ప్రభుత్వ రంగ సంస్థలు- పెట్టుబడుల ఉపసంహరణ

18 Sep, 2014 15:32 IST|Sakshi
ప్రభుత్వ రంగ సంస్థలు- పెట్టుబడుల ఉపసంహరణ

 డా॥తమ్మా కోటిరెడ్డి,
 ప్రొఫెసర్,
 ఐబీఎస్ హైదరాబాద్.
 
 ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఏటికేటికీ పెరుగుతోంది. ఆర్థికవృద్ధి సాధనే ధ్యేయంగా 1991-92 నుంచి ప్రారంభమైన ఈ ఉపసంహరణ ప్రస్థానం.. ఇంకా కొనసాగుతోంది. పుష్కర కాలం క్రితం ప్రభుత్వ రంగ సంస్థలలో నూటికి నూరు శాతం ఉన్న ప్రభుత్వ పెట్టుబడులు నేడు సగానికి పడిపోయాయి.
 
  సర్కారు స్థానంలో ప్రైవేటు రంగాలు పాగా వేస్తున్నాయి. మొన్నటికి మొన్న మరో మూడు సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరో 12 సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అభివృద్ధి అజెండాతో ఉపసంహరణ అంకానికి ఉపక్రమిస్తున్న పాలక ప్రభుత్వాల నిర్ణయాలు ఏ మేర దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెడతాయన్నది ఇప్పటికీ సందేహమే.
 
 ప్రభుత్వ రంగ సంస్థలలో వెచ్చించిన మూలధనం నుంచి ప్రతిఫల రేటు రుణాత్మకంగా ఉండటాన్ని ప్రభుత్వ నూతన ఆర్థిక విధానం (జూలై -1991) గుర్తించింది. సరిగా పనిచేయని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ వనరులపై అధికంగా ఆధారపడటంతో ఆస్తుల కల్పన తగ్గింది. రుణభారం పెరిగింది. ఆర్థిక వృద్ధి వేగవంతం చేస్తాయని భావించిన ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవస్థకు భారమయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రతిఫల రేటు తగ్గడంతో జాతీయ స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయ పొదుపు రేటులో క్షీణత ఏర్పడింది. పర్యవసానంగా స్థూల దేశీయ పొదుపులో 10 నుంచి 15 శాతం తగ్గుదల చోటుచేసుకుంది.
 
  ఉపయోగితా మూలధనంతో పోల్చినపుడు లాభాల స్థాయి చాలా తక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను సమర్థవంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం భావించింది. తమ పనితీరును మెరుగుపరచుకోవడం ద్వారా ఆయా సంస్థలు సామాజిక లక్ష్యాలను సాధించాలని సర్కారు ఆశించింది. పోటీ వాతావరణంలో లాభాలతో నడుస్తున్న కంపెనీలలో యాజమాన్య, వాణిజ్య పరమైన స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ, లాభాలార్జిస్తున్న కంపెనీలను ప్రైవేటుపరం చేయరాదని ప్రభుత్వం భావించింది.
 
 జాతీయ కనీస సాధారణ కార్యక్రమం
  జాతీయ కనీస సాధారణ కార్యక్రమం (నేషనల్ కామన్ మినిమమ్ ప్రోగ్రాం) లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో పారదర్శకతను పాటించాలని ప్రభుత్వం భావించింది. నవరత్న హోదా పొందిన కంపెనీలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ మూల ధన మార్కెట్ నుంచి ఆయా సంస్థలు వనరులు సమీకరించేలా తీర్చిదిద్దాలని ఆశించింది. నష్టాలతో నడిచే కంపెనీలను ఆధునికీకరించలేని పక్షంలో శ్రామికుల బకాయిలు, నష్ట పరిహారం చెల్లించి పూర్తిగా మూసేయడం గానీ లేదా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
 ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు
  దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర వెలకట్టలేనిది. స్వాతంత్య్రానంతరం పారిశ్రామిక పురోగమనంలో వీటి అభివృద్ధిలో పాలక ప్రభుత్వాలు కీలకపాత్ర పోషించాయి. మార్చి 31, 2013 నాటికి పలు మంత్రిత్వ శాఖల పరిధిలో 277 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వీటిలో 228 కార్యకలాపాలు కొనసాగిస్తుండగా మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. వీటి మొత్తం పెట్టుబడి (చెల్లించిన మూలధనం + దీర్ఘకాలిక రుణాలు) రూ. 8,50, 599 కోట్లు. 2011-12 తో పోల్చితే ఈ మొత్తంలో పెరుగు దల 16.6 శాతం. 2012-13లో లాభాలార్జిస్తున్న 149 సంస్థల నికర లాభం రూ.1,43,559 కోట్లు . నష్టాలార్జిస్తున్న 79 సంస్థల నికర నష్టాలు రూ. 28,260 కోట్లు.
 
