ఇస్రోకి ఎంపికైన తెలుగు తేజం!

27 Feb, 2014 15:18 IST|Sakshi

ఆత్మవిశ్వాసం ఆసరాగా నిజాయితీగా కష్టపడే వ్యక్తి ముందు కొలువులు క్యూ కడతాయనే దానికి నిలువుటద్దం ఆ కుర్రాడు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక మంచి ఉద్యోగం చేజిక్కడమే గగనం. అలాంటిది ఇప్పటికే నాలుగైదు ఉద్యోగాలకు పిలుపొచ్చింది.. మరిన్ని ఉద్యోగాలు కూతవేటు దూరంలో కాచుకు కూర్చున్నాయి. లక్ష మందితో తలపడి, పరిశోధనలలో ప్రగతి పథాన పయనిస్తున్న ఇస్రో గ్రూప్-ఏ శాస్త్రవేత్తగా అవకాశం దక్కించుకున్నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి దూలం రవితేజ. అతని విజయ ప్రస్థానం..

 
ఇస్రో శాస్త్రవేత్తగా అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాది వరంగల్ జిల్లాలోని నర్సంపేట. నాన్న రాజేంద్ర, అమ్మ జ్యోతి. ఇద్దరూ ఉపాధ్యాయులు. పదో తరగతి వరకు వరంగల్‌లో చదువుకున్నా. నేనేమీ పుస్తకాల పురుగును కాదు.. చదివినంతసేపూ ఏకాగ్రతతో చదివేవాణ్ని. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో ఓయూ క్యాంపస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ సీటొచ్చింది. నాన్నకు ఓయూలో చదవాలనే కోరిక ఉండేది. ఆర్థిక పరిస్థితులు సహక రించక అది సాధ్యపడలేదు. నేను, అన్నయ్య నటరాజ్ ఓయూలో ఇంజనీరింగ్ చదవటం ద్వారా ఆయన కలను నిజం చేశామనిపిస్తోంది.
 
 కార్పొరేట్ ఉద్యోగం వదిలి:
 ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ప్రాంగణ నియామకాలు జరిగాయి. రాతపరీక్షలో తక్కువ మార్కులు రావడంతో, ఇంటర్వ్యూ జాబితాలో నా పేరు చివర్లో ఉంది. నియామకాలు జరుపుతున్న వారు ఫ్లయిట్‌కు సమయం అవుతుండటంతో హడావిడిగా ఉన్నారు. అయితే ఇంటర్వ్యూలో నా సమాధానాలు వారిని సంతృప్తి పరచడంతో తమ ప్రముఖ విదేశీ కార్ల కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా అవకాశమిచ్చారు. ఉద్యోగం ఢిల్లీలో. వేతనం నెలకు రూ.50 వేలు. అయితే ఆ కంపెనీలో భారతీయుల తెలివితేటలను అపహేళన చేస్తూ కొందరు మాట్లాడుతుండేవారు. అలాంటప్పుడు చాలా భాదేసేది. ఉద్యోగాన్ని వదిలేసి, ఉన్నత చదువుల కోసం మళ్లీ హైదరాబాద్ వచ్చి ఓయూలో ఎంటెక్ కోర్సులో చేరా.
 
 నాన్న.. కొండంత అండగా:
 ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సమయంలో అనవసరంగా రిస్క్ చేస్తున్నావేమో ఆలోచించుకో అని కొందరన్నారు. నాన్న మాత్రం.. నీకేది నచ్చితే అది చెయ్యంటూ కొండంత అండగా నిలిచారు. ఆ కంపెనీకి బాండ్ ప్రకారం చెల్లించాల్సిన రూ.రెండు లక్షలు ఇచ్చేందుకూ సిద్ధపడ్డారు. ఒకవైపు ఎంటెక్ చేస్తూనే బీహెచ్‌ఈఎల్, ఎస్‌ఏఐఎల్ వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల పరీక్షలకు సిద్ధమయ్యాను. వీటి నుంచి ఇప్పటికే కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఇంటర్వ్యూ బాగా చేశా. త్వరలోనే ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఇస్రో ఫలితాల్లో టాపర్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒకవేళ ఐఈఎస్‌కు ఎంపికైనా, ఇస్రోకే ప్రాధాన్యం ఇస్తా.
 
 అది కఠిన పరీక్ష:
 చెప్పుకోదగ్గ విజయాలతో ప్రగతి బాటలో నడుస్తున్న ఇస్రో నుంచి చాలా తక్కువ నోటిఫికేషన్లు వస్తుంటాయి. శాస్త్రవేత్తల నియామకాలకు 2013 జనవరిలో ఇస్రో నిర్వహించిన పరీక్షలకు దాదాపు లక్ష మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలు ఇచ్చారు. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు లోతుగా వచ్చాయి. రాత పరీక్ష గట్టెక్కాక ఈ ఏడాది జనవరి 28న హైదరాబాద్‌లోని బాలానగర్ ఇస్రో కార్యాలయంలో ఇంటర్వ్యూ జరిగింది. మిట్టల్ సారథ్యంలో 11 మంది సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు 35 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగింది. మొత్తం 40 ప్రశ్నలను ఎదుర్కొన్నాను. సమాధానాలు బోర్డుపై అవసరమైన పటాలు వేసి, విశ్లేషిస్తూ ఇవ్వాల్సి వచ్చింది. కొరియాలిస్ కాంపొనెంట్ ఆఫ్ యాక్సిలిరేషన్‌పై మొదటి ప్రశ్న అడిగారు. ఇంజనీరింగ్‌లో ఇష్టమైన సబ్జెక్టులు ఏంటని అడిగారు.
 

మరిన్ని వార్తలు