సూటిగా.. అర్థవంతంగా.. ఆలోచన రేకెత్తించేలా!

14 May, 2014 22:25 IST|Sakshi
సూటిగా.. అర్థవంతంగా.. ఆలోచన రేకెత్తించేలా!

జ్ఞానేశ్వర్ గుమ్మళ్ల
 హైదరాబాద్

 ఫారెస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్
 వ్యాస రచన
మే 11న జరిగిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షలో అడిగిన ప్రశ్నలను బట్టి, అటవీశాఖ కొలువుల భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశ్నల సరళిలో స్పష్టమైన మార్పు కనిపించినట్లు గమనించవచ్చు. ముఖ్యంగా పార్ట్-1 (జనరల్ ఎస్సే)లో అడిగిన వ్యాస రూప ప్రశ్నల వల్ల కొన్ని అంశాలనే ఎంపికచేసుకొని ప్రిపేరయిన అభ్యర్థులు ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. గతంలో ఇంటర్నల్ ఛాయిస్ కింద ఇచ్చే 3 వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో ఒకటి పర్యావరణ సంబంధ అంశంగా ఉండేది. అందువల్ల చాలా మంది అభ్యర్థులు అడవులు, పర్యావరణం, కాలుష్యం మొదలైన అంశాలను సెలక్టివ్‌గా ప్రిపేరవడం వల్ల అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షలో ఊహించని ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా ఇప్పటికే పక్కా ప్రణాళికతో సీరియస్‌గా ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమైన వారికి మాత్రం ఈ పరీక్ష కలిసి వచ్చిందనే చెప్పాలి.
 
సామాజిక, ప్రభావిత అంశాలకే పెద్దపీట:
 ఈ పరీక్షలో మహిళలపై అత్యాచారాలు- నిర్భయ చట్టం, ఉచిత విద్య మొదలైన అంశాలపై ప్రశ్నలు రూపొందించడాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం సమాజంలోని సమస్యలు, ప్రభావిత అంశాలకు స్పష్టమైన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. కాబట్టి మే 18న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మే 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష రాయబోయే అభ్యర్థులు కరెంట్ టాపిక్‌లను దృష్టిలో ఉంచుకొని, వాటిని ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే ప్రయోజనం ఉంటుంది. అభ్యర్థులు వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకొని పునశ్చరణ చేయాలి.
 
పునశ్చరణలో ప్రాధాన్యమివ్వాల్సిన అంశాలు..
 1.    సమాచార హక్కుచట్టం (రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్)
 2.    విద్యాహక్కు చట్టం (రైట్ టు ఎడ్యుకేషన్)
 3.    వాల్టా చట్టం (వాటర్ లాండ్ అండ్ ట్రీ యాక్ట్ -2002)
 4.    అటవీ హక్కుల చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ -2006)
 5.    నిర్భయచట్టం
 6.    భారతదేశ ప్రజాస్వామ్యం-ఎదుర్కుంటున్న సమస్యలు
 7.    భారత వ్యవసాయ రంగం, రైతులు-ఎదుర్కుంటున్న సమస్యలు
 8.    బాల కార్మికులు
 9.    జీవ వైవిధ్యం- జీవ వైవిధ్య చట్టం
 10.    లోక్‌పాల్, లోకాయుక్త చట్టం
 11.    అవినీతి- కారణాలు- ప్రభావం- పరిష్కారాలు
 12.    సంప్రదాయేతర ఇంధన వనరులు
 13.    గ్లోబల్ వార్మింగ్ (భూ తాపం)
 
ప్రశ్న ఎంపిక-స్కోరింగ్‌కు కీలకం:
 ఇచ్చిన మూడు వ్యాసరూప ప్రశ్నల్లో ఏ ప్రశ్నను ఎంచుకొని సమాధానం రాస్తారనే నిర్ణయంపై మార్కుల సాధన ఆధారపడి ఉంటుంది.
 
అభ్యర్థి మూడు ప్రశ్నల్లో తనకు పూర్తిగా పట్టున్న అంశాన్నే ఎంచుకోవాలి.
వీలైతే శోధనాత్మక సమాధానాన్ని ఆశించే ప్రశ్నను ఎన్నుకోవడం వల్ల అభ్యర్థి పరీక్ష రాసే సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా తక్కువ సమయంలోనే సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పశ్నను ఎంచుకున్న తర్వాత, అంశానికి సంబంధించిన సమాచారాన్ని వేగంగా జ్ఞప్తికి తెచ్చుకొని ముఖ్యమైన పాయింట్ల ను రఫ్‌వర్క్ కింద సమాధాన పత్రం చివరి పేజీలో నోట్ చేసుకోవాలి.
 