  లాభాలార్జిస్తున్న వాటిలో ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటి నికర లాభాలు తగ్గుముఖం పట్టాయి. 2005 ఫిబ్రవరిలో నికర లాభాలు 8.7 శాతం ఉంటే.. 2011 ఫిబ్రవరి నాటికి 6.2 శాతానికి చేరింది.
 
 నికర లాభాలలో క్షీణతకు కారణాలివి
   లోపభూయిష్టమైన ప్రభుత్వ రంగ సంస్థల ధరల విధానం -అవస్థాపితా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోకపోవడం
 ప్రాజెక్టుల ప్రణాళిక, వాటి నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలు -యాజమాన్య పరమైన సమస్యలు, స్వయం ప్రతిపత్తి లోపించడం
 
 పెట్టుబడుల ఉపసంహరణ
  ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను తగ్గించడం ద్వారా ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ క్రమంలో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆర్థిక భారం తొలగింపు, పబ్లిక్ ఫైనాన్స్‌ను మెరుగుపరచ డం, మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచడం, వృద్ధికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చడానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ అంశం తెరమీదికి వచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా లభించిన మొత్తంతో
 
 1.    ప్రభుత్వ ద్రవ్యలోటు పెరిగిన క్రమంలో దాన్ని తగ్గించడానికి వినియోగించడం
 2.    పెద్ద తరహా అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవడం
 3.    కొనుగోలు వ్యయాన్ని పెంచడానికి ఆర్థిక వ్యవస్థలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా మరల్చడం
 4.    ప్రభుత్వ రుణ భారం తగ్గింపు
 5.    విద్య, ఆరోగ్యం, గృహ వసతి, తాగునీరు లాంటి సా మాజిక రంగ కార్యకలాపాలపై పెట్టుబడులుగా మరల్చడానికి సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నది ముఖ్య లక్ష్యం.
 ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కింది ప్రయోజనాలు కల్పించేలా ఉండాలి.
 యాజమాన్య సమర్థత
 ఆర్థిక వ్యవస్థలో మూలధన కొరత నివారణ
 అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకురావడం
 కొత్త మార్కెట్‌లోప్రవేశం
 వ్యూహాత్మక పెట్టుబడిదారుల ఆసక్తి గుర్తింపు
 ఉపాధి, పోటీ వాతావరణంతోపాటు పర్యావరణ అభిలషణీయ విధానాలు రూపొందించడం
 
 పెట్టుబడుల ఉపసంహరణ-గత లక్ష్యాలు
 వాస్తవంగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ 1991-92 నుంచి ప్రారంభమైంది. ఆనాటి నుంచి నేటివరకు ఏదో సంస్థ నుంచి తన పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. 1991-92 బడ్జెట్‌లో మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 2,500 కోట్లు కాగా సాధించింది రూ.3037.74కోట్లు. 2013-14లో లక్ష్యం రూ. 40వేల కోట్లు కాగా సాధించింది రూ. 15,819 కోట్లు. ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం నుంచి 2014-15 (ఆగస్టు 5, 2014)వరకు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం రూ.1,52,842,25 కోట్లకు చేరింది.
 
