జీపీఎస్ టెక్నాలజీ

6 Oct, 2016 00:31 IST|Sakshi
జీపీఎస్ టెక్నాలజీ

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).. సమాచార, ప్రసార రంగాల్లో అద్భుత సాంకేతిక విప్లవం. ప్రపంచ మార్గదర్శిగా పేరుగాంచిన ఆవిష్కరణ. ఎక్కడికైనా వెళ్లాలంటే.. దారి తెలియదన్న బాధ లేదు.. ఎలా వెళ్లాలి? అనే టెన్షన్ అవసరం లేదు. ఏ వీధికి ఎలా వెళ్లాలో.. ఎక్కడ  ఏ మలుపు తిరగాలో అన్నీ అదే చూపెడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ నుంచి మిలిటరీ వరకూ.. అన్ని విభాగాల్లో విరివిగా వాడుకలో ఉంది. అసలు జీపీఎస్ టెక్నాలజీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
 
Global Positioning System
 జీపీఎస్ అంటే
 ఒక ప్రదేశానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం, దూరాన్ని అంచనా వేయడం, గమ్యాన్ని గుర్తించడం, సమయాన్ని లెక్కించడం, మ్యాపింగ్ వంటి విషయాల్లో జీపీఎస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మొబైల్, వాహన, రక్షణ రంగాలతోపాటు వ్యవసాయం, సినిమా, రవాణా, ఐటీ రంగాల్లో జీపీఎస్ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థను తొలిసారి 1978లో అమెరికా రక్షణ విభాగం.. నవ్‌స్టార్ పేరిట ప్రారంభించింది. 1994లో 24 శాటిలైట్లతో పూర్తిస్థాయి నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు అమెరికా జీపీఎస్ టెక్నాలజీనే వినియోగించుకుంటున్నాయి.
 
 పనితీరు
 మొదట భూమిపై ఉండే సమాచారాన్ని జీపీఎస్ సర్వర్ల ద్వారా ఉపగ్రహాలు స్వీకరిస్తాయి. అంటే.. సమాచారం భూమి నుంచి అంతరిక్షానికి చేరుతుంది. అక్కడ నుంచి వినియోగదారుల అభ్యర్థన మేరకు ఆ సమాచారం యూజర్‌కు చేరుతుంది. తర్వాత యూజర్ నుంచి గమ్యానికి చేరుతుంది. ఇలా త్రికోణమితి (ట్రయాంగిల్) విధానంలో సిగ్నల్స్ నిరంతరం ప్రసారమవుతూ ఉంటాయి. 2డీ పొజిషన్ (అక్షాంశ, రేఖాంశాల) ఆధారంగా కనీసం మూడు శాటిలైట్లు రేడియో సిగ్నల్స్ ద్వారా కదలికలను ట్రాక్ చేస్తాయి. ఒకసారి యూజర్ పొజిషన్‌ను గుర్తించిన తర్వాత.. వేగం, ట్రాకింగ్, ఒక స్థానం నుంచి మరో స్థానానికి మధ్య ఉన్న దూరం, ప్రయాణ దూరం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అంశాలను జీపీఎస్ సర్వర్లు పరిగణలోకి తీసుకుంటాయి. భూమి నుంచి 12 వేల మైళ్ల దూరంలోని కక్ష్యలో ఉన్న జీపీఎస్ వ్యవస్థలో శాటిలైట్లు రోజంతా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి సుమారు గంటకు 7 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి.
 
 జీపీఎస్ ఉపయోగాలు
  శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా మానవుడి దైనందిన జీవితంలో కూడాజీపీఎస్ సేవలు ఎలా ఉపయోగపడు
 
 తున్నాయో చూద్దాం..
 పిల్లలు, మహిళలు, ఇతర కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంట్లో నుంచే వాహన కదలికలను
 గమనించవచ్చు.
 
 దొంగతనానికి గురైన వాహనాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పట్టుకోవడానికి వినియోగిస్తారు.
 
 భూ, వాయు, జల మార్గాల్లో వాహన చోదకులకు (డ్రైవర్లు, పైలట్లు) దిశానిర్దేశం చేయొచ్చు.
 
 సర్వేలు, మ్యాపింగ్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
 కేసుల విచారణ సమయంలో పోలీసులు ఎక్కువగా జీపీఎస్‌పై ఆధారపడతారు.
 వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను జీపీఎస్ ద్వారానే అంచనా వేస్తారు.
 వాహనాలకు జీపీఎస్ టెక్నాలజీని అమర్చడం ద్వారా అక్రమ రవాణాలను, చోరీలను సులభంగా గుర్తించవచ్చు, నియత్రించవచ్చు.
 అడవులు, వన్య మృగాల పర్యవేక్షణలో అటవీ శాఖ జీపీఎస్ టెక్నాలజీపైనే ఆధారపడుతోంది.
 
 
 జీపీఎస్ బేస్డ్ మెషీన్ గెడైన్స్ సిస్టం ద్వారా నిర్మాణ రంగం, మైనింగ్ వంటి విభాగాల్లో భారీ పరికరాలను ఆపరేట్ చేస్తారు.
 
