వెలుగులీనే కెరీర్‌కు.. గ్రాఫిక్ డిజైనింగ్

3 Aug, 2014 01:33 IST|Sakshi
వెలుగులీనే కెరీర్‌కు.. గ్రాఫిక్ డిజైనింగ్

అప్‌కమింగ్ కెరీర్: సృజనాత్మకత, కష్టపడే తత్వం ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. గ్రాఫిక్ డిజైనింగ్. నేటి ఆధునిక యుగంలో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏదైనా వస్తువు వినియోగదారుడిని ఆకట్టుకోవాలంటే.. అది ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు ఏకైక మార్గం.. గ్రాఫిక్ డిజైనింగ్. నేడు అన్ని రంగాల్లో గ్రాఫిక్స్ అనివార్యంగా మారాయి. దీంతో నైపుణ్యం కలిగిన డిజైనర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. దేశ విదేశాల్లో వీరికి మంచి వేతనాలు అందుతున్నాయి. ఇందులోకి ప్రవేశించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవసరానికి సరిపడ గ్రాఫిక్ డిజైనర్లు ప్రస్తుతం మనదేశంలో లేరని నిపుణులు చెబుతున్నారు.
 
 సృజనాత్మకతే ఏకైక సాధనం
 డిజైనర్లకు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు వీరిని నియమిస్తు న్నాయి. అడ్వర్‌టైజింగ్, ప్రొడక్ట్ డిజైన్, లోగో డిజైన్, వార్తా పత్రికలు, వెబ్‌సైట్లు, పోర్టళ్ల డిజైనింగ్ వంటి వాటిలో అవకాశాలున్నాయి. ప్యాకేజింగ్ సంస్థలు, డిజైన్ స్టూడియోల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. నగరాలతోపాటు ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ డిజైన్ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. ఆసక్తి ఉంటే సొంతంగా ఒక స్టూడియోను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక సినిమాలు, టీవీ సీరియళ్లలో కూడా వీరికి సంతృప్తికరమైన వేతనాలతో ఆఫర్లు అందుతున్నాయి.
 
 గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే.. సృజనాత్మకతే ఏకైక సాధనం. క్లయింట్లకు సంతృప్తిని కలిగించే ఔట్‌పుట్ ఇస్తే అవకాశాలకు, ఆదాయానికి లోటుండదు. వినియోగదారుల అభిరుచులను తెలుసుకొనే నేర్పు ఉండాలి. మార్కెట్‌లో ఎక్కడ అవకాశాలు లభిస్తాయో తెలుసుకోవాలి. ప్రారంభంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటే కెరీర్‌లో త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డిజైన్ ట్రెండ్స్‌ను నిశితంగా పరిశీలిస్తూ స్కిల్స్ పెంచుకోవాలి. ఈ రంగంలో ఫ్రీలాన్స్ డిజైనర్‌గా కూడా పనిచేసుకోవచ్చు.
 
 అర్హతలు: గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమాలో చేరాలంటే ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేయొచ్చు. పీజీలో చేరడానికి గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
 
 వేతనాలు: గ్రాఫిక్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు పనిచేసి నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే అందుకోవచ్చు. మనదేశంలో నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే డిజైనర్లు ఎందరో ఉన్నారు.
 
గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.jnafau.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
 వెబ్‌సైట్: www.nid.edu
ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
 వెబ్‌సైట్: www.mitid.edu.in
ఆర్క్ ఆకాడమీ ఆఫ్ డిజైన్
వెబ్‌సైట్: www.archedu.org
 
 ఎవర్‌గ్రీన్.. గ్రాఫిక్ డిజైనింగ్  
 శ్రీఅప్లయిడ్ ఆర్ట్స్/ గ్రాఫిక్ డిజైన్ కోర్సులు ఎవర్‌గ్రీన్. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ వీటికి డిమాండ్ ఏర్పడుతోంది. గ్లోబలైజేషన్‌తో రిటైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వస్తువుల విక్రయానికి ప్రకటనలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తులను ఎంత ఆకర్షణీయంగా రూపొందించి, వినియోగదారుల్లోకి తీసుకెళ్లగలిగితే అంతగా మార్కెట్ పెరుగుతుంది. ప్రకటనల నుంచి సినిమాల వరకూ అన్నిచోట్లా సృజనాత్మకతకే అగ్రస్థానం. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత పెరిగింది.
 
 ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారంటే వారిలో ఎంతోకొంత క్రియేటివిటీ ఉందనే అర్థం. అకడమిక్‌గా ఎన్ని అర్హతులున్నా నైపుణ్యం లేకుంటే తమ రంగంలో రాణించలేరు. గ్రాఫిక్ డిజైనర్లకు ప్రకటనలు, మీడియా, ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్‌మెంట్ డిజైన్, ప్రింట్, పబ్లికేషన్ ఇండస్ట్రీ, మల్టీమీడియా, సోషల్ మీడియా రంగాల్లో  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఇంటరాక్టివ్ మీడియా డిజైనర్స్, అడ్వర్‌టైజింగ్- కమ్యూనికేషన్, ప్యాకేజింగ్ డిజైనర్, క్రియేటివ్ ప్రొడక్ట్ వంటి విభాగాల్లో సొంతంగా పనిచేసుకోవడంతోపాటు మరికొంతమందికి ఉపాధి చూపించవచ్చ్ణు
- ప్రొఫెసర్ బి.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్,
 జవహర్‌లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్

మరిన్ని వార్తలు