 జాతీయ పెట్టుబడి నిధి
 ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టపరిచే లక్ష్యంతో బోర్డ్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటయింది. పునర్నిర్మించడానికి వీలుకాని, దీర్ఘకాలంగా నష్టాలతో నడిచే కంపెనీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, మూసివేతకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి ఈ బోర్డు సూచిస్తుంది. అలా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించిన మొత్తంతో జాతీయ పెట్టుబడి నిధి (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్) ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నిధిలో 75 శాతం మొత్తాన్ని విద్య, ఆరోగ్యం,ఉపాధిని ప్రోత్సహించడానికి వెచ్చిస్తారు. 2013-14 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించిన మొత్తాన్ని జాతీయ పెట్టుబడి నిధి అంశం కింద పబ్లిక్ అకౌంట్‌లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పెట్టుబడి నిధిలో భాగాగం ఉండే ఈ మొత్తం పంపిణీని ప్రభుత్వ బడ్జెట్‌లో నిర్ణయిస్తారు.
 
 జాతీయ పెట్టుబడి నిధి-పాత్ర
 ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే తగ్గించకుండా ఉంచడం
 ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీలలో రీ క్యాపిటలైజేషన్
 రిజర్వ్‌బ్యాంక్, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంక్‌లలో పెట్టుబడులు
 పలు మెట్రో ప్రాజెక్టులలో ప్రభుత్వ ఈక్విటీ నిర్వహణ
 భారతీయ నభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్, యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో మదుపు
 రైల్వేలలో మూలధన వ్యయం పెట్టుబడులకు జాతీయ పెట్టుబడి నిధి సహాయపడుతుంది.
 
 ఇటీవలి పరిణామాలు
 ఇటీవల అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా లిమిటెడ్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ కార్పోరేషన్, ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనిద్వారా రూ. 44వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగొచ్చని అంచనా. కోల్ ఇండియాలో 10 శాతం, ఓఎన్‌జీసీలో 5 శాతం, ఎన్‌హెచ్‌పీసీలో 11.36 శాతం వాటా విక్రయానికి సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం కోల్ ఇండియాలో రూ.23వేల కోట్లు, ఓఎన్‌జీసీలో రూ.18వేల కోట్లు, ఎన్‌హెచ్‌పీసీలో రూ.2,800 కోట్లు. 2014-15 బడ్జెట్ అంచనాల ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 58,425 కోట్లు. అయితే వరుసగా ఐదేళ్ల కాలంలో ఆశించిన లక్ష్యం చేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో అది నెరవేరుతుందో? లేదో? చూడాలి.
 
 ప్రైవేటీకరణ ప్రక్రియ
 దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు నాణ్యమైన ఆస్తులు, మానవశక్తి (మ్యాన్ పవర్) కొదువే లేదు. విధాన నిర్ణయాల విషయంలోనే లోపమంతా. దీనివల్లే ప్రభుత్వ రంగ సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వ్యూహాత్మకంగా లేని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా పారదర్శకత పెంపొందించవచ్చు. అలాగే పని వాతావరణాన్ని కూడా మెరుగుపరచవచ్చు.
 
 
 పెట్టుబడుల ఉపసంహరణ-పరిణామాలు
 గతేడాది నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్ ధరలలో పెరుగుదల కనిపించింది. స్టాక్ ధరలలో 300 శాతం వృద్ధి చోటుచేసుకుంది. బీఈఎమ్‌ఎల్ స్టాక్‌లో 295 శాతం, ఎంటీఎన్‌ఎల్‌లో 150 శాతం, సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో 110 శాతం, నాల్కోలో 107 శాతం, ఫ్యాక్ట్‌లో 85 శాతం పెరిగింది.
 
 ఎస్ అండ్ పీ (స్టాండర్డ్ అండ్ పూర్స్), బీఎస్‌ఈ సెన్సెక్స్, సీఎన్‌ఎక్స్ నిఫ్టీ సూచీలలో నిరుడు 33 శాతం పురోగతి కనిపించింది. కంపెనీలను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు కంపెనీల స్టాక్ ధరల పెరుగుదలకు ఉపకరించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 12 కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, తేహ్రి హైడ్రో డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఎన్‌హెచ్‌పీసీ, కాంకర్,ఎంఎంటీసీ, ఎన్‌ఎల్‌సీ ముఖ్యమైనవి.

మరిన్ని వార్తలు