ఉద్యానంలో ఉజ్వల భవిత!

9 Jan, 2014 14:16 IST|Sakshi

వ్యవసాయం.. మానవ నవ జీవనానికి ఆరోప్రాణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని! లక్షలు ఆర్జించే కొలువులను కాదని కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పొలం బాట పడుతుంటే, మరికొందరు ఉన్నతోద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. వ్యవసాయం అంటేనే ఒకప్పుడు నిర్లక్ష్యపు చూపు చూసిన యువత నేడు ‘పంటల’ కోర్సులపై మక్కువ పెంచుకుంటోంది.. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధరంగమైన ఉద్యానశాఖలో ఉద్యోగావకాశాలు, కోర్సులు, భవిష్యత్ అవకాశాలు తదితర అంశాలపై డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి.ఎం.సి.రెడ్డితో ‘భవిత’ ఇంటర్వ్యూ..


 

డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు లక్ష్యాలేమిటి? వాటి సాధనలో ఎంతవరకు విజయవంతమయ్యారు?
ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వర్షాభావ పరిిస్థితులు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, సహజవనరుల (నీరు) తగ్గుదల, భూసార నిస్సారం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఉద్యాన పంటలపై చేపట్టాల్సిన పరిశోధనలు, ఉద్యాన పంటల ప్రాముఖ్యత ,అభివృద్ధి అవకాశాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 2007, జూన్ 26న ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది.
 
ఇలాంటి విశ్వవిద్యాలయం భారత దేశంలో రెండోది కావడం విశేషం. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన అనుబంధ కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు 2008, ఏప్రిల్ 1 నుంచి ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చాయి. అదే ఏడాది మే 10 నుంచి వర్సిటీ స్వయంప్రతిపత్తి హోదాతో పనిచేస్తోంది. ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా 2011, ఆగస్టు 1న మార్చారు. విద్య, పరిశోధన, విస్తరణ ముఖ్య ఉద్దేశాలుగా విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. ఇప్పుడదే లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకేస్తున్నాం.


 
 ప్రస్తుతం విశ్వవిద్యాయలం అందిస్తున్న కోర్సులేవి?
 ప్రస్తుతం హార్టికల్చరల్ పాలిటెక్నిక్, బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాం.


 
హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి అర్హతలేంటి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకు అర్హులు. ఇంటర్మీడియెట్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అనర్హులు. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి. ఏడేళ్ల విద్యా కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల (నాన్ మునిసిపల్ పరిధి) పాఠశాలలో చదివుండాలి. అలాంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి కంపార్ట్‌మెంటల్‌లో ఉత్తీర్ణులైన వారు కూడా కోర్సులో ప్రవేశాలకు అర్హులే. ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షలో సాధించిన గ్రేడ్‌ను బట్టి కోర్సుకు ఎంపిక చేస్తారు.
 
పాలిటెక్నిక్ కోర్సుల వ్యవధి ఎంత?
దీని స్వరూపం ఎలా ఉంటుంది?
కోర్సు వ్యవధి రెండేళ్లు. మొత్తం 23 సబ్జెక్ట్‌లను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిలో మొదటి ఏడాది 12, రెండో ఏట11   చొప్పున పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. వీటితో పాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌లూ ఉన్నాయి, వీటిలో ఉద్యాన పంటల సాగు, చీడపీడల నివారణ, నీటి పరివాహక ప్రాంత యాజమాన్యం, సాగుకు అనుకూలమైన నేలల గురించి పాఠ్యాంశాలుంటాయి.


 
 పాలిటెక్నిక్ హార్టికల్చర్ కోర్సులు పూర్తి చేసినవారికి ఎలాంటి అవకాశాలున్నాయి?
 ప్రభుత్వ ఉద్యానశాఖలో విస్తరణ అధికారి (హెచ్‌ఈఓ) ఉద్యోగానికి డిప్లొమా చేసినవారే అర్హులు. అలాగే ప్రైవే టు సంస్థల్లోనూ, నర్సరీలలోనూ అవకాశాలుంటాయి. ప్రాంగణ నియామకాలు కూడా నిర్వహిస్తున్నారు.