వ్యాసం రాయడానికి ఉన్న 60 నిమిషాల
(గంట) సమయంలో మొదటి 5 నుంచి 10 నిమిషాలు రఫ్‌వర్క్‌కు కేటాయించాలి.
 ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోవడం వల్ల సంబంధిత వ్యాసాన్ని ప్రభావవంతంగా
 రాయవచ్చు. తద్వారా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
ఉదా:
     ఎ)    అటవీహక్కుల చట్టం - ప్రాధాన్యం (వివరణాత్మక సమాధానం కోరే ప్రశ్న)
     బి)    అటవీ హక్కుల చట్టం- పర్యావరణానికి రక్షణ కవచం. సమర్థిస్తారా?
                                  (శోధనాత్మక, వాదనతో కూడిన ప్రశ్న)
 
పైన పేర్కొన్న ఏ ప్రశ్నకైనా సమాధానం రాయాలనుకున్నప్పుడు
 - అటవీహక్కుల చట్టం అవసరం ఏమిటి?
 -  ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
 - ఎవరిని ఉద్దేశించి ఈ చట్టాన్ని రూపొందించారు?
 - లబ్ధిదారులకు ఏవిధంగా ఉపయోగపడుతుంది?
 - పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
 - ఈ చట్టం దుర్వినియోగం అవుతుందా? అయితే కారణాలేంటి?
 - చట్టం అమల్లో లోపాలు- వాటిని అధిగమించడానికి సూచనలు
 ఈ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్లను రఫ్‌వర్క్ కింద నోట్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
 ప్రధానంగా వ్యాసంలో 1. ఉపోద్ఘాతం 2. విషయం - వివరణ 3. ముగింపు ఉంటాయి.
 ఉపోద్ఘాతంలో ప్రశ్నలో ఇచ్చిన అంశానికి సంబంధించిన పూర్వ పరిచయం, ప్రస్తుతం దాని అవసరం, స్థితి గురించి రాయాలి. తర్వాత పేరాగ్రాఫ్‌లో వ్యాసానికి అనుసంధానమైన విషయాలను రాయాలి.
 ఉదా: అటవీ హక్కుల చట్టం గురించి వ్యాసం రాసేటప్పుడు..
 
ఉపోద్ఘాతం (ఇంట్రడక్షన్):
 భారత దేశ అటవీ ప్రాంతంలో తరతరాల నుంచి నివసిస్తూ సొంతభూమిలేని నిరుపేద గిరిజనులకు వ్యవసాయం చేసుకోవడానికి, సొంత భూమిని కల్పించేందుకు రూపొందించిన చట్టమే అటవీహక్కుల చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్). దీనికి 2006 డిసెంబర్ 18న పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించారు.
 
విషయం:
 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల్లో చాలామంది సొంత భూమి లేక ఉపాధి కోసం గ్రామాలను వదల్లేక బాధపడుతున్నారు. అలాంటి కుటుంబాలకు ఈ చట్టం భరోసానిస్తూ వ్యవసాయాధార గిరిజన కుటుంబాలకు సొంతభూమిని కల్పిస్తోంది.
 
గత మూడు తరాలుగా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నా, గిరిజన కుటుంబానికి సొంత భూమి లేకపోవడం, వ్యవసాయం కాకుండా మరే ఇతర ఆదాయ వనరులు లేకపోవడం మొదలైన అంశాల ఆధారంగా గిరిజన కుటుంబాలకు వారు సాగుచేస్తున్న అటవీభూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రికమండేషన్‌తో జిల్లా అటవీ హక్కుల కమిటీ ద్వారా యాజమాన్య హక్కులు పొందుతారు. ఈ క్రమంలో ఇక్కడ చట్టం ఎలా అమలవుతోంది? ఎలా దుర్వినియోగం అవుతుందో చక్కని పదాలతో వివరించాలి.
 
రెండో పేరాగ్రాఫ్‌లో:
 - ఇప్పటివరకు 1,67,000 గిరిజన కుటుంబాలకు 4.77 లక్షల ఎకరాల అటవీభూములపై యాజమాన్య పట్టాలిచ్చారు. ఇది అడవుల అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించాలి.
 - భవిష్యత్‌లో అడవుల సంరక్షణ - ఎదురయ్యే ఒత్తిళ్లు మొదలైన అంశాలను కూలంకషంగా తెలియజేయాలి.
 - చివరగా ఈ చట్టం వల్ల రుణాత్మక, ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ, నిజమైన అర్హులకు ఈ చట్టం ఆవశ్యకతను వివరిస్తూ... చట్టం అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ముగించాలి.  
 
మెరుగైన మార్కులకు చిట్కాలివే..
 - చట్టాల గురించి రాసేటప్పుడు వాటి అమలుతీరు, ఫలితాలను వివరిస్తే... వ్యాస నిర్మాణం స్పష్టంగా ఉండి మెరుగైన స్కోరింగ్‌కు దోహదపడుతుంది.
- ముగింపులో సృజనాత్మక సూచనలు మంచి మార్కులను తెచ్చిపెడతాయి.
- వ్యాసంలో ఉపయోగించే పదాలు సరళంగానూ, వ్యక్తిగతంగా ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండకుండా జాగ్రత్తపడాలి.
- రఫ్‌వర్క్‌లో నోట్ చేసుకున్న పాయింట్స్‌తో పాటు వ్యాసం మధ్యలో కొత్తగా స్ఫురించిన పాయింట్స్‌ను సందర్భానుసారంగా ఉపయోగించాలి.
- దస్తూరి (చేతిరాత) ఆకట్టుకునేలా ఉంటే మంచిది. అందంగా లేకపోయినా కొట్టివేతలు, దిద్దుబాట్లు ఎక్కువగా లేకుండా జాగ్రత్తపడాలి.

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా