ, ఫైటో హార్మోన్, ఫోటో ఫిజియాలజీ, నైట్రోజన్, మెటబాలిజమ్ నుంచి కనీసం 20 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. ఎకాలజీలో బిహేవిరియల్ ఎకాలజీ, పాపులేషన్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఎకాలజీ నుంచి 25-30 మార్కులకు ప్రశ్నలు ఉంటున్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇమ్యూనాలజీ నుంచి 12-16, పరిణామ క్రమ శాస్త్రం, డవలప్‌మెంట్ బయాలజీ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి పరిశీలిస్తే.. మౌలిక శాస్త్రాలైన బోటనీ, జువాలజీ నుంచి అడిగే ప్రశ్నల సంఖ్య పెరిగింది. బోటనీలో వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి, జువాలజీ నుంచి ఫైలా క్యారెక్టరిస్టిక్స్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి బోటనీ, జువాలజీ అభ్యర్థులకు ప్రిపరేషన్ సులభమేనని చెప్పొచ్చు. వీరు బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీ అంశాల్లో కొంత కష్టపడితే విజయం సాధించవచ్చు.
 
  ఎంఎస్సీ (బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ) విద్యార్థులు జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజనీరింగ్, సెల్ బయాలజీకి సంబంధించి కాన్సెప్ట్ మ్యాప్‌లను, వివిధ అంశాల సారూప్యత, వైవిధ్యాలను తెలిపే టేబుల్స్‌ను రూపొందించుకోవాలి. ఎస్‌క్యూ3ఆర్ (సర్వే, క్వొశ్చన్, రీడ్, రీసైట్, రీకాల్) పద్ధతిని ప్రిపరేషన్‌లో ఉపయోగించాలి. ఈ విభాగానికి సంబంధించి 13 యూనిట్లలో కనీసం ఏడు యూనిట్లను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. పరీక్షకు అందుబాటులో ఉన్న ఐదు నెలల్లో మొదటి నాలుగు నెలలు ఈ ఏడు యూనిట్ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇందులో మూడు నెలలు క్లిష్టమైన, పీజీ సిలబస్‌లో లేని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగో నెలలో పీజీ సబ్జెక్ట్స్ చదవాలి. ఐదో నెలను పునశ్చరణకు, గత ప్రశ్నపత్రాల ప్రాక్టీస్‌కు కేటాయించాలి.
 
 కెమికల్ సెన్సైస్:
 ఇందులో మెరుగైన స్కోర్‌కు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అంశాలపై బీఎస్సీ (ఆనర్స్) స్థాయి ప్రిపరేషన్ సాగించాలి. పార్ట్-సి కోసం ఏదో ఒక స్పెషలైజేషన్‌లో మాత్రమే ప్రిపేర్ కావడం సముచితం కాదు. మిగతా విభాగాలపై కూడా దృష్టి సారించాలి. ఈ క్రమంలో ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ.. ఇనార్గానిక్ విభాగంలో గ్రూప్ థియరీ, స్పెక్ట్రోస్కోపి, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ అంశాలను బాగా ప్రిపేర్ కావాలి. గత రెండేళ్ల నుంచి ఈ విభాగంలో మన రాష్ట్ర విద్యార్థులు తక్కువ స్కోర్ చేస్తున్నారు. కారణం ఎక్కువ మంది విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఎంఎస్సీ చేయడమే. వీరు ఫిజికల్ కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి సారిస్తే మెరుగైన మార్కులు సాధించవచ్చు.
 
 ఫిజికల్ సెన్సైస్:
 ఈ విభాగంలో పార్ట్-బిలో క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ, మ్యాథమెటికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అంశాల నుంచి సమాన సంఖ్యలోనే ప్రశ్నలు ఇస్తున్నారు. ఒక్కోసారి క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ నుంచి ఒకటి రెండు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. పార్ట్-సి కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. ఇందులో రాణించాలంటే సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ ఫిజిక్స్, అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ ఇన్ ఫిజిక్స్ వంటి అంశాలపై దృష్టి సారించాలి.
 
 ఇంజనీరింగ్ సెన్సైస్:ఇందులోని పార్ట్-బీలో మ్యాథ్స్, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో లీనియర్ అల్జీబ్రా, కాలిక్యులస్, కాంప్లెక్స్ వేరియబుల్స్, వెక్టర్ కాలిక్యులస్, ఆర్డినరీ డిఫెరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రోబబిలిటీ, సాలిడ్ బాడీ అండ్ ఫ్లూయిడ్ మిషన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రోమాగ్నటిక్స్ వంటి అంశాల నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి కేటాయించిన మా ర్కులు 70. పార్ట్-సిలో సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎలక్ట్రికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, సాలిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ప్రతి అంశం నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 70 ప్రశ్నలు వస్తాయి.
 
 వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇందులో ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు ఈ విభాగానికి కేటాయించారు. ఈ విభాగంలో అభ్యర్థి తన బ్రాంచ్ కాకుం డా అదనంగా మరో సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. అవి.. ఈసీఈ: ఎలక్ట్రానిక్స్-సీఎస్‌ఈ, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్-మెటీరియల్ సైన్స్. సీఎస్‌ఈ: సీఎస్‌ఈ-ఎలక్ట్రానిక్స్, సీఎస్‌ఈ-థర్మోడైనమిక్స్. సివిల్: సాలిడ్ మెకానిక్స్-ఫ్ల్లూయిడ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. మెకానికల్: ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. కెమికల్/ఎన్విరాన్‌మెంటల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. ఏరోనాటికల్/ఆటోమొబైల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. ఈఈఈ:ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్.
 
 జనరల్ టిప్స్:
 స గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా లాభిస్తుంది. స సిస్టర్ ఎగ్జామ్స్‌గా వ్యవహరించే డీ బీటీ-జేఆర్‌ఎఫ్, ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్, ఐసీఏఆర్-జేఆర్‌ఎఫ్, జెస్ట్, బార్క్, డీఆర్‌డీఓ వంటి పరీక్షలు రాయడం ఉపయోగకరం. స పరీక్షలో మొదట పార్ట్-సితో ప్రారంభించండి. ఎందుకంటే ఇది స్కోర్ చేయగలిగిన విభాగం. తర్వాత పార్ట్-బి, చివరగా పార్ట్-ఎను సాధించండి. పార్ట్-బిలో ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం కేటాయించాలి. పార్ట్-సిలో ప్రతి ప్రశ్నను మూడు/నాలుగు నిమిషాల్లో సాధించడానికి ప్రయత్నించండి.
 
 ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ).. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా నియామకాలను చేపట్టడానికి యూజీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు గతేడాది యూజీసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు లేఖ కూడా రాసింది. ఐఓసీఎల్ బాటలోనే ఇతర పీఎస్‌యూలు నడిచే అవకాశం ఉంది.  సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్ పరిశోధనశాలలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రెండేళ్లపాటు నెలకు రూ. 16 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ. 20 వేలు చెల్లిస్తారు. ఈ క్రమంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూడో ఏడాది నుంచి ప్రతి నెలా రూ. 18 వేల ఫెలోషిప్ అందుకోవచ్చు.
 
 జేఆర్‌ఎఫ్‌లో అత్యంత ప్రతిభావంతులకు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ. 20 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ. 70 వేలు చెల్లిస్తారు. తర్వాత ప్రతిభ ఆధారంగా మూడేళ్లపాటు పొడిగింపు లభిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ. 24 వేల ఫెలోషిప్ లభిస్తుంది.సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షకు హాజరు కావాలంటే నెట్/సెట్‌లో అర్హత సాధించాలి.
 

మరిన్ని వార్తలు