విద్యా సమాచారం

14 Oct, 2015 03:41 IST|Sakshi

నేటి నుంచి తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు
 
సాక్షి, హైదరాబాద్: తెలుగు వర్సిటీలో ఎంఏ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించి బుధవారం నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 వరకు కొనసాగే పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రిజిస్ట్రార్ తోమాసయ్య మంగళవారం తెలిపారు. జానపద గిరిజన విజ్ఞానం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష వరంగల్‌లోని గిరిజ విజ్ఞాన పీఠంలో 17న జరుగుతుంది. మిగిలిన కోర్సుల హైదరాబాద్‌లోని వర్సిటీ ప్రాంగణలో పరీక్షలు నిర్వహిస్తారు.
 
  ఏపీలోనూ తెలుగు వర్సిటీ ప్రవేశాలు
 సాక్షి, హైదరాబాద్: వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు తెలుగు వర్సిటీ ఏపీలో కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తమ రాష్ర్ట విద్యార్థులకు సేవలు అందించినందుకు ఏ మేరకు నిధులు అవసరమో కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను తెలంగాణ సర్కారు ఏపీకి అందించనుంది. ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ విద్యార్థులకు తెలుగు వర్సిటీ పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలి. తమ రాష్ట్ర విద్యార్థులకు వర్సిటీ సేవలు అందించినందుకు గాను అయిన ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించాలి. ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడిచింది. అయితే గత నెలలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
 
 రేపటి నుంచి ‘ఆయుష్’ కౌన్సెలింగ్
 ఏపీలో 15, 16, తెలంగాణలో 17, 18 తేదీల్లో నిర్వహణ
 విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ):  ఆయుర్వేద, హోమియో, నేచురోపతి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీలో ఈ నెల 15, 16 తేదీల్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో, అలాగే తెలంగాణలో ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ జేఎన్‌టీయూ (కూకట్‌పల్లి)లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయుర్వేద(బీఏఎంఎస్) కోర్సుకు ఏపీలోని ఏయూ పరిధిలో ఎన్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, విజయవాడలో 28 సీట్లు, ఎస్‌వీయూ పరిధిలో తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో 39 సీట్లు, ప్రైవేటు కళాశాలైన శ్రీఆది శివసద్గూరు అల్లీ సాహెబ్ కళాశాల, గుంతకల్లులో (ఏ-కేటగిరీ 50+బి-కేటగిరీ 10) 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

హోమియో (బీహెచ్‌ఎంఎస్) కోర్సుకు సంబంధించి ఏయూ పరిధిలో గురురాజు కళాశాల, గుడివాడలో 39, రాజమండ్రి అల్లు రామలింగయ్య కళాశాలలో 49, ఏయూ పరిధిలో విజయనగరం మహారాజ కళాశాలలో 30, నేచురోపతి (బీఎన్‌వైఎస్)లో ఎస్‌వీయూ పరిధిలో గుంతకల్లు పతంజలి మహర్షి నేచురోపతి కళాశాలలో 60 సీట్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహించిన ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించినవారే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.  

 తెలంగాణలో...
 ఆయుర్వేద (బీఏఎంఎస్)లో హైదరాబాద్ డాక్టర్ బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 48, వరంగల్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 49 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హోమియో (బీహెచ్‌ఎంఎస్)లో హైదరాబాద్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో కాలేజీలో 59, ప్రైవేటు కళాశాలలైన రంగారెడ్డి జిల్లా కీసరలోని దేవ్స్ హోమియో కళాశాలలో 30, హైదరాబాద్ జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీలో  60, నేచురోపతిలో స్టేట్‌వైడ్ కళాశాల (ఏపీ, తెలంగాణ)కు కలిపి గాంధీ నేచురోపతి మెడికల్ కళాశాలలో 30 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హులు.

మరిన్ని వార్తలు