ఎడ్యుకేషన్ న్యూస్

27 Mar, 2014 15:10 IST|Sakshi

పాత పద్ధతిలోనే ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ
ఇంజినీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలను పాత విధానంలోనే చే పట్టాలని ఇంజినీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అప్పటికీ మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు మిగిలిపోతే చివరగా ఇంటర్మీడియెట్ మార్కులతో ప్రవేశాలు చేపడతారు.

 

గతేడాది అనుసరించిన విధంగా 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ఎన్‌ఆర్‌ఐ కోటా 5 శాతం మాత్రమే ఉండేది. హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని 15 శాతానికి పెంచుతున్నారు. ఈసారి 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాలో నేరుగా ఎన్‌ఆర్‌ఐ పిల్లలనే చేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సీట్లు మిగిలిపోతే అవి మేనేజ్‌మెంట్ కోటాలోకి వెళతాయి. మిగిలిన 15 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.
 
 
 
 ఇక యూనివర్సిటీలకే ఏఐసీటీఈ అధికారాలు
 టెక్నికల్ కాలేజీలకు ఇకపై యూనివర్సిటీలే అనుమతులిస్తాయి. కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా వర్సిటీలకే ఉంటుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా నిబంధనలు రూపొందించింది. ఏఐసీటీఈ కేవలం సలహా సంస్థ మాత్రమేనని, కాలేజీల పర్యవేక్షణ, అనుమతులిచ్చే అధికారాలు లేవన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది.

 

సాంకేతిక విద్యా కళాశాలల్లో బోధన, పరీక్షలు, పరిశోధనలు, ప్రమాణాల పెంపు కోసం కొత్త నిబంధనలు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా నిబంధనల మేరకు.. ఇంజినీరింగ్, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహించే సాంకేతిక విద్యా కాలేజీలు అనుమతుల రెన్యువల్ కోసం ఇకపై సంబంధిత విశ్వవిద్యాలయాల అనుమతి తీసుకోవాలి. కొత్త కాలేజీలు గుర్తింపు పొందాలంటే నాక్ అక్రెడిటేషన్ తప్పనిసరి. గుర్తింపు కోసం కొత్త కాలేజీలు దరఖాస్తు చేసుకునే ముందు ఆరు నెలల్లో నాక్ అక్రెడిటేషన్ తెచ్చుకుంటామని అండర్ టేకింగ్ ఇస్తేనే యూనివర్సిటీలు అనుమతినివ్వాలి.

 

ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి నడుస్తున్న కాలేజీలు ఇప్పటి నుంచి ఆరునెలల్లోగా నాక్ అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే నాక్ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలు, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్‌బీఏ) గుర్తింపు కలిగిన కోర్సుల విషయంలో ఇతర అన్ని నిబంధనలు పాటిస్తుంటే.. వాటికి శాశ్వత గుర్తింపునిచ్చే అంశాన్ని యూనివర్సిటీలు పరిశీలిస్తాయి. యూనివర్సిటీలు తాము గుర్తింపు ఇచ్చిన కాలేజీల సమగ్ర సమాచారాన్ని, నిబంధనలు పాటిస్తున్న తీరును పేర్కొంటూ ఏటా యూజీసీకి నివేదిక అందజేయాలి. కాలేజీలకు గుర్తింపు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీలు నిబంధనలను అతిక్రమిస్తే వాటికి గ్రాంట్స్ నిలిపివేయడంతోపాటు యూజీసీ గుర్తింపు రద్దవుతుంది.


 
 ఐఐఎం నుంచి డిగ్రీ పట్టా!
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఉత్తీర్ణులు ఇక డిగ్రీ పట్టా అందుకునే అవకాశం త్వరలోనే రానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అంశంపై ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఐఐఎం-ఇండోర్ డెరైక్టర్ రిషికేశ కృష్ణన్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఐఐఎం ఉత్తీర్ణులకు డిగ్రీ పట్టాను అందజేస్తారు.

 

ప్రస్తుతం ఐఐఎంలు కేవలం డిప్లొమా/సర్టిఫికెట్‌లను మాత్రమే అందజేస్తున్నాయి. ఎందుకంటే వీటిని ఏర్పాటు చేసిన చట్టం మేరకు ఐఐఎంలు యూనివర్సిటీ కేటగిరీలోకి రాకపోవటమే. ప్రస్తుతం ఐఐఎంలు అందజేస్తున్న పీజీడీఎం  సర్టిఫికెట్‌కు విదేశాల్లో, కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో గుర్తింపు ఉండకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పీహెచ్‌డీ సమయంలో కూడా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు పీజీడీఎంను అర్హతగా గుర్తించడం లేదు.


 
 ఆన్‌లైన్ కోర్సులు ః 2.5 లక్షల మంది భారతీయుల రిజిస్ట్రేషన్

 మసాచ్యూట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ఆన్‌లైన్ కోర్సుల నిర్వహణ కోసం ప్రారంభించిన మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (MOOC) కోసం ఎడ్‌ఎక్స్ (ed-X) కేంద్రంగా 2.5 లక్షల మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆన్‌లైన్ కోర్సుల్లో చేరే వారికి ఎడ్‌ఎక్స్ (ed-X) వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అమెరికన్ల తర్వాత ఈ కోర్సుల కోసం అత్యధికంగా దరఖాస్తు చేసుకుంది భారతీయులే. ఎంఐటీ, హార్వర్డ్ కోర్సులు చాలా వరకు స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేవి. ఎంచుకున్న కోర్సును బట్టి 4 నుంచి 12 వారాల వరకు కోర్సు వ్యవధి ఉంటుంది.

మరిన్ని వార్తలు