డిప్యూటీ తహశీల్దార్ డిలైట్‌ఫుల్ కెరీర్‌కు పునాది..

20 Sep, 2016 00:15 IST|Sakshi
డిప్యూటీ తహశీల్దార్ డిలైట్‌ఫుల్ కెరీర్‌కు పునాది..

డిప్యూటీ తహశీల్దార్ (డీటీ).. గ్రూప్-2 ఔత్సాహికుల్లో అత్యంత క్రేజీ పోస్టు! గ్రూప్-2 నోటిఫికేషన్ అనగానే.. డీటీ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటూ అభ్యర్థులు వాకబు చేస్తారు. ఇవి తక్కువగా ఉంటే నిరాశకు గురవుతారు. ఒకవైపు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఏపీపీఎస్సీ నుంచి త్వరలో నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశముంది. ఈ  క్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కెరీర్ గ్రాఫ్‌పై విశ్లేషణ..
 
 రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు.. డిప్యూటీ తహశీల్దార్. మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారులు (తహశీల్దార్లు) క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తే.. డిప్యూటీ తహశీల్దార్లు రెవెన్యూ కార్యాలయ బాధ్యతలు చూస్తారు. తహశీల్ కార్యాలయంలో రోజువారీ పరిపాలన విధులు, ఫైల్ ప్రొసీడింగ్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులు నిర్వహిస్తారు. ఫైళ్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే విషయంలో తహశీల్దార్లకు తమ పరిశీలనలతో కూడిన ప్రతిపాదనలు అందిస్తారు. వాటి ఆధారంగా తహశీల్దార్లు తుది నిర్ణయం తీసుకుంటారు.
 
 రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్
 డిప్యూటీ తహశీల్దార్లుగా ఎంపికైన అభ్యర్థులు.. ముందుగా ప్రొబేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో మొత్తం మూడేళ్ల వ్యవధిలో కంటిన్యూగా రెండేళ్ల సర్వీస్ తప్పనిసరి. ప్రొబేషన్ సమయంలో చూపిన పనితీరు ఆధారంగా సర్వీస్ ఖ రారు అవుతుంది. పనితీరు ఆధారంగా ప్రొబేషన్‌ను పొడిగించే విధానం సైతం అమలవుతోంది. ప్రొబేషన్ సమయంలో క్షేత్ర స్థాయిలోనూ విధులు నిర్వర్తించాలి.
 
 తర్వాత హోదా తహశీల్దార్
 డిప్యూటీ తహశీల్దార్‌గా ప్రొబేషన్ పూర్తిచేసి సర్వీస్ ఖరారు చేసుకున్న తర్వాత సీనియార్టీ ఆధారంగా తహశీల్దార్ (మండల రెవెన్యూ అధికారి- ఎంఆర్‌వో)గా పదోన్నతి లభిస్తుంది. ఈ హోదాలో మండలంలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో కొన్ని వివాదాల పరిష్కారానికి తహశీల్దార్లకు మెజిస్టీరియల్ అధికారాలు కూడా ఉంటాయి. మండల స్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ తహశీల్దార్ల వరకు పలు సూచనలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ సర్వీస్ రూల్స్ ప్రకారం- దాదాపు 50 రకాల విధులను నిర్వర్తించాల్సిన కీలకమైన హోదా తహశీల్దార్. కొన్ని సందర్భాల్లో డిప్యూటీ కలెక్టర్/ఆర్‌డీవో కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పని చేయాలి.
 
 ఎంఆర్‌వో టు డిప్యూటీ కలెక్టర్
 ఎంఆర్‌వో తర్వాత లభించే పదోన్నతి డిప్యూటీ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. డివిజన్‌లోని అన్ని శాఖలను సమన్వయం చేయడం, డివిజన్ పరిధిలోని మండల స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం, జిల్లా కలెక్టర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరపడం వంటివి డిప్యూటీ కలెక్టర్ ప్రధాన విధులు. ఫస్ట్‌క్లాస్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దిశగా చర్యలు తీసుకునే అధికారం డిప్యూటీ కలెక్టర్‌కు ఉంటుంది.
 
 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్
 డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేస్తే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా లభిస్తుంది. ఇది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ హోదాకు సమానం. ఈ హోదాలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌కు పరిపాలన పరమైన విధుల్లో సహకరించాల్సి ఉంటుంది. ప్రధానంగా కలెక్టర్ కార్యాలయంలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, సిబ్బంది పర్యవేక్షణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ - పరిశీలన, వాటికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతారు. వీటి ఆధారంగా సంబంధిత దరఖాస్తులు, ఆయా శాఖలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల కాలంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల పర్యవేక్షణకు స్వతంత్ర హోదాలో నియమిస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టులకు అవసరమయ్యే భూ సేకరణ, పర్యవేక్షణకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నియామకం జరుగుతోంది.
 