 వ్యవసాయ రంగంలో పంట పొలాలను పరిశీలించడం, పర్యవేక్షణ, మందులను పిచికారీ, పంట కోయడం వంటి పనులకు వాడే కొన్ని పరికరాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
 
 ట్రాఫిక్ నియంత్రణలో, బైకులు, కార్ రేసింగ్‌లలో ఈ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు.
 
 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి, సముద్రం లోపల దిశానిర్దేశం చేయడానికి, విపత్కర పరిస్థితుల్లో ఆచూకీ తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
 ఠ రక్షణ రంగంలో ఎక్కువగా ఈ జీపీఎస్ టెక్నాలజీని వినియోగిస్తారు. యుద్ధ సమయాల్లో శత్రువుల ఆచూకీ, సమయం తెలుసుకోవడానికి, సైనికులకు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
 
 కొన్ని జీపీఎస్ ఆధారిత యాప్‌లు
Explore Around You
 మీరు ఒక ప్రదేశానికి వెళ్లాలనుకున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో మీకు తెలుసు. కానీ అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? హోటల్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? వంటి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఇందులో ఉండే అప్షన్లలో ప్రధానమైంది ‘డిస్టెన్స్ రేడియస్’. దీని ద్వారా మీరున్న చోటుకి నిర్ణీత దూరంలో ఉన్న వాటిని తెలుసుకోవచ్చు. అలాగే ‘టైం ఆఫ్ డే’ ఆప్షన్ నిర్ణీత సమయంలో అందుబాటులో ఉన్నవాటిని మాత్రమే చూపుతుంది. ఉదాహరణకు మీరో కాఫీ షాప్‌ని సెలెక్ట్ చేశారనుకోండి.. అది మీరున్న చోటుకి ఎంత దూరంలో ఉంది? అందులో ధరలు, ఫోన్ నంబర్లు, అడ్రస్, కాఫీ షాపు ఫొటోలు వంటి వివరాలను మీ కళ్ల ముందుంచుతుంది.
 
 నెట్ లేకుంటే
 జీపీఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. . MAPS.MEలాంటి ఆఫ్‌లైన్‌లో పనిచేసే యాప్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు... జీపీఎస్ డేటా మొబైల్‌లోకి డౌన్‌లోడ్ అయి పనిచేస్తుంది. ఈ యాప్ డౌన్‌లోడ్ కోసం http://goo.gl/XIqbZr ఛోట లింక్‌ని చూడండి.
 
 రెండింటిలోనూ..
 స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ రెండింటిలోనూ జీపీఎస్ నేవిగేషన్ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటున్నారా..? అయితే  MapFactor GPS Navigation  యాప్‌ని ఇన్‌స్టాల్‌ని చేసుకోండి. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయగానే ఆఫ్‌లైన్‌లో వాడుకునేందుకు వీలుగా మ్యాప్ డేటా మొత్తం ఎస్‌డీ కార్డ్‌లో సేవ్ అవుతుంది. వివిధ భాషల్లో నేవిగేషన్‌ని పొందగలిగే ఈ యాప్ అప్‌డేట్స్‌ని ప్రతినెలా ఉచితంగా పొందొచ్చు. 2డీ, 3డీ రూపాల్లో మ్యాప్ డిస్‌ప్లే కనిపించడం ఈ యాప్ ప్రత్యేకత.
 
 అడుగు దూరంలో మన జీపీఎస్
 అగ్రరాజ్యం అమెరికా విసిరిన సవాలుకు దీటుగా జవాబు చెప్పేందుకు ఇస్రో చేపట్టిన బృహత్తర కార్యమే.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్  (Indian Regional Navigation Satellite System).ఈ శాటిలైట్ వ్యవస్థ ద్వారా స్వదేశీ జీపీఎస్ వ్యవస్థ కల సాకారం కానుంది. ఇప్పటివరకు అమెరికా ఆధీనంలో ఉన్న జీపీఎస్ సేవల్నే చాలా దేశాలు వినియోగించుకుంటున్నాయి. క్లిష్ట సమయాల్లో సేవలు అందించడంలో మెలికపెడుతూ అమెరికా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది.
 
 కార్గిల్ యుద్ధ సమయంలో జీపీఎస్ సేవల వినియోగం, సమాచార సేకరణలో అమెరికా నుంచి మన దేశానికి ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా స్వదేశీ జీపీఎస్ వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం, ఇస్రో పనిచేస్తున్నాయి. ఈ సేవలు అందుబాటులో వస్తే మిలిటరీ, పౌర, వాణిజ్య సేవల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. రెండు రకాల సేవలందించే ఈ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్(ఎస్‌పీఎస్). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్(ఆర్‌ఎస్). ఇది మిలిటరీ లాంటి కొన్ని విభాగాలకు అందుబాటులో ఉండబోతోంది.
 

మరిన్ని వార్తలు