ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్..

1 Nov, 2016 01:16 IST|Sakshi
ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్..

ఇంజనీరింగ్.. ‘ప్రాక్టీస్’కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన కోర్సు! నాలుగేళ్ల కోర్సులో దాదాపు 30  రకాల సబ్జెక్టులకు సంబంధించిన నైపుణ్యాలు పొందాలి. ఈ క్రమంలో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌పైనా దృష్టిసారించడం అత్యంత అవసరం. క్లాస్‌రూమ్‌కే పరిమితం కాకుండా, లేబొరేటరీ వైపు కదలడం ముఖ్యం. తొలి ఏడాది, తొలి రోజు నుంచే ఈ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఈ నేపథ్యంలో బీటెక్ ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ ప్రాధాన్యత, అనుసరించాల్సిన  విధానాలపై విశ్లేషణ..
 
 ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా విద్యార్థులకు సబ్జెక్టు నాలెడ్జ్‌తోపాటు దాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యాలు అవసరం. అప్పుడే భవిష్యత్తులో సుస్థిర కెరీర్ సొంతమవుతుంది. అందువల్ల ప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించుకునేందుకు కృషిచేయాలి. నాలుగో ఏడాదిలో ఉండే ప్రాజెక్టు వర్క్ వరకు వేచి చూడకుండా.. తొలిరోజు నుంచే ప్రాక్టికల్, ల్యాబ్ వర్క్‌ల దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాంచ్ ఏదైనా.. తొలి ఏడాదిలో ఉమ్మడిగా ఉండే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ మొదలు.. రెండో సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఉండే కోర్ బ్రాంచ్ స్పెషలైజేషన్ వరకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను సొంతం  చేసుకోవాలి.
 
 అన్వయానికి అవకాశం
 క్లాస్‌రూంలో అధ్యాపకులు బోధించిన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకునేందుకు, వాటిని నిరంతరం వాస్తవ పరిస్థితుల్లో అన్వయించేందుకు ప్రాక్టికల్ వర్క్, ల్యాబ్ వర్క్‌లు వీలుకల్పిస్తాయి. ఇంజనీరింగ్‌లో బేసిక్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్‌గా పరిగణించే డ్రాయింగ్ మొదలు.. కోర్ బ్రాంచ్‌ల్లో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ అంశాలను బోధించే సబ్జెక్టుల వరకు ప్రాక్టికల్ అప్రోచ్ అవసరం.
 
 లెర్నింగ్ బై డూయింగ్..
 వాస్తవానికి ప్రాక్టికల్ వర్క్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ (చేస్తూ నేర్చుకోవడం). విద్యార్థులు తాము పుస్తకాల్లో చదివిన అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించినప్పుడే వాటిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్లు లెక్క. దీన్నిబట్టి కోర్సులో ప్రాక్టికల్ వర్క్‌కు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది.
 
 కరిక్యులంలో ప్రాధాన్యం
 ఇంజనీరింగ్‌లో ప్రాక్టికల్స్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కరిక్యులం, మూల్యాంకన పరంగా వాటికి సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఒక సబ్జెక్టుకు సంబంధించి దాదాపు 25-30 శాతం మేర ప్రాక్టికల్ వర్క్, ల్యాబ్ వర్క్ చేసే విధంగా నిబంధనలు అమలవుతున్నాయి. ఇక మూల్యాంకన పరంగా ఇంటర్నల్ టెస్ట్‌లు నిర్వహించడం, వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తున్నారు. సాధారణంగా ఇవి 30 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ పాయింట్లకు సమానంగా ఉంటున్నాయి.
 
  ఎందుకు? ఎలా?
 ఏదైనా ఒక అంశంపై ఎందుకు? ఎలా? అని ప్రశ్నిస్తూ నేర్చుకునేందుకు ప్రాక్టికల్, ల్యాబ్ వర్క్‌లు వీలుకల్పిస్తాయి. అదే విధంగా తాము నేర్చుకున్న అంశం వాస్తవ పరిస్థితుల్లో ఎందుకు ఉపయోగపడుతుంది? అది సమర్థంగా ఉపయోగపడేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై క్షేత్రస్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్‌లో చురుగ్గా పాల్గొంటే, కొత్త విషయాలు సైతం తెలుస్తాయి. విద్యార్థుల్లో విశ్లేషణ నైపుణ్యాలు, తులనాత్మక పరిశీలన, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలు మెరుగవుతాయి. ఇవి చివరి సంవత్సరంలో రియల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో చేసే ప్రాజెక్టు వర్క్‌కు ఎంతో ఉపయోగపడతాయి. మూడేళ్లపాటు ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ పరంగా ముందంజలో నిలిచిన విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్‌ను సులువుగా పూర్తిచేయగల సామర్థ్యం ఉంటుంది.
 
  ప్రాక్టికల్ వర్క్ పక్కాగా ఉండాలంటే
  ప్రాక్టికల్ వర్క్‌ను సమర్థంగా పూర్తిచేసేందుకు సరైన ప్రణాళికతో వ్యవహరించాలి. ఒక అంశానికి సంబంధించిన ప్రాక్టికల్ వర్క్ కోసం లేబొరేటరీకి వెళ్తున్నప్పుడు అందుకు అవసరమైన టూల్స్‌ను గుర్తించాలి. డ్రాయింగ్ చార్ట్, నోట్‌బుక్, రికార్డ్ బుక్ వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి. వీటన్నికంటే ముఖ్యమైన మరో అంశం.. ఆయా అంశాలకు సంబంధించి ప్రాక్టికల్ వర్క్ ఉద్దేశాన్ని అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలి.
 
 నిర్దిష్టంగా ఒక ప్రాక్టికల్ వర్క్ ఉద్దేశంపై స్పష్టత పొందాక.. దానికి సంబంధించిన థియరీ, బేసిక్స్, కాన్సెప్టుల ఆధారంగా ముఖ్య పాయింట్లతో సినాప్సిస్ రూపొందించుకోవాలి. దీనివల్ల ప్రాక్టికల్ వర్క్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ముందే స్పష్టత లభిస్తుంది.
 
 రికార్డ్ రూపకల్పన
 ఒక అంశంపై ప్రాక్టికల్ వర్క్ పూర్తయిన తర్వాత విద్యార్థులు రికార్డ్‌కు రూపకల్పన చేయాలి. దీనికోసం లేబొరేటరీ రికార్డ్ పుస్తకాలను ఉపయోగించుకోవాలి. వీటిలో ప్రాక్టికల్ వర్క్ ఉద్దేశం నుంచి ఫలితం వరకు అన్ని విషయాలను క్రమపద్ధతిలో పొందుపర్చాలి. ల్యాబ్ రికార్డ్ బుక్‌లో పొందుపర్చిన అంశాలు, వాటిని రాసిన తీరు ఇంటర్నల్స్‌లో మంచి మార్కులు పొందేందుకు వీలు కల్పిస్తాయి.
 
 కంప్యూటర్ వినియోగంపై అవగాహన
 బ్రాంచ్ ఏదైనా ప్రాక్టికల్ వర్క్, ల్యాబ్ వర్క్ పరంగా కంప్యూటర్ వినియోగంపైనా అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. కారణం.. ఇటీవల కాలంలో అన్ని బ్రాంచ్‌లకు సంబంధించి 2-డి, 3-డి డిజైన్ ప్రింటింగ్ విధానంలోనూ కొన్ని ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వీటిలో రాణించాలంటే కంప్యూటర్స్‌పై అవగాహన తప్పనిసరి. దీంతోపాటు డ్రాయింగ్ నైపుణ్యాలను కూడా సముపార్జించుకోవాలి.
 
  మరెన్నో నైపుణ్యాలు
 ప్రాక్టికల్, ల్యాబ్‌వర్క్‌ల వల్ల సబ్జెక్టుకు సంబంధించిన వాస్తవ నైపుణ్యాలతోపాటు మరెన్నో స్కిల్స్ సొంతమవుతాయి. అవి.. టీంవర్క్ కల్చర్, థింకింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ, అనలిటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్. కొత్త సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాల్సి రావడం, బృందంగా కలిసి పనిచేయాల్సి ఉండటం తదితరాల వల్ల ఈ నైపుణ్యాలు అలవడతాయి.
 
 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్స్, ల్యాబ్‌వర్క్‌లకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. వీటివల్ల భవిష్యత్తులో రియల్ టైం వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుంది. అంతేకాకుండా చివరి ఏడాదిలో చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్‌కు సరైన అంశాన్ని ఎంపిక చేసుకునేందుకు కూడా దోహదం చేస్తాయి. కానీ ఇటీవల కొన్ని కళాశాలల్లో ప్రాక్టికల్ వర్క్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయంలో ఫ్యాకల్టీ సభ్యులు చొరవ చూపాలి. ప్రాక్టికల్స్ ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయాలి.
 - ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.

మరిన్ని వార్తలు