ఆర్థికఉద్యోగాలకు.. ఫైనాన్స్ రెజ్యూమె!

24 Sep, 2014 03:11 IST|Sakshi
ఆర్థికఉద్యోగాలకు.. ఫైనాన్స్ రెజ్యూమె!

మీరు ఫైనాన్స్ ప్రొఫెషనలా?  మీ రంగానికి సంబంధించిన కొలువులకు దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి రెజ్యూమెను జతచేస్తున్నారు? సాధారణ రెజ్యూమెను పంపితే ఫలితం ఉండదు. ఫైనాన్స్ రంగానికి ప్రత్యేకమైన రెజ్యూమె ఉంటుంది. రెగ్యులర్ ఫార్మాట్‌తో పోలిస్తే ఇది భిన్నం. దాన్ని ఎలా రూపొందించుకోవాలో తెలుసుకుంటే కొలువు వేట విజయవంతమవుతుంది.
 
 ఆబ్జెక్టివ్:  రెజ్యూమె ఫార్మాట్‌లో ముఖ్యమైనది.. ఆబ్జెక్టివ్. అంటే మీరు ఆర్థిక శాస్త్రం చదివిన అభ్యర్థి అనే విషయం రెజ్యూమెను చూడగానే తెలిసిపోవాలి. మీ అర్హతలు, అనుభవాలు రిక్రూటర్‌కు తెలియాలి. ఈ ఆబ్జెక్టివ్ సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండాలి. రెజ్యూమెలో పునరుక్తులు లేకపోతే రిక్రూటర్‌కు మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. నా నైపుణ్యాలను పెంచుకోవడానికి మీ సంస్థలో ఉద్యోగం కావాలి అంటూ రెజ్యూమెను సాధారణ శైలిలో రాయకుండా.. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడానికి సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లేదా ఫలానా స్థాయి కొలువును కోరుకుంటున్నాను అని సూటిగా పేర్కొనాలి. సంస్థ పేరు, కోరుకుంటున్న హోదాను ప్రస్తావించాలి. దీనివల్ల కొలువుపై మీలో స్పష్టత, ఆసక్తి ఉన్నాయని రిక్రూటర్ అంచనాకొస్తారు. సంస్థ మీకేం ఇవ్వాలో కాకుండా, సంస్థకు మీరేం ఇస్తారో చెప్పండి.
 
 అర్హతలు: ఫైనాన్స్ రెజ్యూమెలో విద్యార్హతలదే అగ్రస్థానం. రెగ్యులర్ రెజ్యూమెలో మొదట పని అనుభవాన్ని ప్రస్తావిస్తారు. కానీ, ఫైనాన్స్ రెజ్యూమెలో మాత్రం విద్యార్హతల తర్వాతే వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి పేర్కొనాలి. మీరు చదివిన పాఠశాల, కళాశాలలు, సాధించిన మార్కులు, గ్రేడ్లను వరుస క్రమంలో ఇవ్వాలి. మీరు ఛార్టెర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పూర్తిచేస్తే.. ఏ సంవత్సరంలో అర్హత సాధించారు? అది తొలి ప్రయత్నంలోనా? లేక రెండో ప్రయత్నంలోనా? అనేది తప్పనిసరిగా తెలియజేయాలి.
 
 పని అనుభవం: రిక్రూటర్లు అభ్యర్థుల విద్యార్హతలతోపాటు పని అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మధ్యస్థ, సీనియర్ లెవల్ ఉద్యోగాలకు పని అనుభవం ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేస్తారు. మీరు ఇప్పటికే ఏదైనా సంస్థలో పనిచేసి ఉంటే.. సదరు సంస్థ పేరు, అందులో మీ హోదాలు, నిర్వర్తించిన బాధ్యతలు, మెరుగుపర్చుకున్న అనుభవం, నైపుణ్యాలు, సాధించిన విజయాలను రెజ్యూమెలో పేర్కొనండి. దీనివల్ల మీరు ఎలాంటి కొలువుకు సరిపోతారు అనేదానిపై రిక్రూటర్‌కు అవగాహన వస్తుంది.
 
 ఉండాల్సిన పదాలు: ఒక్కో రంగానికి సంబంధించిన రెజ్యూమెలో ఉండాల్సిన సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. వీటితో రెజ్యూమె పరిపూర్ణమవుతుంది. వాటిని కచ్చితంగా ఉపయోగించాలి. ఫైనాన్స్ రెజ్యూమెలో ఫిక్స్‌డ్ అస్సెట్ అకౌంటింగ్, వాల్యూ యాడెడ్ అనాలిసిస్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటెజిక్ ప్లానింగ్, బ్యాంక్ రికాన్సిలియేషన్స్, ఫైనాన్షియల్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, కలెక్షన్ స్పెషలిస్ట్ వంటి పదాలను మీ రెజ్యూమె రచనలో ఉపయోగించండి.

మరిన్ని వార్తలు