 ఎస్‌డీసీ టు జేసీ-2
 ప్రస్తుతం రెవెన్యూ పరిపాలన విభాగంలో జిల్లా స్థాయిలో జేసీ-2 (జాయింట్ కలెక్టర్-2) అనే కొత్త హోదాకు రూపకల్పన చేశారు. ఈ హోదాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను లేదా దానికి సమానంగా భావించే జిల్లా రెవెన్యూ అధికారుల (డీఆర్‌వో)ను నియమిస్తారు. వీరు ప్రధానంగా పౌర సరఫరాలు, ప్రొటోకాల్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పర్యవేక్షణ వంటి విధులను నిర్వర్తిస్తారు.
 
 
 డీటీ నుంచి జేసీ-2 వరకు
 డిప్యూటీ తహశీల్దార్‌గా కెరీర్‌ను ప్రారంభించే అభ్యర్థులు భవిష్యత్తులో జాయింట్ కలెక్టర్-2 హోదా వరకు పదోన్నతి సాధించే అవకాశాలున్నాయి. ఒక స్థాయి నుంచి.. పై స్థాయికి ప్రమోషన్ ఇచ్చే క్రమంలో నిర్దిష్టంగా సర్వీస్ నిబంధనలు, సీనియారిటీ ప్రాతిపదిక లేకపోయినా.. జాయింట్ కలెక్టర్-2 వరకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. డిప్యూటీ తహశీల్దార్లు భవిష్యత్తులో పదోన్నతులు పొందాలంటే.. సర్వీస్ కమిషన్లు ఆరు నెలలకోసారి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించాలి. అలా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ప్రమోషన్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. అలాగని డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన ప్రమోషన్ వస్తుందని భావించకూడదు. పదోన్నతి ఇచ్చేందుకు ఇది ఒక ప్రాతిపదిక మాత్రమే.
 
 తాజా గ్రాడ్యుయేట్లు.. కన్‌ఫెర్డ్ ఐఏఎస్!
 ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొని 21 లేదా 22 ఏళ్ల వయసులో డిప్యూటీ తహశీల్దార్ పోస్ట్ సొంతం చేసుకున్న అభ్యర్థులు.. భవిష్యత్తులో కన్‌ఫెర్డ్ ఐఏఎస్ హోదా సైతం అందుకునే అవకాశముంది. కన్‌ఫెర్డ్ ఐఏఎస్‌గా ఎంపికయ్యేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం- డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తిచేసుండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే సంవత్సరంలో జనవరి 1 నాటికి 52 ఏళ్ల వయసు దాటకూడదు. ఈ రెండు అర్హతలున్న వారు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జీఏడీకి దరఖాస్తు చేసుకోవాలి. జీఏడీ ఆ దరఖాస్తులను పరిశీలించి సర్వీస్ రికార్డ్, డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికైనప్పటి నుంచి జీఏడీకి దరఖాస్తు చేసుకునే రోజు వరకు చూపిన పనితీరును పరిశీలిస్తుంది.

  దాని ఆధారంగా అర్హుల జాబితాను రూపొందిస్తుంది. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు పంపిస్తారు. ఆ తర్వాత కమిషన్.. జాబితాలోని వ్యక్తులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారిని కన్‌ఫెర్డ్ ఐఏఎస్ హోదాకు అర్హులని పేర్కొంటుంది. అంటే.. డిప్యూటీ తహశీల్దార్‌గా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు అత్యుత్తమ పనితీరు కనబరిస్తే 52 నుంచి 53 ఏళ్ల వయసు వచ్చే నాటికి కన్‌ఫెర్డ్ ఐఏఎస్ హోదా సొంతం చేసుకుని, జాయింట్ కలెక్టర్ స్థాయిలో సైతం విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కన్‌ఫెర్డ్ ఐఏఎస్ లభించాక ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా మారుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది.
 
 ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఉండటం రెవెన్యూ శాఖలోని ప్రత్యేకత. కానీ, అతి కొద్ది మంది వల్ల అధిక శాతం ప్రజల్లో ‘అవినీతి’ ఎక్కువ అనే దురభిప్రాయం నెలకొంది. ఈ సర్వీసులో కొత్తగా అడుగుపెట్టాలనుకునే అభ్యర్థులు సేవా దృక్పథంతో ముందుకెళ్లాలి. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా, అన్ని వర్గాల శ్రేయస్సుకు కృషి చేసేలా విధులు నిర్వర్తించాలి.
 
 - బి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్,
 ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ
 సర్వీసెస్ అసోసియేషన్.

 

మరిన్ని వార్తలు