 
 బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును అందించే కళాశాలలు,  సీట్ల సంఖ్య, ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
 అనంతరాజుపేట (కడప), మోజర్ల (మహబూబ్‌నగర్), రాజేంద్రనగర్ (రంగారెడ్డి), వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి)లలో కళాశాలలు ఉన్నాయి. సీట్ల సంఖ్య 230. ఇంటర్మీడియెట్ బైపీసీ చదివి, ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ప్రాతిపదికన బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు ఉంటాయి.
 
 బీఎస్సీ హార్టికల్చర్ పూర్తిచేసిన వారికి ఎలాంటి అవకాశాలున్నాయి?
 బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ ఉద్యానశాఖ అధికారిగా స్థిరపడొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్, కన్సల్టెంట్లు, నర్సరీ, విత్తనశుద్ధి కర్మాగారాలలో అధికారులుగా ఉద్యోగావకాశాలుంటాయి. తితిదే పరిధిలో ఉద్యాన రూపకల్పన (గార్డెనింగ్ డిజైనింగ్), టూరిజం పరిశ్రమలో గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ ఉద్యోగాలకూ వీరు అర్హులే. ప్లాంట్ డాక్టర్స్‌గా, రైతులకు సలహాదారులుగా అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. సొంతంగా నర్సరీలు స్థాపించి స్వయం ఉపాధి బాటలో సాగవచ్చు. అంతేకాదు ఇతర డిగ్రీ విద్యార్థుల తరహాలో సివిల్ సర్వీసెస్, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయొచ్చు.
 
 విశ్వవిద్యాలయం పరిధిలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలలో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి?  వీటిలో ప్రవేశానికి అర్హతలేమిటి?
ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. ఫ్రూట్ సైన్స్, కూరగాయల శాస్త్రం, పూలమొక్కల పెంపకం, ల్యాండ్ స్కేపింగ్, సుగంధ ద్రవ్య, ఔషధ మొక్కల పెంపకం వంటి వాటిని స్పెషలైజేషన్లుగా ఎంపిక చేసుకోవచ్చు. రాజేంద్రనగర్, వెంకటరామన్నగూడెం, అనంతరాజుపేట, మోజర్ల కళాశాలల్లో ఎమ్మెస్సీ సీట్లున్నాయి. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశించొచ్చు. అకడమిక్ మెరిట్‌కు 50 శాతం, ప్రవేశ పరీక్షకు 50 శాతం ప్రాధాన్యమిచ్చి సీట్లను కేటాయిస్తారు. హార్టికల్చర్ పీహెచ్‌డీ కోర్సులు వెంకటరామన్నగూడెం, రాజేంద్రనగర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
 
 రాష్ట్రంలో సరిపడినన్ని కళాశాలలున్నాయని భావిస్తున్నారా?
ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలలు లేవని చెప్పొచ్చు. వీటి సంఖ్య పెంచడానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
 
 యూనివర్శిటీ పరిధిలో మొత్తం ఎన్ని పరిశోధనా కేంద్రాలున్నాయి. వీటి స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశమేంటి?
మొత్తం 27 పరిశోధనా కేంద్రాలున్నాయి. జాతీయ స్థాయి సంస్థలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), రాష్ట్ర ఉద్యాన మిషన్ ప్రాజెక్టులను పరిశోధనాంశాలుగా తీసుకుంటారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచడం, పోషక విలువల అభివృద్ధి, ఆహారభద్రత, అనుకూల వాతావరణం కల్పించడం, ఆహార పదార్థాల నిల్వ సామర్థ్యం పెంచి రైతులు మెరుగైన ఆదాయం ఆర్జించేలా చూడటం, ఎగుమతులు, ప్రాసెసింగ్ పద్ధతులను ఆవిష్కరించడం ప్రధాన లక్ష్యాలుగా పరిశోధన కేంద్రాలు ఆవిర్భవించాయి.
 
 రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రాల వివరాలు, వాటి ఏర్పాటు లక్ష్యం ఏమిటి?
 విశ్వవిద్యాలయం పరిధిలో మూడు కృషి విజ్ఞాన కేంద్రా లు ఉన్నాయి. ఇవి పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెం, తూర్పుగోదావరి జిల్లాలోని పందిరిమామిడి, కరీంనగర్ జిల్లాలోని రాంగిరిఖిల్లాలలో ఉన్నాయి. ఇవి ఉద్యాన విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం, సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మోతాదులో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, ఆయా పంటకాలాల్లో ఎదురయ్యే సమస్యలపై అన్నదాతలకు అవగాహన కల్పించడం వంటివి చేస్తున్నాయి. ఆదర్శ రైతులకు శిక్షణ, కిసాన్ మేళాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ప్రసార మాధ్యమాల ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపడం వంటి సేవలనూ కూడా అందిస్తున్నాయి.
 
 ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం పరిధిలో పరిశోధనల ఫలితంగా కనిపెట్టిన కొత్త రకం వంగడాలు ఏవైనా ఉన్నాయా?
 విశ్వవిద్యాలయం పరిధిలో ఆవిష్కరించిన కొత్త రకం వంగడాలు చాలా ఉన్నాయి. మామిడిలో మంజీర, కేఎంహెచ్-1, నీలేషాన్, నీలుద్దీన్, నీల్ గోవా, స్వర్ణ వంటివి ఉన్నాయి. నిమ్మ: బాలాజీ. అరటి: కొవ్వూరు బొంత. జామ: సఫేద్ జామ్, కోహిర్ సఫేదా. కంద: గజేంద్ర. చిలగడదుంప: సామ్రాట్, కిరణ్, ఆర్‌ఎన్‌ఎస్‌పీ-1. కొబ్బరి: గోదావరి గంగ, డబుల్ సెంచరీ, గౌతమి గంగ, కేరా బస్తర్, కల్ప ప్రతిభ. వంగ: భాగ్యమతి, గులాబి, శ్యామల. పొట్లకాయ, చిక్కుడు, గుమ్మడికాయ, మిరప వంటి పంటలకు సంబంధించి కూడా కొత్త వంగడాల ఆవిష్కరణ జరిగింది.
 
పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలలో నిర్వహించే పరిశోధనల్లో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారా?
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనల్లో భాగస్వాములను చేస్తుంటాం. అలాగే విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
 
 యూనివర్సిటీ పరిధిలో రైతులను ఏ విధంగా చైతన్యపరుస్తున్నారు?
కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) ద్వారా రైతులకు పంటసాగు, ఉత్పత్తి పెంచడంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక రైతు శిక్షణ కేంద్రం వెంకటరామన్న గూడెం కేవీకేకు అనుబంధంగా ఉంది.
 
 ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నారా? వీటిద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి?
 విశ్వవిద్యాలయంలో ఆంధ్రాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, రుచి సోయా ఇండస్ట్రీస్, విభా సీడ్స్, క్యాడ్‌బరి ఇండియా సంస్థలు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. ఆకర్షణీయమైన వేతనాలతో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి.
 
 
 వై.మురళీకృష్ణ
 -  న్యూస్‌లైన్, తాడేపల్లిగూడెం.
 
 బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ ఉద్యానశాఖ అధికారిగా స్థిరపడొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్, కన్సల్టెంట్లు, నర్సరీ, విత్తనశుద్ధి కర్మాగారాలలో అధికారులుగా ఉద్యోగావకాశాలుంటాయి.
 
 ఎమ్మెస్సీ హార్టికల్చర్ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. ఫ్రూట్ సైన్స్, కూరగాయల శాస్త్రం, పూలమొక్కల పెంపకం, ల్యాండ్ స్కేపింగ్, సుగంధ ద్రవ్య, ఔషధ మొక్కల పెంపకం వంటి వాటిని స్పెషలైజేషన్లుగా ఎంపిక చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు