ఆసక్తే ఆవిష్కరణలకు పునాది

19 Nov, 2016 23:16 IST|Sakshi
ఆసక్తే ఆవిష్కరణలకు పునాది

 ‘వినూత్న ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలకు
 పునాది సహజమైన ఆసక్తి. అది ఉంటే ఏ
 రంగంలోనైనా ఇన్నోవేటర్స్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా
 దూసుకెళ్లొచ్చు. తమ ఆవిష్కరణలు సామాజిక
 ప్రగతికి దోహదం చేసేలా యువత ఆలోచించాలి.
 అప్పుడే కెరీర్ పరంగా, సామాజికంగా గుర్తింపు
 లభిస్తుంది’ అంటున్నారు అమెరికాలోని ప్రతిష్టాత్మక
 మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో
 మీడియా ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగం అసోసియేట్
 ప్రొఫెసర్ రమేశ్ రస్కర్. ఫెమ్టో ఫొటోగ్రఫీ పేరుతో ఒక
 నిర్దిష్ట వస్తువును లేదా ప్రదేశాన్ని కాంతి వేగంతో
 కెమెరాలో బంధించగలిగే ఆవిష్కరణ చేసినందుకు
 2016 సంవత్సరానికి ఐదు లక్షల డాలర్ల
 ఫెలోషిప్ (ది లెమన్సన్ ఎంఐటీ) విజేతగా నిలిచిన
 రమేశ్ రస్కర్‌తో ఈ వారం గెస్ట్ కాలమ్..

 
 గెస్ట్‌కాలమ్
 చిన్నప్పటి నుంచే: చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి పనితీరుపై ఆసక్తి ఉండేది. దీంతో బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్‌ను ఎంచుకున్నాను. పుణె ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 1991లో బీటెక్ పూర్తిచేశాక కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ కోసం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా వెళ్లాను. నూతన ఆవిష్కరణల దిశగా ముందుండాలనే తపనతో కృషిచేశాను. ఫలితంగా పీహెచ్‌డీ పూర్తయిన తర్వాత (2003లోనే) గ్లోబల్ ఇండస్ టెక్నోవేటర్ అవార్డ్ లభించింది. అప్పటి నుంచి పలు అవార్డులు, పేటెంట్లు లభించాయి. కానీ ఇప్పుడు లభించిన ఫెలోషిప్ మరింత ఉత్సాహాన్నిస్తోంది.
 
  దీని ద్వారా లభించిన డబ్బుతో రీసెర్చ్, ఇన్నోవేషన్ కార్యకలాపాలను విస్తృతం చేయాలనుకుంటున్నాను. ఈటీఎం నుంచి ఐ కేర్ వైపు..: బీటెక్, పీహెచ్‌డీల్లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ద్వారా పొందిన పరిజ్ఞానంతో సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనాలనే ఆలోచన మెదిలింది. అదే సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ తన నివేదికలో ప్రపంచంలో నేత్ర సంబంధ వ్యాధుల బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని పేర్కొంది. దీంతో కంటి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని నేత్ర సంరక్షణ పరికరాలు, నేత్ర సంబంధ వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే ఇంతకుముందు కంటికి సంబంధించి రిఫ్రాక్టివ్ ఎర్రర్ సమస్యను పరిష్కరించే పరికరాన్ని రూపొందించాను.
 
  పరిశోధనల పట్ల ఆసక్తి పెరగాలి: భారతదేశ యువతలో పరిశోధనల పట్ల ఇంకా ఆసక్తి పెరగాల్సి ఉంది. తమ ఆవిష్కరణలు కంపెనీలుగా రూపొందేందుకు గల అవకాశాలను ముందుగానే పరిశీలించుకోవాలి. లేదంటే మంచి ఆవిష్కరణలు చేసినా వాటిని అమలు చేసే అవకాశం లభించదు. తమ ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని వెంచర్ క్యాపిటలిస్ట్‌లను మెప్పించేలా వివరించడం కూడా ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. ఇన్నోవేటర్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారగలిగినప్పుడే అసలైన ఫలితాలు లభిస్తాయి. వ్యక్తిగతంగా సంతృప్తి లభిస్తుంది.
 
  ఇన్‌స్టిట్యూట్ స్థాయిలో ప్రోత్సాహం: పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఇన్‌స్టిట్యూట్ స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వాలి. నేను పీహెచ్‌డీ కోసం చేరిన యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలోని ఫ్యాకల్టీ, ఇండివిడ్యువల్ రీసెర్చ్ ఫ్యాకల్టీ తమ విద్యార్థులు కూడా రీసెర్చ్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకునేలా సహకారం అందించారు. ఇది ఎంతో కలిసొచ్చింది. ముఖ్యంగా నాకు ఇష్టమైన రోబోటిక్స్, ఇమేజింగ్ విభాగాల్లో అప్పట్లో చక్కటి ప్రోత్సాహం లభించింది. ఇలాంటి వాతావరణమే భారత ఇన్‌స్టిట్యూట్‌లలోనూ కల్పించాలి.
 
 సద్వినియోగం చేసుకుంటేనే  భవిష్యత్తు
 యువతకు ఇప్పుడు అకడమిక్, కెరీర్, పరిశోధనల పరంగా ఎన్నో వేదికలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉన్న వారు బ్యాచిలర్ స్థాయి నుంచే తమను తాము సైంటిస్ట్‌లుగా భావించుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఈ విషయంలో తమను తామ తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఆసక్తి చూపే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెంటార్లు సైతం ముందుకు వస్తారు. అలాగే ఇన్నోవేషన్స్ పరంగా ‘గివింగ్ బ్యాక్ టు సొసైటీ’ అనే దృక్పథం ఎంతో అవసరం!!
 

మరిన్ని వార్తలు